వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఏపీఈడీఏ ఆధ్వర్యంలో బిహార్ నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా జీఐ ట్యాగ్ పొందిన మిథిలా మఖానా తొలి ఎగుమతి
దర్భంగా రైతుల నుంచి సేకరించిన 18 మెట్రిక్ టన్నుల సరుకు రవాణాతో దాదాపు 18 శాతం అదనపు ఆదాయం
प्रविष्टि तिथि:
08 AUG 2026 2:53PM by PIB Hyderabad
వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) ఆధ్వర్యంలో బిహార్‌కు చెందిన జీఐ టాగ్ (భౌగోళిక గుర్తింపు) పొందిన ప్రతిష్ఠాత్మక మిథిలా మఖానా అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. బిహార్‌లోని బీహ్తా బియాడా పారిశ్రామిక ప్రాంతం నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా తొలిసారిగా 18 మెట్రిక్ టన్నుల మఖానా ఎగుమతి అయ్యింది.దర్భంగా జిల్లాలోని మఖానా రైతుల నుంచి నేరుగా సేకరించిన ఈ సరుకు, బిహార్‌లోని ప్రధాన జీఐ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు ఎగుమతుల ద్వారా రైతులకు అదనపు ఆదాయ మార్గాలను సుగమం చేయనుంది.
ఈ తొలి ఎగుమతి రవాణాను బిహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిహార్ ఉద్యానవన శాఖ డైరెక్టర్, ఏపీఈడీఏ ఉన్నతాధికారులు, ఎగుమతి ప్రతినిధులు, లాజిస్టిక్స్ భాగస్వాములు, ఈ ప్రాంతానికి చెందిన ప్రగతిశీల మఖానా రైతులు పాల్గొన్నారు.
ఎగుమతుల ఆధారిత విలువ వ్యవస్థ, ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానం వల్ల మఖానా రైతులు మార్కెట్లో లభించే సాధారణ ధరల కంటే దాదాపు 18 శాతం ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగారు. భౌగోళిక గుర్తింపు కలిగిన మిథిలా మఖానాకు ప్రపంచ బ్రాండింగ్ తీసుకురావడం, బిహార్ మఖానా రంగానికి స్థిరమైన ఎగుమతి అవకాశాలను కల్పించడం, రైతుల సంపాదనను మరింత పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ఈ తొలి కన్సైన్‌మెంట్‌ను ఎం/ఎస్ నియాడ్ గ్రీన్ సంస్థ ఎగుమతి చేయగా, ఏపీఈడీఏకు చెందిన భారతి (భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్, రెసిలెన్స్, అడ్వాన్స్‌మెంట్, ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఇన్నోవేషన్) కార్యక్రమ మద్దతుతో ఎం/ఎస్ జిత్బన్ సప్లై చైన్ ప్రైవేటు లిమిటెడ్ అనే అంకుర సంస్థ లాజిస్టిక్స్ బాధ్యతలను నిర్వహించింది. దర్భంగా రైతుల నుంచి సేకరించిన అత్యుత్తమ నాణ్యమైన ముడి మిథిలా మఖానాను బిహ్తా పారిశ్రామిక ప్రాంతంలో ప్యాక్ చేసి ఆస్ట్రేలియాకు పంపించారు.
మఖానా (తామర గింజలు) బిహార్ రాష్ట్ర గుర్తింపు అని, అస్తిత్వానికి ప్రతీక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. బిహార్‌కు చెందిన ఎగుమతిదారులు అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంత ఎక్కువగా పాల్గొంటే, ఇక్కడి రైతులకు అంత ఉత్తమమైన ధరలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలను పాటించడం చాలా కీలకమని చెప్పారు. మఖానా సాగుదారులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు మద్దతు ఇస్తూ మఖానా విలువ వ్యవస్థను బలోపేతం చేయడానికి బిహార్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.మఖానా ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన, సాంప్రదాయక నైపుణ్యాలు కలిగిన ‘ఫోరీ’ కార్మిక సమాజానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల అవసరమైన సహాయ సహకారాలు కొనసాగుతాయని మంత్రి హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాకు భౌగోళిక గుర్తింపు పొందిన మిథిలా మఖానా తొలి చారిత్రాత్మక ఎగుమతి.. బిహార్ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోందని, ఇది రైతులకు, ఎగుమతిదారులకు సరికొత్త అవకాశాలను తెరుస్తుందని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏపీఈడీఏ, బిహార్ ప్రభుత్వ వ్యవసాయ శాఖతో కలిసి ఈ ఎగుమతిని విజయవంతం చేసింది. సామర్థ్య పెంపుదల, మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు, ఎగుమతి సౌకర్యాల కల్పన, భాగస్వాముల భాగస్వామ్యం ద్వారా ఏపీఈడీఏ నిరంతరం మఖానా ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. ఈ సరుకు ఆస్ట్రేలియాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా చేరడానికి మార్కెట్ సౌలభ్యం, సమన్వయంలో ఎగుమతిదారునికి ఏపీఈడీఏ పూర్తి మద్దతు అందించింది.
భారత్ ఉత్పత్తి చేసే మొత్తం మఖానాలో దాదాపు 85 శాతం వాటా ఒక్క బిహార్ రాష్ట్రానిదే కావడం విశేషం. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మఖానా కోసం ప్రత్యేకంగా ఒక హెచ్ఎస్ కోడ్‌ను తీసుకువచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) భారత్ 7,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మఖానా, దాని ఆధారిత ఉత్పత్తులను అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా సహా 20కి పైగా అంతర్జాతీయ దేశాలకు ఎగుమతి చేసింది.
భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతూ, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు స్థిరమైన ఎగుమతి ఆధారిత వృద్ధి అవకాశాలను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగుమతిదారులు, అంకుర సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కలిసి ఏపీఈడీఏ సంస్థ నమ్మకంగా పనిచేస్తోంది
***
(रिलीज़ आईडी: 2296633)
आगंतुक पटल : 3