మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నేషనల్ మీన్స్–కమ్–మెరిట్ ఉపకార వేతన పథకానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2026 ఆగస్టు 31
प्रविष्टि तिथि:
06 AUG 2026 8:44PM by PIB Hyderabad
జాతీయ మీన్స్–కమ్–మెరిట్ ఉపకార వేతన పథకానికి (ఎన్ఎంఎంఎస్ఎస్) అర్హులైన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఉపకార వేతనం పొందడానికి లేదా రెన్యువల్ కోసం జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పీ)లో దరఖాస్తులను సమర్పించాలి.
రెండు దశల్లో ఎన్ఎంఎంఎస్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ జరుగుతుంది.
ఇనిస్టిట్యూట్ నోడల్ అధికారి (ఐఎన్‌వో) మొదటి దశ (ఎల్ 1) ధ్రువీకరణ చేస్తారు. చివరి తేదీ 2026 సెప్టెంబర్ 15.
జిల్లా నోడల్ అధికారి (డీఎన్‌వో) రెండో దశ (ఎల్ 2) ధ్రువీకరణ చేస్తారు. చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30.
అదేవిధంగా, 2026–27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు ఒక ప్రతిభ ఆధారిత ఉపకార వేతన పథకానికి, ఒకటి కంటే ఎక్కువ సంక్షేమ ఆధారిత పథకాలకు ఒకే సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఆయా పథకాలు నిర్దేశించిన ప్రమాణాలకు విద్యార్థులు అర్హులై ఉండాలి.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించి ఎనిమిదో తరగతి తర్వాత కూడా వారు చదువును కొనసాగించేలా చేయడం, తద్వారా సెకండరీ స్థాయిలో విద్యా విరమణలు తగ్గించడమే లక్ష్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ప్రారంభమయింది.
ఈ పథకం ద్వారా తొమ్మిదో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రతి ఏటా ఒక లక్ష కొత్త ఉపకార వేతనాలు మంజూరవుతాయి. నిర్దేశిత షరతులకు లోబడి పది నుంచి 12వ తరగతి వరకు ఈ ఉపకార వేతనాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
చివరి తేదీ కంటే ముందుగానే దరఖాస్తులను సమర్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విద్యార్థులకు సూచించింది. దీనివల్ల చివరి నిముషంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చని తెలిపింది. అలాగే దరఖాస్తులను సకాలంలో పరిశీలించి, ఉపకార వేతనాల పంపిణీని సులభతరం చేయడానికి ధ్రువీకరణ ప్రక్రియను నిర్దేశిత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని ఇనిస్టిట్యూట్, జిల్లా నోడల్ అధికారులకు కూడా సూచించింది.
(रिलीज़ आईडी: 2295982)
आगंतुक पटल : 3