మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ గోపాల్ రత్న పురస్కారం -2026 కోసం నామినేషన్ల ఆహ్వానం

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2026 7:47PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పశుసంవర్ధక, పాడి పరిశ్రమల విభాగం... రైతులకు స్థిరమైన జీవనోపాధిని అందించేలా పశుసంవర్ధక, పాడి పరిశ్రమల రంగాన్ని సమర్థంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. భారత దేశీయ గో జాతులు దృఢమైనవి, జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగల జన్యు సామర్థ్యాన్నీ కలిగి ఉన్నాయి. దేశీయ గో జాతులను శాస్త్రీయ పద్ధతిలో సంరక్షించి, అభివృద్ధి చేసే లక్ష్యంతో 2014, డిసెంబరులో “రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం)”ను ప్రారంభించారు.  

ఆర్‌జీఎం ఆధ్వర్యంలో పాడి రైతులు, పాడి సహకార సంఘాలు/ఎంపీసీ/ఎఫ్‌పీవోలు, కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుల (ఏఐటీల) కృషిని గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో 2021 నుంచి ప్రతి సంవత్సరం ఈ విభాగం జాతీయ గోపాల్ రత్న పురస్కారం (ఎన్‌జీఆర్‌ఏ)లను ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం జాతీయ గోపాల్ రత్న పురస్కారం-2026 కోసం కింది కేటగిరీలలో నామినేషన్లు ఆహ్వానిస్తున్నారు:

దేశీయ పశువులు/గేదెల జాతుల పెంపకంలో ఉత్తమ పాడి రైతు (వివరాలు మార్గదర్శకాల్లో అందించారు).

ఉత్తమ పాడి సహకార సంఘం (డీసీఎస్)/ పాల ఉత్పత్తిదారుల కంపెనీ (ఎంపీసీ)/ పాడి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో).

ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణులు (ఏఐటీ).

ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్), హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాడి అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడం, పెంపొందించడం కోసం ప్రత్యేక పురస్కారాన్ని అందించే నిబంధన ఇందులో భాగంగా ఉంది.

పైన పేర్కొన్న విధంగా ఎన్‌జీఆర్ఏ-2026లో భాగంగా ప్రతి కేటగిరీలో 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన విజేతలకు పురస్కారాలను అందించడంతో పాటు... ఈశాన్య ప్రాంత/హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఎన్‌జీఆర్ఏ-2026లో భాగంగా ఉత్తమ పాడి రైతు, ఉత్తమ డీసీఎస్/ ఎంపీసీ / ఎఫ్‌పీవో అనే రెండు కేటగిరీలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికతో పాటు, కింది విధంగా నగదు బహుమతినీ అందజేస్తారు:

1వ స్థానంలో నిలిచిన వారికి రూ. 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు మాత్రమే)

2వ స్థానంలో నిలిచిన వారికి రూ.3,00,000/- (మూడు లక్షల రూపాయలు మాత్రమే)

3వ స్థానంలో నిలిచిన వారికి రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు మాత్రమే)

రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు మాత్రమే) - ఈశాన్య ప్రాంత/హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక పురస్కారం.

ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుల (ఏఐటీ) విభాగంలో, జాతీయ గోపాల్ రత్న పురస్కారం-2026లో భాగంగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు. ఈ విభాగం కోసం నగదు బహుమతి ఉండదు.

2026 సంవత్సరానికి గానూ జాతీయ గోపాల్ రత్న పురస్కారం కోసం నామినేషన్లను 10.08.2026 నుంచి జాతీయ పురస్కార పోర్టల్ https://awards.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ 10.09.2026. ఈ పురస్కారాలను జాతీయ పాల దినోత్సవం (26-11-2026) సందర్భంగా ప్రదానం చేస్తారు. అర్హతా ప్రమాణాలు, మార్గదర్శకాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://awards.gov.in లేదా https://dahd.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

***


(రిలీజ్ ఐడి: 2296441) సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali