ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆస్ట్రేలియా వెళ్లే భారతీయ విద్యార్థుల పత్రాల ధ్రువీకరణ ఇక వేగవంతం
ఏఏఈఆర్ఐతో డిజిలాకర్ భాగస్వామ్యంతో ఇది సాధ్యం
భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగమైన డిజిలాకర్ కొత్త 'ఏఏఈఆర్ఐ వెరిఫై' వేదికతో మాన్యువల్ పేపర్‌వర్క్ తొలగింపు
సమ్మతి-ఆధారిత డిజిటల్ వ్యవస్థతో విద్య, ఆర్థిక రికార్డుల కోసం తక్షణ, సోర్స్ ధ్రువీకరణ తనిఖీలు
प्रविष्टि तिथि:
08 AUG 2026 10:48AM by PIB Hyderabad
విదేశాల్లో చదువుకోవాలని ఆకాంక్షించే భారతీయ విద్యార్థులకు ప్రోత్సాహకంగా 'ఏఏఈఆర్ఐ వెరిఫై' వేదిక ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై) ఆధ్వర్యంలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం, అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇండియా (ఏఏఈఆర్ఐ)తో భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఈ వేదిక మొదలైంది.
డిజిలాకర్‌తో నేరుగా అనుసంధానమైన ఈ డిజిటల్ వేదిక... ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల విద్య, గుర్తింపు, ఆర్థిక సంబంధ పత్రాల సురక్షితమైన, కాగిత రహిత, సమ్మతి-ఆధారిత ధ్రువీకరణను సాధ్యం చేస్తుంది. న్యూఢిల్లీలో ఈ నెల 7న జరిగిన ఏఏఈఆర్ఐ వార్షిక సమావేశంలో అధికారికంగా ఈ వేదికను ప్రారంభించారు.
ఎన్ఈజీడీ సహకారంతో ఏఏఈఆర్ఐ ప్రారంభించిన ఈ ఏఏఈఆర్ఐ వేదిక... ఆస్ట్రేలియన్ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీని సులభతరం చేయడానికి రూపొందించినది. ఇది సోర్స్‌ను ధ్రువీకరించే ప్రామాణిక వేదిక. ఏఏఈఆర్ఐ వెరిఫై వేదికను డిజిలాకర్‌తో అనుసంధానించడం ద్వారా, ఇది విద్యార్థులు భౌతిక పత్రాలు, మాన్యువల్ ధ్రువీకరణ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు ప్రామాణికమైన, జారీచేసిన వారు ధ్రువీకరించిన డిజిటల్ పత్రాలను విశ్వసనీయ సోర్స్ ద్వారా నేరుగా, సురక్షితంగా షేర్ చేయవచ్చు.
కొత్తగా ప్రారంభించిన ఈ డిజిటల్ వర్క్‌ఫ్లో... నెమ్మదిగా సాగే మాన్యువల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను, రెండు వ్యూహాత్మక దశలుగా విభజించిన సురక్షిత విధానంతో భర్తీ చేస్తుంది:
- దశ 1: విద్యార్థి పరిశీలన – యూనివర్సిటీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే దీనిని సజావుగా నిర్వహిస్తుంది.
- దశ 2: స్పాన్సర్ పరిశీలన – విద్యార్థికి ప్రవేశ అవకాశం లభించిన వెంటనే, ఆర్థికపరమైన విశ్వసనీయతను నిర్ధారించడానికి ఈ దశను ప్రారంభిస్తుంది.
డిజిలాకర్, విద్యార్థుల స్పష్టమైన సమ్మతితో... అసలైన జారీ సంస్థ అధికారుల డిజిటల్ సంతకం కలిగిన రికార్డులను ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలకు నేరుగా అందుబాటులో ఉంచుతుంది. ఇది మోసాలను నివారిస్తుంది. సంపూర్ణ సమాచార గోప్యతను నిర్ధారిస్తుంది. దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయాలనూ గణనీయంగా తగ్గిస్తుంది.
ఈ కార్యక్రమ ప్రభావాన్ని వివరిస్తూ, ఎన్ఈజీడీ డైరెక్టర్ శ్రీ జె.ఎల్. గుప్తా ఇలా అన్నారు: "భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వాస్తవ ప్రపంచంలో గల అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరిస్తున్న తీరును ఈ సహకారం నిరూపిస్తోంది. ‘ఏఏఈఆర్ఐ వెరిఫై’ వేదికతో డిజిలాకర్ అనుసంధానం ద్వారా, మేం మా విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రవేశ ప్రక్రియ మొత్తాన్ని సరళతరం చేసే ఒక సురక్షిత, కాగితరహిత, విశ్వసనీయ వ్యవస్థను అందిస్తున్నాం."
భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమన్వయం చేయడంలో ఎన్ఈజీడీ కీలక పాత్రను వివరిస్తూ శ్రీ గుప్తా ఒక సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. 2009లో ఎమ్ఈఐటీవై ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర వ్యాపార విభాగంగా స్థాపించిన ఎన్ఈజీడీ... స్థూల ప్రాజెక్టు నిర్వహణ, విధానాల రూపకల్పన, సాంకేతిక అంచనాలకు మద్దతునిస్తుంది. భారత ప్రభుత్వ వ్యవస్థలోని అన్ని విభాగాలను అనుసంధానించే సాంకేతిక వేదికల విస్తృత నెట్‌వర్క్‌నూ ఎన్ఈజీడీ నిర్వహిస్తుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ), నీతి ఆయోగ్ మొదలైన పలు చట్టబద్ధమైన సంస్థల్లో ప్రభుత్వ కార్యాచరణకు ఈ వేదిక మద్దతునిస్తుంది.
డిజిలాకర్... ఎమ్ఈఐటీవై పరిధిలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) ఆధ్వర్యంలో పనిచేసే డీపీఐకి సంబంధిత ప్రధాన కార్యక్రమం. ఇది అధీకృత సంస్థలు జారీ చేసిన ప్రామాణిక డిజిటల్ పత్రాలను నిల్వ చేయడానికి, షేర్ చేయడానికి, ధ్రువీకరించడానికి పౌరుల కోసం ఒక సురక్షితమైన, సమ్మతి ఆధారిత వాలెట్‌ను అందిస్తుంది. ప్రధాన డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన డిజిలాకర్... ప్రస్తుతం 72 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులకు సేవలందిస్తోంది. జారీ చేసిన అధీకృత సంస్థల డిజిటల్ సంతకం గల పత్రాలను సురక్షితంగా జారీ చేయడం, నిల్వ చేయడం, షేర్ చేయడం, ఎప్పటికప్పుడు ధ్రువీకరించడాన్ని ఇది సాధ్యం చేస్తుంది. భారత దేశీయ డిజిటల్ విజయాన్ని ప్రపంచ విద్యా వ్యవస్థకు విస్తరించడంలో ఈ భాగస్వామ్యం కీలక ముందడుగు.
***
(रिलीज़ आईडी: 2296521)
आगंतुक पटल : 2