వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అపెడా ఆధ్వర్యంలో బయోఫాక్ ఇండియా- 2026: భారత ధ్రువీకృత సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తృతిని పెంచుకోవడమే లక్ష్యం
200కు పైగా కంపెనీల భాగస్వామ్యం, సేంద్రీయ వైవిధ్యాన్ని చాటుతున్న అపెడా పెవిలియన్
భారతీయ ఎగ్జిబిటర్లతో కొనుగోలుదారు - విక్రేత సమావేశాల్లో పాల్గొన్న 35 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు
प्रविष्टि तिथि:
06 AUG 2026 10:10PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల ప్రాధికార సంస్థ (అపెడా) ఆగస్టు 6 నుంచి 8 వరకు బయోఫాక్ ఇండియా- 2026 ప్రదర్శనను నిర్వహిస్తోంది. న్యూరన్‌బర్గ్ మెస్సే ఇండియా సహకారంతో.. ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్‌పో సెంటర్ - మార్ట్ (ఐఈఎంఎల్)లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో.. సేంద్రియ, సహజ, సుస్థిర ఆహార రంగాల భాగస్వామ్య పక్షాలను ఒక్కచోట చేరుస్తుంది. వాణిజ్యం, వైజ్ఞానిక వినిమయం, వ్యాపార సంబంధాల విస్తరణకు సమగ్ర వేదికగా నిలుస్తోంది.
అపెడా స్టాల్ కింద 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు సహా 200కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఎగుమతిదారులు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీవోలు), రైతు ఉత్పత్తిదారు కంపెనీలు (ఎఫ్‌పీసీలు), అంకుర సంస్థలు, సేంద్రియ ఉత్పత్తుల సంస్థలు... ఇలా విస్తృత స్థాయి ప్రాతినిధ్యానికి అపెడా వేదికనిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, తమిళనాడు, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలతోపాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ధ్రువీకృత సేంద్రియ ఉత్పత్తులను అపెడా స్టాల్‌లో ప్రదర్శిస్తున్నారు. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, తాజా పండ్లు - కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మూలికలు, ఔషధ మొక్కలు, నూనె గింజలు, వంట నూనెలు, తేనె, కోకో ఉత్పత్తులు, సహజ పదార్థాలు, సేంద్రియ న్యూట్రాస్యూటికళ్లు, శుద్ధి చేసిన (వాల్యూ యాడెడ్) ఇతర ఆహారోత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి.
భారతీయ సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడం లక్ష్యంగా.. తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మంగోలియా, ఈజిప్టు సహా 13 కీలక విదేశీ మార్కెట్లకు చెందిన 35కు పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు ఇందులో పాల్గొనేలా అపెడా ఏర్పాట్లు చేసింది. వీరిలో ప్రముఖ దిగుమతిదారులు, డిస్ట్రిబ్యూటర్లు, టోకు వర్తకులు, రిటైల్ శ్రేణుల ప్రతినిధులు ఉన్నారు. భారతీయ ఎగ్జిబిటర్లతో వ్యవస్థీకృత కొనుగోలుదారు - విక్రేత సమావేశాల్లో పాల్గొంటున్నారు. వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి, వనరులను సమకూర్చుకునే కొత్త అవకాశాల అన్వేషణకు, దీర్ఘకాలిక ఎగుమతి సహకారాలను ప్రోత్సహించేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయి.
సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి వైజ్ఞానిక సదస్సులు, ఉత్పత్తుల ప్రదర్శనలతోపాటు.. సేంద్రియ ధ్రువీకరణ, ఉత్పత్తి మూలాల గుర్తింపు, సుస్థిరత, మార్కెట్ లభ్యత, మారుతున్న వినియోగదారు ప్రాధాన్యాలకు సంబంధించి తాజా విశేషాలు, అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్యంలో నూతన అవకాశాలపై చర్చలను కూడా ఈ మూడురోజుల ప్రదర్శనలో భాగంగా నిర్వహిస్తారు. అంతర్జాతీయ నియంత్రణా ఆవశ్యకతలు, నాణ్యతా ప్రమాణాలు, ఎగుమతి మార్కెట్ అంచనాలపై ఈ సమావేశాలు అవగాహన కల్పిస్తాయి.
ప్రారంభ సమావేశానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ కటికితల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్, జర్మనీ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, శ్రీ జార్జ్ ఎన్జ్‌వైలర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అపెడా చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్, భారత సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యదర్శి శ్రీ ఎం.ఎస్. మణివణ్నన్, న్యూరన్‌బర్గ్ మెస్సె ఇండియా బోర్డు చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనియా ప్రషర్, ఐఫోమ్- ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాక్రో మార్కో ష్లూటర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. సేంద్రియ రంగం దేశ వ్యవసాయ ఎగుమతులను పెంచడంతోపాటు రైతులకు, సంస్థలకూ విస్తృతమైన మార్కెట్ అవకాశాలను కల్పిస్తోందని శ్రీ కటికితల శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశంలోని విస్తృతమైన ధృవీకృత సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శనకు, అంతర్జాతీయ కొనుగోలుదారులతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు, అంతర్జాతీయ సేంద్రియ మార్కెట్లలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి, సేంద్రియ రంగంలోని ప్రతిదశలోనూ అధిక విలువను పొందేందుకు... బయోఫాక్ ఇండియా వంటి వేదికలు మార్గం సుగమం చేస్తాయన్నారు.
భారత సేంద్రియ రంగం వైవిధ్యంతో కూడుకున్నదని, క్రమంగా విస్తరిస్తున్న ఈ రంగానికి అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన అవకాశాలున్నాయని శ్రీ నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. భారతీయ ఎగుమతిదారులు, సేంద్రియ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో సంప్రదింపులు చేయడానికి, మారుతున్న మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడానికి బయోఫాక్ ఇండియా కీలక వేదికను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నాణ్యతకు భరోసా, మార్కెట్ అవకాశాలు, మెరుగైన అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా.. దేశ సేంద్రియ ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
అపెడా, న్యూరన్‌బర్గ్ మెస్సె ఇండియా, ఐఫోమ్- ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త కార్యక్రమం బయోఫాక్ ఇండియా- 2026. భారత సేంద్రియ వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాలను విస్తరించడం, దేశంలోని సేంద్రియ ఉత్పత్తుల సంస్థలకు కొత్త అవకాశాలను అందించడంతోపాటు.. భారత్‌లోని ధ్రువీకృత సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యాన్ని, గుర్తింపును కల్పించడం లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2295985)
आगंतुक पटल : 3