రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ద్వైపాక్షిక నౌకా వాణిజ్య సహకారం బలోపేతానికి మారిషస్‌‌‌‌లో భారతీయ నౌకాదళ ప్రధానాధికారి అధికార పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 9:28AM by PIB Hyderabad

నౌకాదళ ప్రధానాధికారి (సీఎన్ఎస్) అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు.. 2026 ఆగస్టు 10 మొదలు ఆగస్టు 13 వరకు మారిషస్‌లో అధికార పర్యటన చేపడుతున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న మారిషస్‌తో ద్వైపాక్షిక నౌకా వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, రక్షణ సంబంధాలను పటిష్ఠపరుచుకొనే దిశగా భారత్ నిరంతర ప్రయత్నాల్లో  ఈ పర్యటన ఓ భాగం.
మారిషస్ ప్రభుత్వ సీనియర్ నాయకులతో సీఎన్ఎస్ సమావేశమవుతారు. నౌకావాణిజ్య భద్రత, రక్షణ సంబంధిత సహకారం, సామర్థ్యాల పెంపుతో పాటు సైన్య సహకారం వంటి ఇరు దేశాల ప్రయోజనాలూ ముడిపడి ఉన్న అంశాలపై వారితో ఆయన చర్చిస్తారు.

నౌకావాణిజ్య రంగంలో భారత్- మారిషస్ సహకారాన్ని ఇప్పటి కన్నా బలపరుచుకోవడం, యుద్ధ కార్యకలాపాల స్థాయి అనుబంధాన్ని పెంపొందించుకోవడం, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేసుకోవడం ఈ పర్యటన ధ్యేయాలు.
నౌకావాణిజ్య రంగంలో భారత్, మారిషస్‌లు చాలా కాలంగా సన్నిహిత భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. నేషనల్ కోస్ట్ గార్డ్‌తో భారతీయ నౌకాదళం క్రమం తప్పక శిక్షణను ఇచ్చి పుచ్చుకొంటూ ఉండడమే కాక, జల సంబంధ సర్వేలు, ఓడరేవుల సందర్శనలు, సంయుక్త ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్) నిఘా సహా వేర్వేరు కార్యకలాపాలలో కూడా పాలుపంచుకుంటోంది. రెండు దేశాలూ బహుళ పక్ష వేదికల్లో, సహకార పూర్వక కార్యక్రమాల్లో పాల్గొంటూ, సహకరించుకుంటున్నాయి. హిందూ మహాసముద్ర నౌకాదళ సదస్సు, ‘ఎమ్ఐఎల్ఏఎన్’ (‘‘మిలన్’’), ఇంటర్నేషనల్ ఫ్టీల్ రివ్యూ, గోవా నౌకావాణిజ్య సదస్సు, ‘ఐఓఎస్ సాగర్’, ‘ఎక్సర్‌సైజ్ ఏఐకేఈవైఎమ్ఈ’ వంటి భారతీయ నౌకాదళ ప్రధాన కార్యక్రమాల్లో మారిషస్  పాల్గొంటోంది. ‘మహాసాగర్’ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్స్) సంబంధిత ద్వైపాక్షిక దృష్టికోణానికి కూడా ఈ భాగస్వామ్యం అద్దం పడుతోంది.
అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్  నౌకాదళ ప్రధానాధికారిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మారిషస్‌లో పర్యటించడం  భారత్ మారిషస్‌ మైత్రికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది. పరస్పర గౌరవం, విశ్వాసం నౌకావాణిజ్యం పట్ల ఆసక్తిలతోపాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాంతీయ సహకారం, స్థిరత్వం అంశాల పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధత  ఈ మైత్రిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2296976) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil