నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

‘భారత్‌ను ప్రపంచ తయారీ కూడలిగా తీర్చిదిద్దగల కీలక రంగాల’పై నీతి ఆయోగ్ నివేదిక


దేశ తయారీ రంగ ఆకాంక్షల బలోపేతం: వృద్ధి ప్రస్థానానికి సారథ్యం వహించగల ప్రధాన రంగాలు

అంతర్జాతీయ తయారీ కూడలిగా భారత్‌ను నిలిపే కీలక రంగాలు: వ్యూహాత్మక ప్రాధాన్యం.. విలువ వ్యవస్థ పాత్ర.. నిర్వహణ సామర్థ్యం

తయారీ రంగ వ్యవస్థ ముందడుగు దిశగా సమర్థ చర్యలతో ‘వికసిత భారత్’ సంకల్ప సాకారానికి కృషి

प्रविष्टि तिथि: 13 AUG 2026 4:56PM by PIB Hyderabad

   “భారత్‌ను ప్రపంచ తయారీ కూడలిగా నిలిపే కీలక రంగాలు” పేరిట నీతి ఆయోగ్ ఒక నివేదికను ప్రకటించింది. దేశం అంతర్జాతీయ తయారీరంగ శక్తిగా ఎదగాలనే ఆకాంక్షలకు ఉత్తేజమిచ్చే ప్రధాన రంగాలను ఇందులో పేర్కొంది. క్రమబద్ధ, విస్తృత సమాచార ఆధారిత చట్రం ద్వారా వీటిని గుర్తించినట్లు తెలిపింది. ఈ మేరకు రసాయనాలు, టెలికాం-నెట్‌వర్కింగ్ పరికరాలు, వస్త్ర పరిశ్రమ, సోలార్ ఫొటో వోల్టాయిక్ ఫలకాల తయారీ రంగాలను ఇది కూలంకషంగా విశ్లేషించింది.

అంతర్జాతీయ పోకడలు, రంగాలవారీ వృద్ధి అవకాశాలు, ప్రపంచ ప్రమాణాల దృక్కోణంలో భారత తయారీ రంగ స్వరూపంపై అవగాహన దిశగా ఈ అంచనాల్లో దృష్టి సారించింది. తయారీ రంగ పోటీతత్వాన్ని ప్రభావితం చేసే మార్కెట్ సామర్థ్యం, మౌలిక సదుపాయాల సంసిద్ధత, విధానపరమైన చేయూత, ముడి పదార్థాల లభ్యత, సాంకేతిక సంసిద్ధత, ఉపాధి కల్పన సామర్థ్యం సహా విలువ శ్రేణిలో భారత్‌ ప్రస్తుత స్థానం తదితరాలను కూడా ఈ నివేదిక స్పృశించింది.

భారత్‌లో గణనీయ వృద్ధి సామర్థ్యంగల రంగాలు, లక్షిత జోక్యాల ద్వారా దేశీయ సామర్థ్య బలోపేతం, పోటీతత్వం-విలువ జోడింపును పెంచడం సహా ఎగుమతి ఆధారిత తయారీ వృద్ధిని వేగిరపరచే రంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇలా గుర్తించిన రంగాల్లో కీలక సమస్యల పరిష్కారంతో పాటు వృద్ధిని ప్రోత్సహించేందుకు రంగాలవారీ సిఫారసుల రూపకల్పన కోసం తయారీ రంగంలోని అగ్ర దేశాల అనుభవాన్ని కూడా ఈ అధ్యయనం ఉపయోగించుకుంది.

ఈ అధ్యయనం నాలుగు భిన్న దశలలో సాగింది:

తొలి దశ... సాపేక్ష ఆకర్షణ ప్రాతిపదికన రంగాల ఎంపిక: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల పరిమాణం-వృద్ధి అవకాశాల ఆధారంగా అధిక వృద్ధి సామర్థ్యంగల రంగాల గుర్తింపు.

మలి దశ... ఎంపిక చేసిన రంగాలపై సమగ్ర అంచనా: ఎంపిక చేసిన రంగాల మార్కెట్ సామర్థ్యం, పోటీతత్వం, విస్తృత వ్యూహాత్మక ఔచిత్యం అంచనాల్లో భాగంగా వాటిపై మూడంచెల వివరణాత్మక మదింపు.

మూడో దశ... అంతర్జాతీయ ఉత్తమాచరణలతో పోలిక: ఎంపిక చేసిన దేశీయ రంగాల సంబంధిత వ్యూహాలు-అనుభవాల గుర్తింపు సహా అత్యుత్తమ సామర్థ్యంగల దేశాలు అనుసరించిన ఉత్తమ పద్ధతులు, విజయవంతమైన విధానాల విశ్లేషణ.

నాలుగో దశ... ఆచరణాత్మక సిఫారసులు-భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన: పోటీతత్వ బలోపేతం, వృద్ధి సామర్థ్యం ఇనుమడింపు, దేశాన్ని ప్రపంచ తయారీ కూడలిగా నిలపడంలో రంగాలవారీ ఆచరణాత్మక సిఫారసులు, విస్పష్ట కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన.

దేశంలో అధిక సామర్థ్యం గల నాలుగు తయారీ రంగాలపై ప్రస్తుత సంచికలో ఈ నివేదిక దృష్టి సారించింది. ఇందులో రసాయనాలు, వస్త్రాలు, టెలికాం-నెట్‌వర్క్ పరికరాలు, సౌర ఫొటో వోల్టాయిక్ ఫలకాల తయారీకి ప్రాధాన్యమివ్వగా, తదుపరి సంచికలో మరో 8 రంగాలపై విశ్లేషణాత్మక అధ్యయన నివేదికలను నీతి ఆయోగ్‌ వెలువరిస్తుంది.

రసాయన రంగం

దేశీయ రసాయన పరిశ్రమ ప్రధానంగా- పెట్రోకెమికల్స్-సేంద్రియ రసాయనాలు, ప్రత్యేక రసాయనాలు, అకర్బన రసాయనాలు అనే మూడు కీలక వినియోగ విభాగాలుగా పనిచేస్తోంది. వీటిలో మొదటిది అతిపెద్ద విభాగం కాగా- ఇందులో పాలిమర్లు, సింథటిక్ ఫైబర్లు, పెర్ఫార్మెన్స్ ప్లాస్టిక్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, ఇంటర్మీడియట్‌లు, తుది ఉత్పత్తులు అంతర్భాగంగా ఉంటాయి.

దేశీయ రసాయన పరిశ్రమకు దిగువ స్థాయిలో ఉత్పత్తి విస్తరణ, ఫీడ్‌స్టాక్ వినియోగం మెరుగుదల ద్వారా దేశీయ విలువ జోడింపును ఇనుమడింపజేసే గణనీయ సామర్థ్యం ఉంది. తదనుగుణంగా దేశీయ తయారీకి ప్రోత్సాహం, పోటీతత్వం దిశగా పెట్టుబడులు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వ్యూహాత్మక వినియోగం ద్వారా దిగుమతి పరాధీనతను తగ్గించవచ్చు. అంతేకాకుండా దిగువ స్థాయి సామర్థ్యాల బలోపేతంతో పాటు సుస్థిర పారిశ్రామిక వృద్ధికి తోడ్పడవచ్చు.

వస్త్ర రంగం

దేశంలోని అత్యంత కీలక తయారీ రంగాలలో వస్త్ర-దుస్తుల పరిశ్రమ ఒకటి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దీని వాటా దాదాపు 2 శాతం కాగా, తయారీ రంగ ‘జీవీఏ’లో 11 శాతం, వస్తు ఎగుమతులో 9 శాతంగా ఉంది. వ్యవసాయం తర్వాత ఇది రెండో అతిపెద్ద ఉపాధి కల్పన రంగం. దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జీవనోపాధి కల్పిస్తున్న ఈ రంగం ‘ఎంఎస్‌ఎంఈ’ల నేతృత్వంలోని విస్తృత పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునిస్తోంది. తదనుగుణంగా 2025లో భారత్‌ 37.7 బిలియన్ డాలర్ల విలువైన వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ప్రపంచ వస్త్ర-దుస్తుల ఎగుమతిలో 4.1 శాతం వాటాతో ప్రపంచంలో 6వ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా నిలిచింది.

ముడి పదార్థాల లభ్యత మెరుగుదల, మౌలిక సదుపాయాల మద్దతుతో తయారీ  పెంపు, మరింత వాణిజ్య సంధానంతో మార్కెట్ సౌలభ్య విస్తరణ ద్వారా అంతర్జాతీయ పోటీతత్వాన్ని బలోపేతం చేసుకోగల గణనీయ సామర్థ్యం భారత వస్త్ర పరిశ్రమకు ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన అనుసరణ, ఉత్పాదకత పెంపు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, ఎంఎంఎఫ్‌ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిర వస్త్రాలు, అత్యంత నాణ్యమైన భారతీయ చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం ద్వారా విలువ జోడింపుతోపాటు ప్రపంచ స్థాయిలో వృద్ధికి మరింతగా తోడ్పడవచ్చు.

టెలికాం-నెట్‌వర్కింగ్ పరికరాల రంగం

భారత్‌ నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ మార్కెట్‌గా ఉంది. మన దేశంలో 1.2 బిలియన్ల మందికి పైగా చందాదారులు, సుమారు 85 శాతం టెలికాం సదుపాయాల విస్తరణతో ఇంటర్నెట్‌ వినియోగం దాదాపు 75 శాతంగా నమోదవుతోంది. ఈ రంగానికిగల పరిణామాత్మక సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం వినూత్న రీతిలో జాతీయ టెలికాం విధానం-2025ను ఆవిష్కరించింది. జీడీపీలో ఈ రంగం వాటానే కాకుండా టెలికాం ఉత్పత్తులు-సేవల ఎగుమతులను ను 2030 నాటికి రెట్టింపు చేయాలన్నది దీని ధ్యేయం. దీంతోపాటు 10 లక్షల ఉద్యోగాల సృష్టి సహా పెట్టుబడులు,  పరిశోధన-అభివృద్ధి వ్యయం గణనీయంగా పెంపు వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది.

స్థానికీకరణ మరింత పెంపు, దేశీయ విడిభాగాల తయారీ బలోపేతం ద్వారా ప్రపంచ పోటీతత్వం పెంచుకోగల గణనీయ సామర్థ్యం భారత టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఉంది. ఈ నేపథ్యంలో సంయుక్త వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ప్రోత్సాహం, సమీకృత పారిశ్రామిక సమూహాల రూపకల్పన, అధిక సామర్థ్యం గల ఎగుమతి విభాగాల విస్తరణ-స్థాయి పెంపు, ఆవిష్కరణ-ఉత్పాదకతకు మద్దతుగా పరీక్ష, ధ్రువీకరణ, నైపుణ్యాభివృద్ధి బలోపేతం తదితరాలను ఈ రంగం అగ్ర ప్రాథమ్యాలుగా నిర్దేశించుకుంది.

సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ ఫలకాల రంగం

సౌర విద్యుదుత్పాదనలో 2030 నాటికి 280 గిగావాట్ల సామర్థ్యం సాధించాలని భారత్‌  లక్ష్య నిర్దేశం చేసుకోగా, 2025 మార్చి నాటికి 106 గిగావాట్ల స్థాయికి చేరింది. ఇక సుమారు 174 గిగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రంగంలో దేశీయ మార్కెట్ విలువ రూ.32,400 కోట్లు (3.7 బిలియన్ డాలర్లు)గా ఉంది. అయితే, 2023-2030 మధ్య కాలంలో ఇది 17 నుంచి 20 శాతం వార్షిక వృద్ధితో మరింత విస్తరిస్తుందని అంచనాలు పేర్కొన్నాయి. వినియోగ-స్థాయి సౌర ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్, ఓపెన్-యాక్సెస్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ సంధానిత డిమాండ్ తదితరాలు ఈ రంగానికి చేయూతనిస్తాయి.

సామర్థ్యాల విస్తరణ-బలోపేతం, దిగుమతి పరాధీనత తగ్గింపు ద్వారా దేశీయ విలువ జోడింపును మరింత పెంచగల సామర్థ్యం భారత సౌర ఉత్పాదక వ్యవస్థకు ఉంది. సాంకేతిక-సంయుక్త భాగస్వామ్యాలు, పరిశోధన-అభివృద్ధికి మరింత ప్రాధాన్యం, పనితీరు ఆధారిత మద్దతు, సమీకృత కాలుష్య రహిత సాంకేతిక సముదాయాల రూపకల్పన, పరిశ్రమల నేతృత్వాన నైపుణ్యాభివృద్ధి తదితరాలు ఈ రంగం కీలక ప్రాధాన్యాలుగా ఉన్నాయి. వాణిజ్య భాగస్వామ్యాలను, జీ2జీ చట్రాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించుకుంటూ అంతర్జాతీయ మార్కెట్ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు.

ఎంపిక చేసిన రంగాలు కాలక్రమాన తమ ఉత్పాదక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంలో ఈ నివేదిక మార్గనిర్దేశం చేయగలదని అంచనా. ప్రస్తుత సవాళ్లను అధిగమించే నిర్దిష్ట సానుకూల చర్యల ద్వారా భారత ఉత్పాదక సామర్థ్యం పెంచడానికి పరిశ్రమలు-ప్రభుత్వం సహకరించుకోవాలి. ఈ దిశగా సమన్వయంతో సాగే కృషి తయారీ రంగంలో భారత్‌ను ఉన్నత వృద్ధి పథంలో నిలపగలదు.

నీతి ఆయోగ్‌ నివేదిక కోసం ఇక్కడ https://www.niti.gov.in/sites/default/files/2026-08/Key-Sectors-to-Position-India-as-a-Global-Manufacturing-Hub.pdf పై క్లిక్‌ చేయండి.

 

***


(रिलीज़ आईडी: 2299168) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Gujarati