ఉప రాష్ట్రపతి సచివాలయం
అండమాన్, నికోబార్ దీవుల్లో ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
పవిత్ర త్యాగ భూమిగా, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సజీవ చిహ్నంగా అండమాన్, నికోబార్ దీవులను వర్ణించిన ఉపరాష్ట్రపతి
భారతదేశం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంది. ఒక్కటిగానే ఉంటుంది: ఉపరాష్ట్రపతి
గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టు భారత దేశ నౌకా వాణిజ్య సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది, వృద్ధికి నూతన అవకాశాలను అందిస్తుంది: ఉపరాష్ట్రపతి
ప్రతి పౌరుడూ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ... అది సూచించే ధైర్యం, ఐక్యత, దేశభక్తి విలువలను నిలబెట్టాలి : ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
09 AUG 2026 12:45PM by PIB Hyderabad
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఆగస్టు క్రాంతి దివస్ సందర్భంగా ఈ రోజు శ్రీవిజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ను ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్టన్ ప్రారభించారు.
డీబీఆర్ఏఐటీ ఆడిటోరియంలో రాష్ట్ర ఉత్సవం, వందేమాతరంపై తిరంగా కన్సర్ట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఈ ప్రచారాన్ని ప్రారంభించడానికి... భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంతో, త్రివర్ణ పతాక చరిత్రతో దృఢంగా అనుసంధానమైన ఈ చరిత్రాత్మక దీవుల కంటే సరైన ప్రదేశం మరొకటి లేదన్నారు.
ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి చిరస్మరణీయమైన వాక్యాలను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేసుకున్నారు. భారతీయ స్ఫూర్తికున్న స్థిరమైన ధైర్యాన్ని, భారత మాత పతాక వైభవాన్ని భారతి నిర్వహించిన ‘మణికోడి’ ఉత్సవం ప్రతిబింబిస్తుందన్నారు. పౌరులందరినీ ఒకే జాతీయ పతాకం, ఒకే మాతృభూమి, ఒకే గమ్యం పరిధిలోకి తీసుకురావడం ద్వారా ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతుందని చెప్పారు.
భయంకరమైన కాలాపానీ అకృత్యాలను సహించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు. భారతదేశ భౌగోళిక అంతర్భాగంగా మాత్రమే కాకుండా... పవిత్ర త్యాగాల భూమిగా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయన్నారు. సెల్యులార్ జైల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్‌తో పాటు అనేక మంది దేశభక్తులకు ఆయన హృదయపూర్వక నివాళులు అర్పించారు. వారి ధైర్యం, దేశభక్తి, త్యాగం తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.
1942 ఆగస్టు 8న ‘‘డూ ఆర్ డై’’ అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు లక్షలాది భారతీయులను మేల్కొలిపి, స్వాతంత్ర్య ఉద్యమానికి నిర్ణయాత్మక దిశను ఇచ్చిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. త్రివర్ణ పతాక చరిత్రలో ఈ దీవులకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి వివరించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో చరిత్రాత్మక ఘట్టమైన.. 1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందంటూ.. ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని శ్రీ రాధాకృష్ణన్ వివరించారు. ప్రతి పౌరుడూ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శించాలనీ, అది ప్రతిబింబించే దేశభక్తి, ఐక్యత, ఉమ్మడి బాధ్యతా విలువలను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘భారతదేశం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంది. ఒక్కటిగానే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
భిన్నత్వంలో ఏకత్వానికీ, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికీ ఈ దీవులే సజీవ ఉదాహరణలని ఉపరాష్ట్రపతి అన్నారు. అలాగే ఇక్కడి సుసంపన్నమైన గిరిజన సంస్కృతితో పాటు అనుసంధానం, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతుల్లో ఇటీవలి కాలంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. భారతీయ నౌకా వాణిజ్య సామర్థ్యాలనూ, రవాణా సౌకర్యాలనూ, ఆర్థిక అవకాశాలనూ గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టు బలోపేతం చేస్తుందన్నారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధిని సమతౌల్యం చేస్తుందని తెలియజేశారు.
భారతదేశం అనుసరిస్తున్న శాంతి, ఉదారవాద సంప్రదాయంతో పాటుగా జాతీయ సమైక్యత అవసరాన్ని శ్రీ రాధాకృష్ణన్ వివరించారు. ‘‘భారత్ ఎప్పుడూ ఉదారంగానే ఉంది. కానీ మన ఉదారవాదాన్ని ఎన్నడూ బలహీనతగా పొరబడకూడదు. మన జాతీయ ప్రయోజనాలనూ, సార్వభౌమత్వాన్నీ కాపాడుకోవడానికి మనం ఎల్లప్పడూ సిద్ధంగా ఉండాలి’’ అన్నారు. త్రివర్ణ పతాకం నుంచి ధైర్యం, ఐక్యత, ఆశాభావ స్ఫూర్తిని పొందాలనీ, దృఢమైన, అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణంలో స్వాతంత్ర్య సమర యోధుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం, జాతీయ సమైక్యత, దేశభక్తి సందేశాన్నీ ఇస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ ప్రదర్శనను తిలకించారు.
ఈ కార్యక్రమంలో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషి (రిటైర్డ్), ప్రధాన కార్యదర్శి శ్రీమతి చంచల్ యాదవ్, శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి ఎం వసంత, జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ పీ ఉమర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2296895)
సందర్శకుల సూచీ సంఖ్య : : 68