బొగ్గు మంత్రిత్వ శాఖ
సమగ్ర సంక్షేమం, పెన్షన్ సంస్కరణల ద్వారా పదవీ విరమణానంతర సంరక్షణను బలోపేతం చేస్తున్న కోల్ ఇండియా
प्रविष्टि तिथि:
01 AUG 2026 6:44PM by PIB Hyderabad
పదవీ విరమణ పొందిన తమ ఉద్యోగుల కోసం పెన్షన్ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సదుపాయం, ఫిర్యాదుల పరిష్కారం, సామాజిక భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన అనేక సంస్కరణల ద్వారా... కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) తమ ఉద్యోగుల పదవీ విరమణానంతర సంక్షేమ వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేసింది. ఈ కార్యక్రమాలు 4.5 లక్షలకు పైగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పెన్షన్‌దారుల జీవన నాణ్యతనూ మెరుగుపరిచాయి. దేశ ఇంధన భద్రతకు దోహదపడిన వారి సంక్షేమం పట్ల కంపెనీ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది.
కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సహకారంతో, సి-కేర్స్ వేదిక ద్వారా సీఐఎల్... పెన్షన్ నిర్వహణ డిజిటల్ పరివర్తననూ వేగవంతం చేసింది. దీని ఫలితంగా, పదవీ విరమణ క్లెయిమ్‌ల సగటు పరిష్కార సమయం 30 రోజుల నుంచి కేవలం 10 రోజులకు తగ్గింది. ఆన్‌లైన్ పెన్షన్ సవరణను, సవరించిన పెన్షన్ చెల్లింపు ఉత్తర్వుల జారీని సులభతరం చేయడానికి మరిన్ని డిజిటల్ మాడ్యూల్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇది అవాంతరాలు లేని, కాగితరహిత పెన్షన్ జీవనచక్రానికి మార్గం సుగమం చేస్తుంది.
పదవీ విరమణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సి-కేర్స్ పోర్టల్ ద్వారా పదవీ విరమణ రోజే పీపీవోల జారీ, సీఎంపీఎఫ్ బకాయిల చెల్లింపునకు వీలు కలుగుతుంది. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ విడుదలవుతోంది. సవరించిన పీపీవోల ప్రవేశంతో, అర్హులైన జీవిత భాగస్వామి వివరాలను చేర్చడం ద్వారా కుటుంబ పెన్షన్ ప్రారంభం సులభతరమైంది. పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు సీఎంపీఎఫ్‌వో నుంచి ప్రత్యేక అనుమతి అవసరం లేకుండానే సాధారణ కుటుంబ పెన్షన్ కేసులను ప్రాసెస్ చేయడం వీలవుతుంది.
ఒక ప్రధాన సామాజిక భద్రతా చర్యలో భాగంగా, బొగ్గు గనుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్‌ను 8 మార్చి 2024 నుంచి నెలకు రూ.1,000కి పెంచారు. దీనివల్ల సుమారు 40,000 మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందారు. ఈ చర్య పదవీ విరమణ చేసిన గని కార్మికులకు, వారి కుటుంబాలకు అధిక ఆర్థిక సహాయాన్ని అందించింది.
సీఐఎల్ తన ప్రధాన కార్యాలయం, అనుబంధ సంస్థల్లో ప్రత్యేక పదవీ విరమణానంతర ప్రయోజన విభాగాలు (పీఆర్‌బీసీలు) ఏర్పాటు చేయడం ద్వారా తన సహాయక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ఇవి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏకైక సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తాయి.
సీఐఎల్ పదవీ విరమణానంతర సంక్షేమ పథకంలో ఆరోగ్య సంరక్షణ కీలక విభాగంగా ఉంది. కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ (సీపీఆర్ఎంఎస్) కింద నమోదు చేసుకున్న సుమారు 1.13 లక్షల మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, దేశవ్యాప్తంగా 532 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సను పొందుతున్నారు. ఈ పథకం పదవీ విరమణ పొందిన ఎగ్జిక్యూటివ్‌లకు రూ.25 లక్షల వరకు, పదవీ విరమణ పొందిన నాన్-ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8 లక్షల వరకు వైద్య కవరేజీని అందిస్తుంది. పలు ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చులు ఈ ఆర్థిక పరిమితులకు లోబడి ఉండవు, దీనివల్ల తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితుల్లోనూ మెరుగైన రక్షణ లభిస్తుంది.
ప్రావిడెంట్ ఫండ్ పంపిణీ గత ఏడాది రూ.11,391.6 కోట్లుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 19.5 శాతం పెరిగి రూ. 13,608.8 కోట్లకు చేరుకుంది. గతేడాది పెన్షన్ల పంపిణీ రూ.5,229.1 కోట్లుగా ఉండగా, అది ప్రస్తుతం 22.9 శాతం పెరిగి రూ.6,427 కోట్లకు చేరింది. ఈ సంవత్సరంలో పీఎఫ్, పెన్షన్ పంపిణీలు రెండూ కలిసి రూ.3,415.1 కోట్లు పెరిగాయి. ఈ పెరుగుదల ఈ కార్యక్రమాల స్థాయిని ప్రతిబింబిస్తోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక భద్రత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, సంస్థాగత మద్దతును అందించడంలో సీఐఎల్ నిరంతర నిబద్ధతనూ ఇది స్పష్టం చేస్తోంది. ఈ సంస్థ, పదవీ విరమణ చేసిన తమ ఉద్యోగుల శ్రేయస్సును, నిరంతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ... తమ ప్యానెల్‌లోని హాలిడే హోమ్‌లకు ప్రవేశాన్నీ కొనసాగిస్తోంది.
బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శనంలో... కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు దేశ ఇంధన భద్రతను నిర్ధారించడంలో సుస్థిరతను కొనసాగిస్తున్నాయి. దేశ బొగ్గు యోధులుగా తమ ఉద్యోగుల అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా... వారి సేవా కాలంలో, ఆ తర్వాతా వారి సామాజిక భద్రత, శ్రేయస్సు పట్ల సంస్థకు గల అచంచల నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి.
(रिलीज़ आईडी: 2293111)
आगंतुक पटल : 10