బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భువనేశ్వరి ఓసీపీలో ఉత్పత్తికి ఊతాన్నిస్తున్న నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికి తోడ్పడుతున్న సుస్థిరత

प्रविष्टि तिथि: 06 AUG 2026 2:34PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆర్థిక మహాశక్తిగా మారే దిశగా భారత్ దూసుకుపోతున్న క్రమంలో, మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎమ్‌సీఎల్)కు చెందిన భువనేశ్వరి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ) ఉత్పాదకత, సాంకేతికత, సుస్థిరతల మేలుకలయికకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. బొగ్గు గనులకు నిలయమైన ఒడిశాలోని తాల్చేర్ బొగ్గు గని ప్రాంతంలో నెలకొన్న ఈ ప్రాజెక్టు కోల్ ఇండియా (సీఐఎల్)కు చెందిన అత్యంత ఆధునిక, ఫలప్రద ఉపరితల గనులలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. 30 మిలియన్ టన్నుల వార్షిక గరిష్ఠ సామర్థ్యం (ఎమ్‌టీపీఏ)తో పనిచేసే ఈ గని ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్లతో పాటు పరిశ్రమలల్లో వెలుగులను నింపుతున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక నవకల్పనలు, సమాజ భాగస్వామ్యం.. వీటి సమన్వయంతోనే బొగ్గు ఉత్పత్తిలో భారీ స్థాయి పురోగతి సాధ్యపడుతుంది అనేది ఈ ప్రాజెక్టు చాటిచెప్పిన మరో ముఖ్యాంశం.
కార్యకలాపాల ప్రావీణ్యానికి అద్దం పడుతున్న పనితీరు
అత్యంత శ్రద్ధతో పథకాలను రూపొందించి వాటిని  అంతే ఏకాగ్రతతో నిరంతర ప్రాతిపదికన అమల్లో పెడుతున్నందు వల్ల కార్యకలాపాల నిర్వహణ పరంగా భువనేశ్వరి ఓసీపీకి పలు విజయాలు లభిస్తున్నాయి.  2025-26 ఆర్థిక సంవత్సరంలో  25 మిలియన్ టన్నుల వార్షిక కార్య ప్రణాళిక లక్ష్యాన్ని ఈ గనికి నిర్దేశించగా, దానికి 105.98 శాతం మేర ఎక్కువగా అంటే 26.477 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి చూస్తే, ఇక్కడ అసాధారణ రీతిలో 370.4 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. ఇది భారత ఇంధన రంగానికి ఈ ప్రాజెక్టు దీర్ఘకాలికంగా అందించిన తోడ్పాటును తెలియజేస్తోంది.
ఇదే పురోగతి 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతోంది. ఉత్పత్తి లక్ష్యాన్ని 28 మిలియన్ టన్నులకు పెంచారు. ఈ గని మొదటి మూడు నెలల కాలంలో ఇప్పటికే 7.62 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. ఇది శక్తిమంతమైన నిర్వహణ సన్నద్ధతను, పెంచిన వార్షిక లక్ష్యాన్ని అందుకోవడంలో ఈ ఓసీపీ విశ్వాసాన్ని సూచిస్తోంది.
పోటీపడటంలో సాంకేతికత అందిస్తున్న సహకారం
భువనేశ్వరి ఓసీపీలో, సాంకేతికత ఒక నిర్వహణ సాధనంగా మాత్రమే మిగిలిపోవడం లేదు. అది వ్యూహాత్మక  ప్రయోజనంగా రూపొంది, పర్యవరణ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంపొందిస్తోంది.
ఈ ప్రాజెక్టులో బొగ్గు తవ్వకం ప్రక్రియలో పేలుళ్లకు ఎంతమాత్రం తావు ఇవ్వని సర్పేస్ మైనర్ సాంకేతికతను అనుసరిస్తున్నారు. దీంతో బొగ్గు పొరలలో రంధ్రాలు చేసే, పేలుళ్లు జరిపే పాత పద్ధతులకు స్వస్తి చెప్పారు. బొగ్గు రికవరీని ఈ ఆధునిక గని తవ్వకం పద్ధతులు మెరుగుపరిచాయి. బొగ్గును ఒకే ఆకారంతో తవ్వితీయడం సాధ్యపడుతోంది. దుమ్ము, ధూళి వెలువడటాన్ని కనీస స్థాయికి పరిమితం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ధ్వనులు, భూమి కంపించే సందర్భాలూ చెప్పుకోదగిన స్థాయిలో తగ్గాయి. బొగ్గు నిల్వలకు పైన ఉండే పనికిరాని మట్టి, చెత్త, రాళ్లు, ఇసుక పొరలను తొలగించే ప్రక్రియకే నియంత్రిత విస్ఫోటాలను పరిమితం చేశారు. పర్యావరణానికి అతి తక్కువ నష్టం సంభవించేలా అధునాతన ఎలక్ట్రానిక్ డిలే డెటనేటర్లను ఉపయోగిస్తున్నారు.
దేశంలో అన్నింటి కన్నా ఉన్నతమైన బొగ్గు తరలింపు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా గని నిర్వహణ సామర్ధ్యాన్ని మరింతగా పటిష్ఠపరిచారు. పర్యావరణానుకూల రైలు రవాణాతో 85 శాతం కన్నా ఎక్కువ బొగ్గును సరఫరా చేసేందుకుగాను 25 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎమ్‌సీ) సైలో వ్యవస్థకు కవర్డ్ కన్వేయర్ నెట్‌వర్కు ను అనుసంధానించారు.  కోల్ ఇండియాకు చెందిన ఆటోమేటిక్ ట్రక్ లోడింగ్ వ్యవస్థ (ఏటీఎల్ఎస్)ను కూడా భువనేశ్వరి ఓసీపీలో ఏర్పాటు చేశారు. ఇది ట్రక్కులలో సరుకును నింపడంలో మరింత ఎక్కువ వేగాన్ని, పారదర్శకత్వాన్ని, ఖచ్చితత్వాన్ని సంతరిస్తోంది. అంతేకాదు, మనుషుల ప్రమేయాన్ని చాలా వరకూ తగ్గించింది.
సాముదాయిక భాగస్వామ్యం ద్వారా అభివృద్ధికి ప్రోత్సాహం
ఏ పెద్ద గని తవ్వకం ప్రాజెక్టు విజయానికైనా ఉత్పత్తి ఒక్కటే ప్రమాణం కాబోదు. అంతకన్నా, దాని పరిసరాలలో నివసించే ప్రజలతో పాటు ఆ ప్రజలతో ఉండే అనుబంధాన్ని బట్టి కూడా గని తవ్వకం ప్రాజెక్టు సాఫల్యాన్ని పరిశీలిస్తారు. ఆసక్తిదారులతో అర్థవంతమైన అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం ఉత్పత్తిని ప్రోత్సహించే శక్తిమంతమైన కారకం కాగలుగుతుందని భువనేశ్వరీ ఓసీ నిరూపించింది.
పునరావాసానికి తోడు రహదారులు, సాముదాయిక కేంద్రాలు, విద్యాసంస్థలు, జీవనోపాధికి సాయపడే కార్యక్రమాలు సహా సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు చెప్పుకోదగిన స్థాయిలో ఆర్థిక సహాయాన్ని కూడా ఈ ప్రాజెక్టు అందించింది. మొక్కలు నాటే కార్యక్రమం, పండ్ల మొక్కలు, సాల్ మొక్కల పంపిణీ, పర్యావరణ చైతన్య ప్రచార కార్యక్రమాల నిర్వహణ, తదితర అభివృద్ధి ప్రధాన కార్యక్రమాలు ఈ ప్రాజెక్టుకూ, ఇరుగుపొరుగు సమాజాలకూ మధ్య అనుబంధాన్ని పటిష్ఠపరిచాయి. నిరంతరాయ గని తవ్వకం కార్యకలాపాలు ఉమ్మడి సంపదను సృష్టించాలన్న సిద్ధాంతానికి కూడా ఇది బలాన్నిస్తోంది.  
