హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని పుణేలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా


జాతీయ చైతన్యాన్ని రగిలించిన మహనీయుడు లోకమాన్య తిలక్ జీ చూపిన సాంస్కృతిక జాతీయవాద బాటలోనే ఇప్పుడు భారత్ పయనం; దానిని ఆపడం ఎవరితరమూ కాదు

తిలక్ మహరాజ్ నినాదం - ఈ దేశ ప్రజలకు ఎవ్వరూ స్వరాజ్యాన్ని ఇవ్వరు, అది ప్రజల హక్కు - ఎంతో పవిత్రమైనది

తిలక్ మహరాజ్ జీవితం, ఉపన్యాసాలు,రచనలు నేటి యువతకు స్ఫూర్తి

తిలక్ మహరాజ్ కోణంలో భగవద్గీతను చదివితే జీవితంలో ఎన్నడూ తప్పు చేయరు

అజిత్ దోవల్‌జీకి లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారం ప్రదానం చేయడం దేశం కోసం జీవిస్తూ, దేశసేవను తమ ధ్యేయంగా చేసుకున్న ప్రతి రంగానికి చెందిన పౌరులకు గొప్ప స్ఫూర్తి

సుదీర్ఘకాలం పాటు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు నిర్వహించిన అజిత్ దోవల్ జీవితం దేశ సేవ, దేశ భద్రత పట్ల అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో,జాతీయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అజిత్ దోవల్

మోదీ ప్రభుత్వం హయాంలో దేశ అంతర్గత భద్రతకు వెన్నెముకగా మల్టీ ఏజెన్సీ సెంటర్; దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బలమైన పునాదిని వేసిన శ్రీ అజిత్ దోవల్

మోదీ నాయకత్వంలో సాయుధ దళాల దాడి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సాంకేతికతను, శౌర్యాన్ని సమన్వయం చేసే దిశగా అజిత్ దోవల్‌ విశేష కృషి

మోదీ పాలనాకాలాన్ని చరిత్రగా రాసి దేశ అంతర్గత, బాహ్య భద్రతపై అంచనా వేసినప్పుడు అందులో అజిత్ దోవల్ గురించిన ఒక స్వర్ణాక్షర పేజీ కూడా తప్పక ఉంటుంది

అన్నాభావు సాఠే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 AUG 2026 5:29PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని పుణేలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) శ్రీ అజిత్ దోవల్‌కు లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారం - 2026ను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీమతి సునేత్రా పవార్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, నేడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ 106వ వర్ధంతి అని, భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ఒక కొత్త దిశను, అర్ధాన్ని ఇచ్చేందుకు తిలక్ మహరాజ్ "స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీరుతాను" అనే మంత్రాన్ని ఇచ్చారని తెలిపారు. మన పాలనా వ్యవస్థ, భాష, సంస్కృతి, ధర్మం దృఢంగా పాదుకొని ఉన్నప్పుడే పూర్తి స్వరాజ్యం సిద్ధించినట్టు చెప్పగలమని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. తిలక్ మహరాజ్ ప్రజాసమూహాలను స్వరాజ్యం, స్వాతంత్ర్య ఉద్యమాలతో అనుసంధానించారని శ్రీ షా అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలోకి 'సాంస్కృతిక జాతీయవాదం' అనే కొత్త రూపం జాతీయవాదాన్ని కూడా శ్రీ తిలక్ ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. లోక్‌మాన్య తిలక్ మహారాజ్ దేశానికి స్వాతంత్ర్య సమర స్ఫూర్తినే కాకుండా, భవిష్యత్తులో భారత్ అనుసరించాల్సిన మార్గాన్నీ నిర్దేశించారని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్ ఇదే మార్గంలో ముందుకు సాగుతుందని తిలక్ విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నేడు దేశం అదే సాంస్కృతిక జాతీయవాద మార్గంలో పయనిస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు.

