రైల్వే మంత్రిత్వ శాఖ
గత మూడేళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 5.13 కోట్ల జరిమానా విధించిన భారతీయ రైల్వే
54 షోకాజ్ నోటీసులు జారీ, 6 కాంట్రాక్టుల రద్దు, నిబంధనలు ఉల్లంఘించిన లైసెన్సుదారులపై నిషేధం
ఆధునిక కిచెన్‌లు, ప్యాకింగ్‌పై క్యూఆర్ కోడ్, కిచెన్‌లో సీసీటీవీ నిఘా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల పాటింపు, బహుళస్థాయి తనిఖీలతో ఆహార భద్రత చర్యలు పటిష్టం
प्रविष्टि तिथि:
07 AUG 2026 3:06PM by PIB Hyderabad
భారతీయ రైల్వే సగటున ప్రతి సంవత్సరం సుమారు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఆహారాన్ని సరఫరా చేస్తున్నప్పటికీ, నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు సగటున కేవలం 0.0008 శాతం మాత్రమే వస్తున్నాయి. గత మూడు సంవత్సరాల్లో వచ్చిన ఫిర్యాదులను బట్టి ఐఆర్‌సీటీసీ తగిన కఠిన చర్యలు తీసుకుంది. ఆహార నాణ్యత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ రూ.5.13 కోట్ల జరిమానా విధించడం, 54 షోకాజ్ నోటీసులు జారీ చేయడం, 6 కాంట్రాక్టులను రద్దు చేయడం సదరు లైసెన్సుదారులను నిషేధించడం చేయడం వంటి చర్యలు చేపట్టింది. ఈ విధంగా నిషేధించిన లైసెన్సుదారుల జాబితాను ఐఆర్‌సీటీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించింది.
ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రత, చట్టపరమైన నిబంధనల అమలును నిర్ధారించడానికి రైల్వే, ఐఆర్‌సీటీసీ అధికారులు, అలాగే ఆహార భద్రతా అధికారులు నిరంతరం సాధారణ తనిఖీలతోపాటు ఆకస్మిక తనిఖీలను కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఆహార భద్రత, సిబ్బంది నియామకం, వంటగది పరికరాల నిర్వహణ, పరిశుభ్రత, నిర్దేశిత ప్రమాణాలను పాటించడంతో పాటు ఆహారాన్ని నిల్వ చేయడం, వండడం, సిద్ధం చేయడంలో అత్యుత్తమ పద్ధతులను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రయాణికులకు నిర్దేశిత నిబంధనల ప్రకారం మంచి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతను మరింత మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతను మెరుగుపరచడానికి ఈ కింది చర్యలు చేపట్టింది.
· ప్రత్యేకంగా కేటాయించిన బేస్ కిచెన్ల నుంచి ఆహారాన్ని సరఫరా చేయడం
· ఎంపిక చేసిన ప్రాంతాల్లో అత్యాధునిక బేస్ కిచెన్లను ఏర్పాటు చేయడం
· ఆహార తయారీని ఎప్పటికప్పుడు, మెరుగ్గా పర్యవేక్షించడానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చడం
· ఆహార తయారీ కోసం అత్యంత ఆదరణ పొందిన, బ్రాండెడ్ ముడి పదార్థాలను ఎంపిక చేసి ఉపయోగించడం
· ఆహార భద్రత, పరిశుభ్రత పద్ధతులను పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో ఆహార భద్రత పర్యవేక్షకులను నియమించడం
· రైళ్లలోనే సేవలను పరిశీలించడానికి ఐఆర్‌సీటీసీ సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచడం
· ఆహార భద్రత, పారదర్శకత, ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు రైళ్లలో ఇచ్చే ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టడం. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్యాకింగ్ చేసిన తేదీ, లైసెన్సుదారు పేరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ వివరాలు ప్రయాణికులకు తెలుస్తాయి
· బేస్ కిచెన్లు ప్యాంట్రీ కార్లలో క్రమం తప్పకుండా లోతైన శుభ్రత, కాలానుగుణంగా క్రిమిసంహారక చర్యలు చేపట్టడం
· ఆహార భద్రత నిబంధనల అమలును నిర్ధారించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ధ్రువీకరణ తప్పనిసరి చేయడం
· రైళ్లలోని ఆహార నాణ్యతను తనిఖీ చేసే పర్యవేక్షణ వ్యవస్థలో భాగంగా నిరంతరం ఆహార నమూనాలను సేకరించడం
· క్యాటరింగ్ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి ఐఆర్‌సీటీసీ ద్వారా క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వడం. ఇందులో కస్టమర్ సర్వీస్, సంభాషణ శైలి, మర్యాదపూర్వక ప్రవర్తన, సేవా ప్రమాణాలు, వ్యక్తిగత అంకరణ , పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించడం
· ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేయడానికి థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించడం. అలాగే ప్రయాణికుల నుంచి నేరుగా వినియోగదారు సంతృప్తి సర్వే కూడా సేకరించడం
ఆహార భద్రతా అధికారులతో సహా రైల్వే, ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా సాధారణ తనిఖీలతో పాటు ఆకస్మిక తనిఖీలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ వివరాలను నేడు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే, సమాచార,ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2296049)
आगंतुक पटल : 9