రైల్వే మంత్రిత్వ శాఖ
అనధికారిక ప్రవేశాన్ని నివారించడం, రైలు కార్యకలాపాల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా
రైల్వే మార్గాల వెంబడి 19,700 కిలోమీటర్ల మేర భద్రతా కంచె ఏర్పాటు
ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకే ప్రాధాన్యం
రాళ్లు రువ్వడం వంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై భారతీయ రైల్వే చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు
రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు (ఆపరేషన్ సాథీ సహా)
జీఆర్‌పీ, స్థానిక పోలీసులతో నిరంతర సమన్వయం
प्रविष्टि तिथि:
12 AUG 2026 4:59PM by PIB Hyderabad
రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి నేరాలకి పాల్పడేవారిపై రైల్వేల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుల ప్రాణాలను రక్షించడానికి, రైల్వే ఆస్తులకు జరిగే నష్టాన్ని నివారించడానికి రైల్వే శాఖ కింది ముందస్తు చర్యలను చేపడుతుంది:
ప్రభావిత ప్రాంతాలు/బ్లాక్ స్పాట్‌లలో తాగుబోతులు, అల్లరి మూకలు మొదలైన సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించడం ధ్యేయంగా నిరంతర తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వారిపై చట్టపరమైన నిబంధనల కింద కేసులు నమోదు చేస్తారు.
రైళ్లపై విధ్వంసక చర్యలు తరచుగా నమోదయ్యే ప్రాంతాలు, ప్రదేశాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని రైల్వే భద్రతా సిబ్బందికి సూచించడమైనది.
రాళ్ల దాడి దురాగతాలు, వాటి పరిణామాల గురించి రైల్వే ట్రాక్‌ను ఆనుకుని ఉన్న జనావాస ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరచడం కోసం 'ఆపరేషన్ సాథీ' సహా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కదులుతున్న రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేశారు. ఇటువంటి ఘటనలను అదుపు చేసేందుకు, వాటిని విశ్లేషించడం సహా తగిన చర్యలూ తీసుకుంటున్నారు.
రైళ్లపై రాళ్లు రువ్వే దుశ్చర్యను అరికట్టేందుకు, కీలక సమాచారాన్ని పంచుకుంటూ ఆర్‌పీఎఫ్ (రైల్వే భద్రతా దళం) ఎప్పటికప్పుడు జీఆర్‌పీ, స్థానిక పోలీసులతో సమన్వయం కొనసాగిస్తోంది.
రైల్వే భద్రతా ఏర్పాట్ల నిరంతర పర్యవేక్షణ, సమీక్ష కోసం... ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేదా పోలీస్ కమిషనర్ల అధ్యక్షతన 'రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీ' (ఎస్ఎల్‌ఎస్‌సీఆర్)ని ఏర్పాటు చేశారు.
భారతీయ రైల్వేలో రైలు కార్యకలాపాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. పశువులు, పాదచారులు, చిన్న వాహనాలు రైలు మార్గాన్ని దాటడాన్ని సులభతరం చేసేందుకు గానూ పాదచారుల సబ్‌వేలకూ భద్రతా కంచెలనూ ఏర్పాటు చేస్తున్నారు.
రైల్వే పట్టాల వెంబడి నేటి వరకు సుమారు 19,700 కిలోమీటర్ల మేర కంచెను భారతీయ రైల్వే ఏర్పాటు చేసింది. బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.
కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార-సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2298689)
आगंतुक पटल : 8