లోకమాన్య తిలక్ ఒక ఉపాధ్యాయుడు, అత్యుత్తమ పాత్రికేయుడు కూడా  అని శ్రీఅమిత్ షా తెలిపారు. ఒక గొప్ప ఆలోచనాపరుడిగా ఆయన ప్రపంచం ముందు భారతదేశ ఆత్మను ఆవిష్కరించారని కోట్లాది మంది హృదయాలలో స్వరాజ్య కాంక్షను రగిలించారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలమంతటిలో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్‌కు సాటిరాగలవారెవరూ లేరని, ఆయన ఒక దీర్ఘదర్శి, అసాధారణ ఉపాధ్యాయుడు, భయమెరుగని జర్నలిస్ట్, గొప్ప ఆలోచనాపరుడు,  నిరంతర కర్మయోగి అని శ్రీ షా కొనియాడారు.

లోక్‌మాన్య తిలక్ మహారాజ్ భగవద్గీత సారాన్ని ఆచరణాత్మకంగా దేశ ప్రజలకు అందించారని శ్రీ అమిత్ షా అన్నారు. పుణేలో న్యూ ఇంగ్లిష్ స్కూల్‌తో ప్రారంభించి, డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి, అనంతరం ఫెర్గూసన్ కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా సమగ్ర విద్యా వ్యవస్థకు ఆయన పునాది వేశారని పేర్కొన్నారు. విద్య అసలు లక్ష్యం విజ్ఞానంతో మేధస్సును ప్రకాశవంతం చేయడమేనని తిలక్ మహారాజ్ విశ్వసించారని శ్రీ అమిత్ షా తెలిపారు. బ్రిటిష్ పాలకులు ఏ పత్రికలకు అత్యంత భయపడేవారంటే, అవి ‘కేసరి’ ‘ది మరాఠా’ పత్రికలేనని ఆయన అన్నారు.

ప్రజలలో ముందుగా జాతీయ చైతన్యాన్ని రగిలించకపోతే, స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ దానికి పెద్దగా విలువ ఉండదని మొదటగా స్పష్టం చేసింది తిలక్ మహరాజ్ అని శ్రీ షా గుర్తు చేశారు. సువ్యవస్థిత సంస్థలు,  ప్రజల సంఘటిత శక్తి లేకుండా జాతీయ బలం ఎప్పటికీ సమకూరదని తిలక్ మహరాజ్ గట్టిగా చెప్పారని అన్నారు. అనేక ప్రజా ఉత్సవాల ద్వారా ఆయన మహారాష్ట్ర ప్రజలనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులను కూడా ఏకం చేశారని పేర్కొన్నారు.  స్వావలంబన, క్రమశిక్షణ, దేశం పట్ల, రాజ్యాంగం పట్ల బాధ్యతాభావం కూడా స్వరాజ్యంలో అంతర్భాగాలేనని ఆయన తెలిపారు. తిలక్ మహరాజ్ జీవితం, ఆలోచనలు,  రచనలు  యువతకు, కౌమారప్రాయంలో ఉన్నవారికి నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

నేడు శ్రీ అజిత్ దోవల్ 'లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని' అందుకున్నారని తెలిపారు. అవార్డు అనేది కేవలం ఒక పతకం మాత్రమే కాదని; అది ప్రజలను ప్రోత్సహించడానికి,  విశిష్ట వ్యక్తుల అసాధారణ సహకారాన్ని గుర్తించడానికి ఒక సాధనమని ఆయన అన్నారు. సమాజంలోని ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి అసాధారణమైన సహకారాన్ని అందించినప్పుడు, ఆయన కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే మిగిలిపోకుండా, ఎంతో ఎత్తుకు ఎదిగి తరతరాలకు నిరంతర స్ఫూర్తిదాతగా మారతారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులను గౌరవించడం సమాజం బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. ఆలా చేయడం ద్వారా సమాజం తన కర్తవ్యాన్నే కాకుండా, అలాంటి ఆదర్శప్రాయమైన వ్యక్తులను అనుసరించేలా ఇతరులకూ స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. శ్రీ అజిత్ దోవల్‌కు 'లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని' ప్రధానం చేయడం  దేశ సేవలో జీవిస్తూ,  పనిచేస్తున్న ప్రతి పౌరుడికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. 