ఉత్పాదకత, బాధ్యతల మధ్య సమతూకాన్ని సాధించడం
 పర్యావరణం పట్ల బాధ్యతను కలిగివుండటాన్ని గని తవ్వకం రంగంలో ఒక ఆదర్శ ప్రమాణంగా నిలబెట్టింది భువనేశ్వరి ప్రాజెక్టు. పర్యావరణ పరిరక్షణ చర్యలను ఈ ప్రాజెక్టులో విస్తృత స్థాయిలో అమలు చేశారు. వాటిలో.. గాలి నాణ్యతను నిరంతరంగా పర్యవేక్షిస్తుండడం, ధూళి అణచివేతకు సమగ్ర వ్యవస్థ, వాహన చక్రాలను కడిగేందుకు కావలసిన ఏర్పాట్లు, కొత్తగా వనాలను పెంచేందుకు పక్కా వ్యవస్థ, 5 హెక్టార్లలో సాల్ నర్సరీ వంటివి భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక పర్యావరణ గుర్తింపులను సంపాదించిపెట్టాయి. వాటిలో అయిదు నక్షత్రాల రేటింగు, కళింగ పర్యావరణ శ్రేష్ఠతా పురస్కారం ప్రధానమైనవి. ఇవి పర్యావరణ సంరక్షణ పట్ల ఈ ప్రాజెక్టుకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి.  
కార్యకలాపాల నిర్వహణలో సాధించిన ప్రావీణ్యం అదే స్థాయిలో సురక్షను, ఆర్థిక పనితీరును కూడా ప్రతిబింబిస్తోంది. వరుసగా అయిదు సంవత్సరాల నుంచి ప్రాణాంతక ఘటనలు ఏవీ ఇక్కడ నమోదు కాలేదు. గనుల భద్రత విషయంలో ఏటా నిర్వహించే పక్షోత్సవాలలో భువనేశ్వరి ఉన్నత స్థాయి గౌరవాలను సొంతం చేసుకొంది. ఇది కార్యక్షేత్రంలో భద్రత పట్ల రాజీ లేని నిబద్ధతకు ప్రతీక. ఆర్థిక కోణంలో చూసినప్పుడు, ఈ ప్రాజెక్టు మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎమ్‌సీఎల్)కు అన్నింటి కన్న బలమైన భాగస్వామిగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపునకు ముందు రూ.1,792.60 కోట్ల
లాభాన్ని అందించింది. కార్యకలాపాల నిర్వహణలో శ్రేష్ఠత్వం, ఆర్థిక సుస్థిరతా చెట్టపట్టాల్ వేసుకుని ముందుకు సాగుతున్నాయని ఈ అంశం సూచిస్తోంది.    
భవిష్యత్తుకు ఒక ప్రామాణిక సూచిక
భువనేశ్వరి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఉన్నత సామర్థ్యం కలిగిన ఓ బొగ్గు గనికి మించిన ప్రాజెక్టు. ఉత్పత్తి, సాంకేతిక విజ్ఞానం, పర్యావరణం పట్ల బాధ్యత, సామాజిక అభివృద్ధి కలగలసిన ఒకే, నిరంతర అభివృద్ధి నమూనాను ఆధునిక గని తవ్వకం కార్యకలాపాలు ఎలా ఆవిష్కరించగలవనే దానికి ఈ ప్రాజెక్టు ఆకర్షణీయ ఉదాహరణగా నిలుస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన ప్రతి టన్ను బొగ్గూ శాస్త్రీయ పద్ధతుల్లో బొగ్గు గని తవ్వకానికి సంబంధించిన ప్రణాళికారచనకు అద్దం పడుతుంది. ఇక్కడ అమలుచేస్తున్న ప్రతి నూతన ఆవిష్కరణా ఈ ప్రాజెక్టు కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది. అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న ప్రతి సాముదాయిక కార్యక్రమం ఈ ప్రాజెక్టుకు ఉన్న సామాజిక నిబద్ధతను చాటుతోంది.  
భారత్‌లో విశ్వసనీయ ఇంధన వనరులకు డిమాండు పెరుగుతున్న క్రమంలో, కోల్ ఇండియా అభివృద్ధి గాథలో అగ్ర స్థానాన నిలవగల పటిష్ఠ  స్థితిని భువనేశ్వరి ఓసీపీ సంపాదించుకుంది. సాంకేతిక నాయకత్వం, పర్యావరణ అనుకూల పద్ధతులు, సమ్మిళిత అభివృద్ధి.. వీటన్నిటితో అధికోత్పాదకతను నిరంతరంగా మిళితం చేసుకుంటూ, సుస్థిర బొగ్గు గని తవ్వకం కార్యకలాపాల భవితను దృష్టిలో పెట్టుకొని కొత్త గీటురాళ్లను ఈ ప్రాజెక్టు అందిస్తోంది. అలాగే దేశ ఇంధన భద్రతకు చిరస్థాయి తోడ్పాటును కూడా అందిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2295569) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil