రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ క్రీడల్లో 8 స్వర్ణాలతో సహా మొత్తం 16 పతకాలను సాధించిన భారత సైనిక బృందంతో సమావేశమైన రక్షణ మంత్రి

'సైనికుడు’, 'ఛాంపియన్' అయిన ఈ క్రీడాకారులు ఎంతో స్ఫూర్తిదాయకం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 14 AUG 2026 3:31PM by PIB Hyderabad

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 16 పతకాలు - 08 స్వర్ణాలు, 07 రజత పతకాలు, 01 కాంస్య పతకం సాధించిన భారత సైనిక దళ సభ్యులతో ఆగస్టు 14, 2026న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ క్రీడల్లో భారత్ 39 పతకాలు- 13 స్వర్ణం, 17 రజతం, 09 కాంస్య పతకాలు సాధించగా… అందులో భారత రక్షణ శాఖ సిబ్బంది 18 పతకాలను (16- భారత ఆర్మీ, 02- భారత నేవీ) గెలుచుకున్నారు.

అంతర్జాతీయ క్రీడా కార్యక్రమంలో శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత రక్షణ దళాల దృఢమైన సంకల్ప శక్తిని, బలమైన విశ్వాసాన్ని రక్షణమంత్రి ప్రశంసించారు. ఈ విజయాన్ని "అసాధారణం" అని అభివర్ణిస్తూ.. "సైనికుడు, ఛాంపియన్ల" అద్భుత కలయిక ఈ క్రీడాకారులు అని అన్నారు. వీరు ప్రజలకు, యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

భారతదేశంలో పెరుగుతున్న నారీ శక్తికి నిదర్శనంగా బాక్సింగ్‌లో 06 స్వర్ణ పతకాలకుగాను, మహిళా బాక్సర్లు 04 స్వర్ణ పతకాలను సాధించారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ విజయం మరింత మంది బాలికలు క్రీడా రంగంలోకి వచ్చేందుకు, రక్షణ రంగంలో చేరేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రతీ ప్రాంతం నుంచి ఛాంపియన్లు పుట్టుకొస్తున్నారని రక్షణ మంత్రి అన్నారు. ఇవాళ క్రీడా రంగం అందరికీ అందుబాటులో ఉందని, ఇకపై కొద్దిమందికి మాత్రమే చెందిన ప్రత్యేకమైన హక్కు కాదని స్పష్టం చేశారు. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి రాబోయే క్రీడా కార్యక్రమాల కోసం అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సైనికదళాల ప్రధానాధికారి జనరల్ ధీరజ్ సేత్, ఇతర సీనియర్ సైనికాధికారులు పాల్గొన్నారు. 2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత సైనిక బృందం అనేక ప్రథమాలను, రికార్డులను నమోదు చేసింది. అవి:

 
  • కామన్వెల్త్ గేమ్స్‌లో పారా షాట్‌పుట్‌లో భారతదేశానికి తొలి స్వర్ణ, రజత పతకాలను సాధించి సుబేదార్ సోమన్ రాణా, లాన్స్ నాయక్ శుభం జుయల్ చరిత్ర సృష్టించారు.

  • వెయిట్‌లిఫ్టింగ్‌లో 79 కేజీల విభాగంలో హవాల్దార్ అజయ్ బాబు రికార్డు సృష్టించారు. స్నాచ్‌లో 149 కేజీలతో రికార్డు సృష్టించటంతో పాటు మొత్తం 330 కేజీల బరువును ఎత్తి అద్భుతమైన ప్రదర్శనను నమోదు చేశారు.

  • బాక్సింగ్‌లో 100 ఏళ్ల నాటి ఇంగ్లీష్ రికార్డును బద్దలు కొట్టి అపూర్వమైన జాతీయ ఘనతను సాధించటంలో భారత సైన్యం చరిత్రాత్మక పాత్రను పోషించింది. ఈ క్రీడల ఒకే ఎడిషన్‌లో బాక్సింగ్‌లో ఏ దేశమూ గెలుచుకోనన్ని అత్యధికంగా ఏడు స్వర్ణ పతకాలను భారత్ గెలుచుకుంది. ఈ 7 స్వర్ణ, 3 రజత పతకాల్లో భారత సైన్యానికి చెందిన బాక్సర్లు 6 స్వర్ణాలు, 2 రజతాలను కైవసం చేసుకున్నారు.

  • హైజంప్‌లో నాయిబ్ సుబేదార్ సర్వేశ్ కుషారే భారత్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రజత పతకాన్ని సాధించి, భారత అథ్లెటిక్స్‌లో కీలక విజయాన్ని అందుకున్నారు.

  • ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు అథ్లెటిక్స్ పతకాలు గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నాయిబ్ సుబేదార్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఆయన 10,000 మీటర్ల విభాగంలో రజతం, 5,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించారు.

  • 60 కేజీల విభాగంలో పోటీపడిన హవాల్దార్ హర్ష్, కామన్వెల్త్ గేమ్స్‌… జూడోలో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని సాధించి, దేశంలో ఈ క్రీడలో నూతన అధ్యాయానికి నాంది పలికారు.

 

అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పాటు మిషన్ ఒలింపిక్ వింగ్, దాని హై పర్ఫార్మెన్స్ నోడ్స్ సంవత్సరాల తరబడి క్రమశిక్షణతో కూడిన శిక్షణ, త్యాగం, వృత్తిపరమైన కోచింగ్, క్రీడా విజ్ఞానశాస్త్ర మద్దతు, క్రీడాకారుల అత్యుత్తమ పనితీరు పట్ల అచంచలమైన నిబద్ధతను ఈ విజయాలు తెలియజేస్తాయి. గ్లాస్గోలో దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన భారత రక్షణ శాఖ సిబ్బంది జాబితా:

స్వర్ణ పతక విజేతలు

  1. హవాల్దార్ సాక్షి - బాక్సింగ్ (51 కేజీలు)

  2. నాయిబ్ సుబేదార్ ప్రీతి - బాక్సింగ్ (54 కేజీలు)

  3. నాయిబ్ సుబేదార్ జాస్మిన్ - బాక్సింగ్ (67 కేజీలు)

  4. హవాల్దార్ అరుంధతి చౌదరి - బాక్సింగ్ (70 కేజీలు)

  5. హవాల్దార్ సచిన్ శివాచ్ - బాక్సింగ్ (60 కేజీలు)

  6. హవాల్దార్ అంకుష్ - బాక్సింగ్ (80 కేజీలు)

  7. హవాల్దార్ హర్ష్ సింగ్ - జూడో (60 కేజీలు)

  8. సుబేదార్ సోమన్ రాణా - పారా షాట్ పుట్ (ఎఫ్-57)

 

రజత పతక విజేతలు

  1. లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) నీరజ్ చోప్రా - జావెలిన్ త్రో

  2. నాయిబ్ సుబేదార్ సర్వేశ్ - హై జంప్

  3. హవాల్దార్ జాదుమణి సింగ్ - బాక్సింగ్ (55 కిలోలు)

  4. సుబేదార్ నరీందర్ - బాక్సింగ్ (90 కిలోలు)

  5. హవాల్దార్ అజయ్ బాబు - వెయిట్ లిఫ్టింగ్ (79 కిలోలు)

  6. నాయిబ్ సుబేదార్ గుల్వీర్ - 10,000 మీటర్లు

  7. లాన్స్ నాయక్ శుభమ్ జుయల్ - పారా షాట్ పుట్ (F-57)

  8. సీపీఓ సీఓఎం(టీఈఎల్) లవ్‌ప్రీత్ సింగ్ - వెయిట్‌లిఫ్టింగ్ (+110 కిలోలు)

  9. సీపీఓ (పీటీ) చనంబామ్ రిషికాంత సింగ్ - వెయిట్ లిఫ్టింగ్ (60 కిలోలు)

కాంస్య పతక విజేత

1. నాయిబ్ సుబేదార్ గుల్వీర్ - 5,000 మీటర్లు

 

***


(రిలీజ్ ఐడి: 2299635) సందర్శకుల సూచీ సంఖ్య : : 44
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil