మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్
నాడు పోస్టు చేయడమైనది:
10 AUG 2026 3:51PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 సిఫారసు చేసిన ప్రకారం ప్రాథమిక దశ కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక మార్గదర్శకాలు (ఎన్‌సీఎఫ్-ఎఫ్ఎస్)-2022, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక మార్గదర్శకాలు (ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈ)-2023ను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తీసుకువచ్చింది. దశల వారీగా, సబ్జెక్టుల వారీగా పాఠ్య ప్రణాళిక లక్ష్యాలకు, సామర్థ్యాలకు, అభ్యాస ఫలితాలకు, పాఠ్యప్రణాళికకు, పాఠ్యపుస్తకాలకు, భోధనా పద్ధతులకు, మూల్యాంకనానికి అవసరమైన ఆధారాన్ని ఈ మార్గదర్శకాలు అందిస్తాయి.
జాతీయ పాఠ్య ప్రణాళిక మార్గదర్శకాలను అభివృద్ధి చేయడానికి ఒక జాతీయ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యాసంస్థలు, కొత్తగా అక్షరాస్యులుగా మారినవారు, నిరక్షరాస్యులు, సబ్జెక్టు నిపుణులు, విద్యావేత్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితర విభిన్న భాగస్వాముల నుంచి జాతీయ పాఠ్య ప్రణాళిక మార్గదర్శకాల కోసం అభిప్రాయాలను సేకరించేందుకు దిగువ నుంచి పైకి విధానాన్ని అనుసరించింది. దీని కోసం ముఖాముఖి, డిజిటల్ పద్ధతుల్లో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను నిర్వహించారు. పౌర కేంద్రక మొబైల్ యాప్ సర్వే ద్వారా జాతీయ స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సహా 13 లక్షలకు పైగా ఆసక్తి కలిగిన పౌరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొబైల్ యాప్ సర్వే ద్వారా రాష్ట్రస్థాయిలో 1.5 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యారు.
32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1550కి పైగా జిల్లా స్థాయి సంప్రదింపులను నిర్వహించారు. 35 విద్యా సంస్థల గ్రూపుల నుంచి, విశ్వవిద్యాలయాలు, పౌర సమూహాలతో నిర్వహించిన 12 సంప్రదింపుల్లో పాల్గొన్న 8000 మంది భాగస్వాముల నుంచి కూడా సూచనలను స్వీకరించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన ఫోకస్ గ్రూపులు 25 నిర్దిష్ట అంశాలపై 600కు పైగా అభిప్రాయ పత్రాలను రాశాయి. ఈ బృందాల్లో 4000 మందికి పైగా నిపుణులున్నారు. అలాగే ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన నిపుణుల బృందాల నుంచి 25 పత్రాలను స్వీకరించారు. ఈ నిపుణుల బృందాల్లో 175 మంది సభ్యులున్నారు. వీటన్నింటినీ విశ్లేషించి సంబంధిత సూచనలను ఎన్‌సీఎఫ్‌ల్లో చేర్చారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకొని 2022 అక్టోబర్ 20న ఎన్‌సీఎఫ్-ఎఫ్ఎస్‌ను, 2023 ఆగస్టు 23న ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈను విడుదల చేశారు.
ఎన్‌సీఎఫ్‌లకు కొనసాగింపుగా నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్ఎస్‌టీసీ)ను ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిధిలో అన్ని సబ్జెక్టులూ, తరగతులకూ 13 కరిక్యులర్ ఏరియా గ్రూపులు (సీఏజీలు), పాఠ్య పుస్తక అభివృద్ధి బృందాలు (టీడీటీలు) ఏర్పాటయ్యాయి. పాఠ్యపుస్తకాలతో సహా బోధన-అభ్యాస సామగ్రిని అభివృద్ది చేసే బాధ్యతను ఎన్‌ఎస్‌టీసీకి అప్పగించింది. జాతీయ పాఠ్యప్రణాళికా మార్గదర్శక పర్యవేక్షణ కమిటీ (ఎన్‌వోసీ)ను కూడా ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పాఠ్యపుస్తకాలతో సహా నూతన బోధన-అభ్యాస సామగ్రి ఎన్‌సీఎఫ్ లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా పర్యవేక్షిస్తుంది. విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులు, ప్రముఖ క్రీడాకారులు, కళాకారులు, ఉపాధ్యాయ శిక్షకులు, ఎన్‌సీఈఆర్‌టీ బోధనా సిబ్బంది, ఎస్‌సీఈఆర్‌టీల అధికారులు ఎన్ఎస్‌టీసీ, ఎన్‌వోసీ, సీఏజీల్లో ఉంటారు. విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకులు, ఎన్‌సీఈఆర్‌టీ బోధనా సిబ్బంది, ఎస్‌సీఈఆర్‌టీ బోధనా సిబ్బంది, తదితరులు టీడీటీలో ఉంటారు. 1 నుంచి 9 తరగతులకు నూతన సిలబస్, పాఠ్యపుస్తకాలను, బాలవాటిక 1, 2, 3 కోసం జాదుయ్ పితారా, ఈ-జాదుయ్ పితారా అభ్యాస వనరుల సంకలనాన్ని ఎన్ఎస్‌టీసీ సహకారంతో ఎన్‌సీఈఆర్‌టీ తీసుకువచ్చింది.
పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు, సామర్థ్యాలు, అభ్యాస ఫలితాలను సమగ్రంగా మ్యాపింగ్ చేయడం ద్వారా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రితో సహా నూతన బోధన-అభ్యాస సామగ్రిని అభివృద్ధి చేశారు. ఈ ముసాయిదాలను విద్యాపరంగా, బోధనాపరంగా, భాషాపరంగా, సున్నితత్వపరంగా బహుళ సమీక్షలను చేపట్టారు. విద్యాపరమైన కచ్చితత్వం, వయసుకి తగిన విధంగా ఉండటం, సమ్మిళిత్వం, రాజ్యాంగ విలువలు, స్త్రీపురుష సమానత్వం, సాంస్కృతిక, భాషాపరమైన ఉపయుక్తత, బోధనాపరమైన అనుకూలత, ఎన్‌ఈపీ-2020, ఎన్‌సీఎఫ్-ఎఫ్ఎస్-2022, ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈ-2023కి అనుగుణంగా ఉండటం లాంటి అంశాలను ఈ సమీక్ష పరిశీలిస్తుంది. ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈకి కొనసాగింపుగా అభ్యాస ఫలితాల పత్రం, ఆదేశ పత్రాలు కూడా అభివృద్ధి చేశారు. ఇవి ఎన్‌సీఎఫ్-ఎఫ్ఎస్, ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈలతో పాటు కొత్త సిలబస్‌లు, పాఠ్యపుస్తకాల అభివృద్ధికి మార్గదర్శకాలుగా పని చేశాయి.
పాఠ్య పుస్తకాలను ప్రతి ఏటా పునర్ముద్రించేటప్పుడు ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు చేయకుండా... విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాముల నుంచి అందిన సూచనలకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ నవీకరిస్తుంది. దీనికోసం కూడా అవసరాన్ని బట్టి మార్పులను ఖరారు చేయడానికి నిపుణులను ఎన్‌సీఈఆర్‌టీ ఆహ్వానిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి ఈ రోజు లోక్‌సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2297394)
సందర్శకుల సూచీ సంఖ్య : : 67