 

గుజరాత్ లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ -  కేవలం ఆ బాంబు పేలుళ్లను మాత్రమే కాకుండా, వాటితో సంబంధం ఉన్న వ్యక్తులను, దేశవ్యాప్తంగా జరిగిన అన్ని బాంబు పేలుళ్లను విచారించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారని శ్రీ షా తెలిపారు. ఆ విచారణను నిర్వహించడంలో గుజరాత్ పోలీసులతో కలసి పనిచేయడానికి శ్రీ అజిత్ దోవల్‌ను పిలిపించాలని అప్పట్లో శ్రీ మోదీ ఆదేశించారని హోంమంత్రి తెలిపారు. ఫలితంగా, గుజరాత్ పోలీసులు సమన్వయ విచారణ ద్వారా అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లనే కాకుండా, దేశవ్యాప్తంగా జరిగిన 13 బాంబు పేలుళ్ల కేసులను ఛేదించడంలో విజయం సాధించారని ఆయన చెప్పారు. 

శ్రీ నరేంద్ర మోదీ పాలనాకాలాన్ని చరిత్రగా రాసి, దేశ అంతర్గత, బాహ్య భద్రతను అంచనా వేసిన ప్రతిసారీ  శ్రీ అజిత్ దోవల్ అందించిన సహకారానికి సంబంధించి ఒక సువర్ణాధ్యాయం తప్పక ఉంటుందని శ్రీ షా తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విదేశాంగ విధానం మరింత బలోపేతమైందని, ప్రపంచ దేశాల మధ్య మన దేశం ఎంతో గౌరవ మర్యాదలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ ఈ ఘనతలో శ్రీ అజిత్ దోవల్ అపారమైన సహకారాన్ని అందించారని శ్రీ అమిత్ షా అన్నారు. 

1972 నుంచి  ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అయ్యేంత వరకు శ్రీ అజిత్ దోవల్ ఒక నిబద్ధత కలిగిన అధికారిగా సేవలందించారని, దేశం ఎదుర్కొన్న ప్రతి ప్రధాన భద్రతా సవాలును పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని హోం మంత్రి తెలిపారు. ఈశాన్య భారతం, సిక్కిం, జమ్మూకాశ్మీర్, పంజాబ్, పాకిస్తాన్‌లలో సేవలందిస్తున్నప్పుడు శ్రీ దోవల్ అసాధారణమైన సహకారాన్ని అందించారని, ఆ సేవలను మాటల్లో వర్ణించలేమని లేదా అంచనా వేయలేమని ఆయన అన్నారు. శ్రీ అజిత్ దోవల్ ఎంతో కీలకమైన కాలంతో సహా ఆరు సంవత్సరాల పాటు పాకిస్తాన్‌లో సేవలందించి, దేశ భద్రతకు అమూల్యమైన సహకారాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు.

 

2019 తర్వాత, మోదీ ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసీ) ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసిందని, ఈ రోజు ఇది దేశ అంతర్గత భద్రతకు వెన్నుముకగా నిలుస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారు. ఎంఏసీ కి బలమైన పునాది వేసింది శ్రీ అజిత్ దోవలేనని ఆయన పేర్కొన్నారు. 2014లో శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రధాని అయినప్పుడు శ్రీ అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారని శ్రీ షా మరింతగా చెప్పారు. అంతేకాకుండా, దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన జాతీయ భద్రతా సలహాదారుగా కూడా శ్రీ దోవల్ ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన అన్నారు. 

శ్రీ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో, భారత సాయుధ బలగాలను ఆధునీకరించడానికి, సమకాలీన సంస్కరణలను తీసుకురావడానికి, సైన్యంలో సాంకేతికతను శౌర్యంతో అద్భుతంగా సమ్మిళితం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న అనేక నిర్ణయాలకు రూపుదిద్దడంలో శ్రీ దోవల్ సుదీర్ఘ అనుభవం ఎంతగానో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ భారత సాయుధ బలగాల రక్షణ సామర్థ్యాలను,  దాడి చేసే వారి సన్నాహక శక్తిని బలోపేతం చేయడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, ఈ ఘనత సాధించడంలో శ్రీ అజిత్ దోవల్ విశేషమైన సహకారాన్ని అందించారని తెలిపారు.

అన్నాభావు సాఠే  జయంతి సందర్భంగా శ్రీ అమిత్ షా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


(రిలీజ్ ఐడి: 2293114) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil