సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: వివాద రహిత పెన్షన్ వ్యవస్థ
प्रविष्टि तिथि:
13 AUG 2026 1:21PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛను, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో నోడల్ శాఖగా పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం వ్యవహరిస్తుంది. వివాదాలను సమర్థవంతంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు పెన్షన్ వ్యాజ్యాలపై రెండో జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. పింఛను సంబంధిత వ్యాజ్యాలు, వాటి పర్యవేక్షణను నిర్వహించే అన్ని మంత్రిత్వశాఖలు/విభాగాల నోడల్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, వారి సామర్థ్యం/నైపుణ్యాలను బలోపేతం చేయడంపై ఈ వర్కుషాపు దృష్టి సారించింది. పెన్షన్‌దారుల సంక్షేమం, సుపరిపాలన కోసం పెన్షన్ వివాదాలను తగ్గించేందుకు ఉత్తమ పద్ధతులు, వ్యవస్థాగత సంస్కరణలు, ఫిర్యాదుల పరిష్కారాలపై వక్తలు చర్చించారు. ప్రజెంటేషన్లు ఇచ్చారు. కార్యశాలలో చట్టాల సంకలనాన్ని, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఇవి పెన్షన్ వ్యాజ్యాలను నిర్వహించడంలో ఉత్తమ పద్ధతులను, తరచూ తలెత్తే పింఛను వ్యాజ్యాలకు సంబంధించిన విషయాల్లో ఇటీవలే వెలువడిన తీర్పులను వివరిస్తూ.. సంబంధిత పింఛను విధానాలపై సమగ్ర అవగాహనను అందిస్తుంది.
పెన్షన్ వివాదాల నిర్వహణలో సమన్వయ విధానానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సంకలనం, కరపత్రం వివరిస్తున్నాయి. పెన్షన్‌కు సంబంధించిన వ్యాజ్యాలను ఏ ఒక్క విభాగమూ కేంద్ర స్థాయిలో నిర్వహించదు. కేంద్ర ప్రభుత్వం తరఫున సంబంధిత విభాగాలే విడివిడిగా నిర్వహిస్తాయి. వ్యాజ్యాలను తగ్గించడానికి మూడో ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభమైంది. దీనిలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఫిర్యాదులు/క్లెయిములు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు పెన్షన్ అదాలత్‌లు, అంతర మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశాలతో పాటుగా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రచారం కూడా ఒకటి. వీటి ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన అవసరాన్ని తొలగించి వ్యాజ్యాలను తగ్గించడమే లక్ష్యం. అదేవిధంగా, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి అందిన వివరణలు, సలహాల ఆధారంగా సూపర్–సీనియర్ పెన్షనర్లతో సహా పింఛనుదారుల జీవితాన్ని సులభతరం చేయడంలో నిబంధనల స్థితిని స్పష్టం చేస్తూ.. ఈ శాఖ మెమోరాండంను జారీ చేస్తుంది. కేంద్ర సివిల్ సర్వీసుల (పింఛను) నియమాలు – 1972ను ఈ విభాగం జారీ చేసింది. వాటిని సీసీఎస్ (పింఛను) నియమాలు–2021 ద్వారా మరింత సవరించింది. కుటుంబ పెన్షనర్ల అర్హతా నిబంధనలను సులభతరం చేయడానికి, విడాకులు తీసుకున్న, దివ్యాంగులైన కుమార్తెలతో సహా వివిధ వర్గాల కుటుంబ పింఛనుదారులకు వర్తించేలా 50వ నియమాన్ని (గతంలో1972 నియమాల్లోని 54వ నియమం) అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ అందించారు.
***
(रिलीज़ आईडी: 2299005)
आगंतुक पटल : 8