సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రామాణిక కథలతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని, పర్యాటక స్థలాల్ని కళ్లకు కట్టడానికి నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపిన సాంస్కృతిక శాఖ, పర్యటన శాఖ

ఇన్‌క్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్‌లో ‘యాజ్ సీన్ ఆన్ నెట్‌ఫ్లిక్స్‌’ సెక్షన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్

प्रविष्टि तिथि: 05 AUG 2026 9:28PM by PIB Hyderabad

ఇన్‌క్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్‌లో ‘యాజ్ సీన్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ సెక్షన్‌ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సెక్షన్‌ను పర్యాటక శాఖకు, నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు మధ్య కొనసాగుతున్న సహకారంలో భాగంగా తీర్చిదిద్దారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా చలనచిత్రాలు, సిరీస్‌లలో చూపిస్తున్న వాస్తవ స్థలాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, అసలు సిసలు అనుభవాలను గురించి తెలుసుకునే అవకాశాన్ని ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు అందించడమే ఈ కార్యక్రమం ధ్యేయం. దీనితో భారత ఘన సాంస్కృతిక వారసత్వానికి, పర్యటన అవకాశాలకు ప్రోత్సాహం లభించనుంది.
భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ కార్యకలాపాలు పది సంవత్సరాలను పూర్తి చేసుకొన్న సందర్భానికి గుర్తుగా న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్‌జీఎమ్ఏ)లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో ‘యాజ్ సీన్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ సెక్షన్‌‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. భారత సాంస్కృతిక వారసత్వం, పర్యటన రంగం, సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థల పురోగతి ప్రస్థానంలో కథను చెప్పే పద్ధతి పోషిస్తున్న కీలక పాత్రపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు నెట్‌ఫ్లిక్స్ సహ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ టెడ్ శారండోస్ పాల్గొన్నారు.  
శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ కథలు వేల సంవత్సరాల నుంచి ప్రపంచానికి స్ఫూర్తిని అందిస్తున్నాయని, ఈ గాథలను ప్రపంచంలో అన్ని చోట్లకూ చేర్చే అపూర్వ అవకాశాన్ని సాంకేతికత ప్రస్తుతం అందిస్తోందని అన్నారు. సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ భారత సాంస్కృతిక గుర్తింపును సంరక్షిస్తూనే ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తూ అభివృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించే స్థితికి ఎదుగుతోందని ఆయన అన్నారు. భారతీయ ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలను ఇవ్వజూపే, దేశ భిన్నత్వాన్ని ఉత్సవాల మాదిరిగా నిర్వహించే, భారతీయ నాగరికతకు సంబంధించిన వారసత్వాన్ని శుద్ధంగా ఆవిష్కరించే  భాగస్వామ్యాలను స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. సంస్కృతి ఒక్క భారత్ వారసత్వం మాత్రమే కాదని, అది భారత్ అతి ప్రధాన వ్యూహాత్మక శక్తులలో ఒకటని, ప్రతి కట్టడం, ఉత్సవం, భాష, జానపద సంప్రదాయంలో ప్రపంచ ప్రేక్షకలోకం చెంతకు చేరుకోదగిన కథలు ఇమిడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.  
నెట్‌ఫ్లిక్స్ సహ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ టెడ్ శారండోస్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్‌‌లో అనేక భారతదేశాలు కొలువై ఉన్నాయని, ప్రతి భారత్‌కీ తనదైన విశిష్ట కథలు, సంప్రదాయాలంటూ ఉన్నాయన్నారు. గత దశాబ్ద కాలంలో దేశంలో వేర్వేరు ప్రాంతాలతో ముడిపడిన కథలు ప్రపంచం నలుమూలల ప్రేక్షకుల్ని అలరించాయని,  భారత్‌  ప్రాంతాల గురించి, భారత్ సంస్కృతులను గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్న ఆసక్తిని వారిలో ఈ కథలు కలిగించాయని ఆయన అన్నారు. భారతీయ కథలను, ప్రాంతాలను అంతర్జాతీయ ప్రేక్షకుల వద్దకు తీసుకుపోవడానికి సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖతో నెట్‌ఫ్లిక్స్ తన భాగస్వామ్యాన్ని ఇక మీదటా కొనసాగించడానికి కట్టుబడి ఉందని శ్రీ టెడ్ శారండోస్ స్పష్టం చేశారు.
భారత్‌‌లో సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరుస్తూ, ప్రపంచ సాంస్కృతిక ముఖచిత్రంలో భారత్‌ స్థానాన్ని పెంపొందిస్తూనే, అదే సమయంలో భారత్‌కు చెందిన విభిన్న సంస్కృతులు, ప్రకృతి దృశ్యాలు, సంప్రదాయాల నుంచి ప్రేరణను పొందిన వాస్తవిక కథలను అంతర్జాతీయ ప్రేక్షక లోకం చెంతకు చేర్చడానికి కలిసి పనిచేయాలని ఉందని కేంద్ర మంత్రితో పాటు శ్రీ శారండోస్ పునరుద్ఘాటించారు.
భారత్‌కు చెందిన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, ప్రకృతి దృశ్యాలు, సమాజం నుంచి స్ఫూర్తిని పొందిన కథలను అంతర్జాతీయ ప్రేక్షకులకు అందించడానికి నెట్‌ఫ్లిక్స్ గత పది సంవత్సరాలుగా భారతీయ కళాకారులతో కలిసి పనిచేస్తోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే, ప్రోత్సహించే, ఉత్సవాలుగా నిర్వహించే  శక్తిమంతమైన మాధ్యమంగా కథన కౌశలాన్ని సద్వినియోగపరుచుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ దృష్టికోణానికి ప్రస్తుత భాగస్వామ్య కార్యక్రమం అనువైందిగా ఉంది. అలాగే ఈ భాగస్వామ్య కార్యక్రమంతో సాంస్కృతిక ప్రధాన పర్యటనకు ఊతం లభించనుంది. ఈ కార్యక్రమం మన సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2295383) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Gujarati