ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగిసిన రెండు రోజుల ఐసీఎంఆర్‌-షైన్‌ 2026 సదస్సు.. వేలాది మంది యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను రేకెత్తించిన కార్యక్రమం


స్వస్థ్‌, వికసిత్ భారత్ లక్ష్యంగా సుదూర, గ్రామీణ ప్రాంతాలకు బయోమెడికల్ పరిశోధనలను చేర్చిన ఐసీఎంఆర్.. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 83 వేదికల్లో నిర్వహణ


నాగ్‌పూర్, గోరఖ్‌పూర్‌లోని మొబైల్ బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలను నేరుగా పరిశీలించిన విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ప్రత్యక్ష శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రయోగాత్మక కార్యక్రమాలు


ఢిల్లీలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రజారోగ్య పరిష్కారాలను ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలు


షైన్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఐసీఎంఆర్‌.. నిజజీవిత ప్రజారోగ్య సవాళ్లపై జాతీయ స్థాయి పాఠశాల పోటీల ప్రకటన, 2026 సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తుల స్వీకరణ


పరిశోధనా రంగ అనుభవాన్ని స్వాగతించిన పాఠశాలలు, ఉపాధ్యాయులు.. విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలను మరింత తరచుగా నిర్వహించాలని పిలుపు

प्रविष्टि तिथि: 13 AUG 2026 5:21PM by PIB Hyderabad

కేంద్ర వైద్య పరిశోధన విభాగం- భారత వైద్య పరిశోధనా మండలి (డీహెచ్‌ఆర్‌-ఐసీఎంఆర్‌) సంయుక్తంగా చేపట్టిన ఐసీఎంఆర్‌-షైన్‌ (సైన్స్, హెల్త్ ఇన్నోవేషన్ ఫర్ ది నెక్స్ట్‌జెన్ ఎక్స్‌ప్లోరర్స్) రెండో విడతను 2026 ఆగస్టు 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. బయోమెడికల్, ప్రజారోగ్య పరిశోధనల రంగాన్ని పాఠశాల విద్యార్థులకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘ఒక్క రోజు శాస్త్రవేత్తగా గడపండి’’ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ముందుకు తీసుకెళ్తూ.. దేశవ్యాప్తంగా 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఐసీఎం‌ఆర్ పరిశోధనాశాలల తలుపులను తెరిచారు. ప్రజారోగ్యం వెనుక ఉన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని స్వయంగా వీక్షించడానికి, అనుభవించడానికి, శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడానికి ఈ జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది.

 

 దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 83 ప్రత్యేక వేదికల్లో ఈ విస్తృత కార్యక్రమం నిర్వహించారు. కేవలం మహా నగరాలకే పరిమితం కాకుండా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అండమాన్ వంటి సుదూర ప్రాంతాలు.. జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల వరకు ఈ ప్రచారం విస్తరించింది. పరిశోధనా వాతావరణాన్ని అంతకు ముందెన్నడూ ప్రత్యక్షంగా చూడని వేలాది మంది విద్యార్థులను ఐసీఎంఆర్‌-షైన్‌ బయోమెడికల్‌ పరిశోధన ప్రపంచంలోకి ఆహ్వానించింది. సంక్లిష్టమైన విజ్ఞానాన్ని సులభంగా, సరళంగా, సరదాగా అర్థం చేసుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లు, కటౌట్లలో అధికారిక చిహ్నం డాక్టర్ క్యూరియో విద్యార్థులకు మార్గదర్శనం వహించింది.

 

 

ఈ కార్యక్రమంలో భాగంగా నాగ్‌పూర్, గోరఖ్‌పూర్‌లలో ఆత్యాధునిక సదుపాయాలు కలిగిన సంచార మొబైల్ బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలను విద్యార్థులు నేరుగా పరిశీలించారు. చక్రాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలల ద్వారా అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్వహించే పరిశోధనలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు నేరుగా ఎలా చేరువవుతున్నాయో వారు తెలుసుకున్నారు. ఇతర కేంద్రాల్లో యువ సందర్శకులు ఆసక్తికరమైన పోస్టరు ప్రదర్శనలు, ప్రత్యక్ష శాస్త్రీయ ప్రదర్శనలు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) లెక్కింపు, ప్రయోగశాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రాయోగిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజువారీ ఆరోగ్య నిర్ణయాలు దేశవ్యాప్త ప్రజారోగ్యంతో ఎలా ముడిపడి ఉన్నాయో అవగాహన పొందారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా అభివృద్ధి చేసిన సృజనాత్మక పరిష్కారాలను విద్యార్థులు ప్రదర్శించడంతో యువత ఆవిష్కరణ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది. గొప్ప శాస్త్రీయ ఆలోచనలకు వయోపరిమితి లేదని ఇది నిరూపించింది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీఎం‌ఆర్ అధికారిక షైన్‌ వెబ్‌సైట్‌ను (https://shine.icmr.org.in/) ప్రారంభించింది. ఇది విద్యార్థులకు ఆరోగ్య పరిశోధనలకు సంబంధించిన వనరులు, కార్యక్రమ తాజా అప్‌డేట్‌లు, వివిధ అవకాశాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. దీనితో పాటు ఐసీఎంఆర్ జాతీయ స్థాయి షైన్‌ పాఠశాల పోటీలను కూడా ప్రకటించింది. నిజజీవితంలో ఎదురయ్యే ప్రజారోగ్య సవాళ్లను గుర్తించి, వాటిపై పరిశోధనాత్మక ప్రశ్నలను రూపొందించి, సంభావ్య పరిష్కారాలను ప్రతిపాదించాల్సిందిగా విద్యార్థులను ఈ పోటీ ఆహ్వానిస్తోంది. ‘ఒక్క రోజు శాస్త్రవేత్తగా గడపడం’ అనే ఆలోచనను మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ.. తమ చుట్టూ ఉన్న ఆరోగ్య సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో, ఆవిష్కరణల కోణంలో పరిశీలించేలా విద్యార్థులను ఈ పోటీ ప్రోత్సహిస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ లోపు షైన్‌ వేదిక‌ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

 

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తరగతి గదులకు అతీతంగా విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగశాల పనులపై విలువైన అవగాహన కల్పించినందుకు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత తరచుగా నిర్వహించాలని వారు సూచించారు. ఈ పాఠశాల పోటీ విద్యార్థులలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. ఒక పాఠశాల అయితే తమ విద్యార్థులందరూ ఇందులో పాల్గొంటారని, వారు సమర్పించే ప్రాజెక్టులను పాఠశాల పరీక్షల్లో అంతర్గత మూల్యాంకనం కింద పరిగణిస్తామని ప్రకటించింది.

 

ఐసీఎంఆర్-షైన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు కేవలం సైన్స్‌  గురించి  చదువుకోవడం దాటి, దానిని కళ్లారా వీక్షించి, అనుభవించి, ప్రశ్నలు అడిగే స్థాయికి చేరుకున్నారు. సంప్రదాయ పరిశోధనా కేంద్రాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్త పాఠశాలలకు, క్షేత్రస్థాయి ప్రాంతాలకు పరిశోధనా అనుభవాలను తీసుకెళ్లడం ద్వారా యువ మేధావులు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ సైన్స్‌ను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాలను ఈ కార్యక్రమం కల్పిస్తోంది. తద్వారా యువ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, వారు సరికొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా, స్వస్థ్‌, వికసిత్ భారత్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించేలా భారత వైద్య పరిశోధన మండలి విశేష కృషి చేస్తోంది.

***


(रिलीज़ आईडी: 2299282) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada