రక్షణ మంత్రిత్వ శాఖ
దేశీయంగా అభివృద్ధి చేసిన ‘గరుడ్’ హై రిజల్యూషన్ బైనాక్యులర్స్‌ను సివిల్ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఐఓఎల్
प्रविष्टि तिथि:
13 AUG 2026 4:56PM by PIB Hyderabad
రక్షణ ఉత్పత్తుల విభాగం పరిధిలోని మినీ రత్న కేటగిరీ-I రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ - ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఒఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'గరుడ్' హై రిజల్యూషన్ బైనాక్యులర్లను సివిల్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌కు చెందిన డెహ్రాడూన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసి, తయారు చేసిన గరుడ్ స్వదేశీ డిజైన్, తయారీ ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. 1943 నుంచి అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆప్టికల్ పరికరాల తయారీ అనుభవంతో రూపొందిన గరుడ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో సాధించిన నైపుణ్యంతో మేళవించింది. పౌరుల వినియోగానికి విశ్వసనీయమైన, నాణ్యమైన ఆప్టికల్ పనితీరును అందించేలా దీనిని రూపొందించారు.
గరుడ్ బైనాక్యులర్స్ 8 రెట్లు మాగ్నిఫికేషన్, 7.6 డిగ్రీల విస్తృత దృశ్య పరిధిని కలిగి ఉన్నాయి. దీంతో దూరంలోని వస్తువులను స్పష్టంగా వీక్షించడంతో పాటు, విస్తృత ప్రాంతాన్ని ఒకేసారి పరిశీలించవచ్చు. వ్యక్తిగత కంటి చూపునకు అనుగుణంగా ±5 డయాప్టర్ సర్దుబాటు సౌకర్యం, ఎక్కువసేపు సౌకర్యవంతంగా వీక్షించేందుకు సాఫ్ట్‌టచ్ ఐకప్స్, చేతిలో సురక్షితంగా పట్టుకునేలా ఎర్గోనామిక్ గ్రిప్ ఇందులో ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన దీని నిర్మాణం, వివిధ రకాల బహిరంగ పరిస్థితుల్లోనూ విశ్వసనీయంగా వినియోగించుకునేలా ఉంటుంది.
సుమారు 610 గ్రాముల బరువున్న గరుడ్ బైనాక్యులర్స్‌ను తేలికగా తీసుకెళ్లేందుకు అనువుగా ఉండటంతో పాటు విశ్వసనీయ పనితీరును అందించే కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించారు. పక్షుల వీక్షణ, వన్యప్రాణుల పరిశీలన, ప్రకృతి అన్వేషణ, ప్రయాణాలు, క్రీడలు, అటవీ కార్యకలాపాలు, సముద్ర సంబంధిత కార్యకలాపాలు, భద్రతా అవసరాలు తదితర విభిన్న వినియోగాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
ఈ ఆవిష్కరణతో ఐఓఎల్ పౌర ఆప్టికల్ పరికరాల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దశాబ్దాలుగా దేశ సేవలో కచ్చితత్వం నిలబెట్టుకుంటూ రక్షణ రంగానికి చెందిన ఆప్టికల్ సామర్థ్యాలను 'గరుడ్' ద్వారా విస్తృత ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రకృతి, బహిరంగ కార్యకలాపాలపై ఆసక్తి ఉన్నవారితో పాటు వివిధ రంగాల నిపుణులు ఈ సాంకేతికతను వినియోగించుకునే అవకాశం కలిగింది కఠినమైన ఆపరేషనల్ పరిస్థితుల్లో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు విశ్వసనీయమైన పరికరంగా సేవలందించిన బైనాక్యులర్ వేదిక ఆధారంగా ‘గరుడ్’ను అభివృద్ధి చేశారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'గరుడ్' ఆప్టికల్ ప్రొడక్ట్‌ను న్యూఢిల్లీలోని డీపీఎస్యూ భవన్‌లో ఈ రోజు ఘనంగా ఆవిష్కరించారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ల్యాండ్ సిస్టమ్స్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ గరిమా భగత్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఆప్టికల్ ప్రొడక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. రక్షణ ఉత్పత్తుల విభాగం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల ప్రతినిధులు, వైల్డ్‌లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు ఐఓఎల్ బోర్డు డైరెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2299128)
आगंतुक पटल : 8