పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2379 (ఫుకెట్–ఢిల్లీ) ఘటనపై దర్యాప్తు
प्रविष्टि तिथि:
11 AUG 2026 7:16PM by PIB Hyderabad
ఫుకెట్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎ320 ఎయిర్‌బస్ రిజిస్ట్రేషన్ వీటీ-ఈఎక్స్ఓ ఎయిర్ ఇండియా విమానం ఏఐ2379 ఈ నెల 4న ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తులో కుదుపులకు లోనయింది. ఆ తర్వాత నిలకడ స్థితికి చేరుకున్న విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. విమానంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 137 మంది ప్రయాణికులు... ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది సహా మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు.
డీజీసీఏ నుంచి అందిన సమాచారం, ఘటన స్వభావం ఆధారంగా... వర్తించే నిబంధనలు, ఐసీఏవో విధానాలకు అనుగుణంగా 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తును చేపట్టింది. ఐసీఏవో, సంబంధిత దేశాలకు ఈ ఘటన గురించి అవసరమైన సమాచారాన్ని అందించారు.
ఇటువంటి రకం విమాన ప్రమాద ఘటనలకు సంబంధించిన విచారణలో విమానాన్ని 'రూపొందించిన దేశం', 'తయారుచేసిన దేశం' పాల్గొనడం ఐసీఏవో నిబంధనల ప్రకారం నిర్దేశించిన అంతర్జాతీయ దర్యాప్తు విధానంలో కీలక భాగంగా ఉంటుంది.
దీనికి అనుగుణంగా, సంబంధిత దేశానికి చెందిన దర్యాప్తు సంస్థ... ఫ్రాన్స్‌కు చెందిన ‘పౌర విమానయాన భద్రతపై విచారణ-విశ్లేషణ విభాగం' (బీఈఏ), ఎయిర్‌బస్ సాంకేతిక ప్రతినిధులతో కలిసి, వర్తించే ఐసీఏవో విధానాల ప్రకారం ఏఏఐబీకి అవసరమైన సాంకేతిక సహాయాన్ని (సంబంధిత సాంకేతిక సమాచారం, రూపకల్పన పత్రాలను అందించడం సహా) అందజేస్తోంది.
సంబంధిత సాంకేతిక, కార్యాచరణ, వైద్య, మానవ కారకాలకు సంబంధించిన అన్ని ఆధారాలను క్రమపద్ధతిలో సేకరించడం, భద్రపరచడం, పరిశీలించడంలో ఏఏఐబీ ప్రస్తుతం నిమగ్నమై ఉంది. విమానం, దాని వ్యవస్థల పరిశీలన, రికార్డ్ అయిన విమాన ప్రయాణ డేటా, సంబంధిత కార్యాచరణ-నిర్వహణ రికార్డులు, వైద్య సమాచారం, సంబంధిత వ్యక్తులతో ఇంటర్వ్యూలు ఇందులో భాగంగా ఉంటాయి. ఏవైనా నిర్ధారణలకు రాకముందు, అన్ని భౌతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలిస్తారు.
జరిగిన ఘటనకు సంబంధించిన పరిస్థితులను, దోహదపడిన కారకాలను నిర్ధారించడం... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి తగిన భద్రతా చర్యలను గుర్తించడం ఈ దర్యాప్తు లక్ష్యం. ఈ దర్యాప్తు స్వతంత్రమైనది, సాక్ష్యాధారాలతో కూడినది, సమగ్రమైనది. దర్యాప్తు జరుగుతున్న కాలంలో ఏ ఒక్క సమాచారం ఆధారంగా నైనా ఘటనకు గల కారణం గురించి ఎటువంటి నిర్ధారణకు రాకూడదు.
విచారణ సమయంలో సేకరించిన కొన్ని రికార్డులు, వాంగ్మూలాలు, వైద్య సమాచారం, ఇతర సామగ్రిని వర్తించే విచారణ విధానం ప్రకారం సురక్షితంగా, గోప్యంగా ఉంచుతారు. వాస్తవాలను నిజాయతీగా, నిష్పాక్షికంగా, సాంకేతికంగా సరైన రీతిలో నిర్ధారించడం కోసం దర్యాప్తు ప్రక్రియ సమగ్రతను, గోప్యతను కాపాడటం అత్యవసరం. మీడియా, ప్రజలు సహా సంబంధిత వర్గాలంతా విచారణ ప్రక్రియను గౌరవించాలనీ... అసంపూర్ణమైన, ధృవీకరించని లేదా ఎంపిక చేసిన సమాచారం ఆధారంగా నిర్ధారణలకు రాకూడదని ఏఏఐబీ విజ్ఞప్తి చేస్తోంది.
ఏఏఐబీ అన్ని కీలక వాస్తవాలు, సంబంధిత సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణను నిర్వహిస్తుంది. వర్తించే నిబంధనలు, ఐసీఏవో ప్రోటోకాల్‌లకు అనుగుణంగా నిర్ణీత కాలవ్యవధిలో తన ప్రాథమిక పరిశీలనలను వెల్లడిస్తుంది. విచారణ ప్రక్రియ తగిన దశలో మరింత సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
అత్యంత ప్రాధాన్యంగా విమానయాన భద్రతను లక్ష్యంగా చేసుకుని... స్వతంత్రమైన, పారదర్శకమైన, ప్రొఫెషనల్ దర్యాప్తు నిర్వహణకు ఏఏఐబీ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2297966)
आगंतुक पटल : 20