సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంప్రదాయానికి ఆవిష్కరణల జోడింపు: వీసీఎఫ్-ఎస్‌సీ సహకారంతో జౌళి వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తున్న తొలితరం ఎస్సీ మహిళా పారిశ్రామికవేత్త

నాడు పోస్టు చేయడమైనది: 31 JUL 2026 4:33PM by PIB Hyderabad

కోల్‌కతా, సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖ


శ్రీమతి మున్మున్ బిస్వాస్
, డైరెక్టర్ 

 

పట్టుదల, నూతన ఆవిష్కరణలు, సకాలంలో లభించే సంస్థాగత తోడ్పాటుతో ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ కలలను విజయవంతమైన వ్యాపారాలుగా మలుచుకుంటున్నారు. అటువంటి అత్యంత స్ఫూర్తిదాయకమైన ఉదాహరణే కోవల్ క్రాఫ్ట్స్ ప్రైవేటు లిమిటెడ్. ఇది కోల్‌కతాకు చెందిన ఒక వస్త్ర పరిశ్రమ సంస్థ. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని షెడ్యూల్డ్ కులాల వెంచర్ క్యాపిటల్ ఫండ్ (వీసీఎఫ్‌-ఎస్‌సీ) అందించే విప్లవాత్మక మద్దతుకు తొలితరం ఎస్సి మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి మున్మున్ బిస్వాస్ సాధించిన విజయ ప్రయాణం ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.

 

కోల్‌కతాలోని ఐఐఎఫ్‌టీ నుంచి ఎంబీఏ, ఎన్‌ఐఎఫ్‌టీ టెక్స్‌టైల్ డిజైనింగ్‌లో పట్టా పొందిన శ్రీమతి బిస్వాస్.. పశ్చిమ బెంగాల్‌లోని ఖర్దాహా వద్ద ఒక ఆధునిక డిజిటల్ టెక్స్‌టైల్ ప్రింటింగ్, డిజైనర్ ఫ్యాబ్రిక్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఈ సంస్థ స్వయంగా రూపకల్పన చేసిన డిజిటల్ ప్రింటెడ్ వస్త్రాలను ‘ఇండిలూమ్’ అనే బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ఈ ఉత్పత్తులను హోల్‌సేల్, రిటైల్ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్ వేదికలతో పాటు విదేశీ ఎగుమతి మార్కెట్ల ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు.

 

ఈ సంస్థకు ఉన్న వృద్ధి సామర్థ్యాన్ని గుర్తించిన షెడ్యూల్డ్ కులాల వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఈక్విటీ, ఎంపిక ఆధారంగా మార్చుకోగల డిబెంచర్ల రూపంలో వెంచర్ క్యాపిటల్ సహాయం అందించింది. అందులో భాగంగా 2017, 2024 సంవత్సరాల్లో కలిపి మొత్తం రూ. 4.93 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది.

 

ఈ ఆర్థిక తోడ్పాటుతో కంపెనీ అత్యాధునిక యంత్రాలతో కూడిన పూర్తి స్వయంచాలక డిజిటల్ టెక్స్‌టైల్ ప్రింటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. సంస్థ తన నిర్వహణ మూలధనాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు పనితీరు సామర్థ్యాన్ని పెంచుకుంది. డిజైనర్లు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలను కల్పించింది. లభించిన మద్దతుతో హోల్‌సేల్, రిటైల్, ఈ-కామర్స్ మార్గాల ద్వారా తమ ఉత్పత్తుల మార్కెట్ పరిధిని విస్తరించగలిగింది. 

 

ప్రభుత్వ సహాయం ద్వారా లభించిన ఫలితాలు అత్యంత ఆశాజనకంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ సంస్థ 80 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వీరిలో 60 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు కాగా, 20 మంది ఇతర వర్గాల ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ స్థిరంగా ఎదుగుతూ రూ. 7.92 కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చుకుంది. వార్షిక ప్రాతిపదికన రూ. 3.73 కోట్ల ఆదాయాన్ని సాధించింది. తన నికర విలువను రూ. 2.82 కోట్లకు బలోపేతం చేసుకుంది. ప్రసిద్ధ డిజైన్ హౌస్‌లు, ఎగుమతిదారులు, ప్రభుత్వ సంస్థలు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఈ-కామర్స్ వినియోగదారులతో సంస్థ బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకుంది.

 

తన వ్యాపార ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ శ్రీమతి మున్మున్ బిస్వాస్ ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని షెడ్యూల్డ్ కులాల వెంచర్ క్యాపిటల్ ఫండ్ (వీసీఎఫ్‌-ఎస్‌సీ) అందించిన రాయితీ ఆర్థిక సాయం ద్వారానే మేం ఒక చిన్న జౌళి వ్యాపారాన్ని వృత్తి నైపుణ్యం కలిగిన పెద్ద ఉత్పత్తి సంస్థగా తీర్చిదిద్దగలిగాం. మా సొంత బ్రాండ్ ‘ఇండిలూమ్’ద్వారా భారతీయ సంప్రదాయ వస్త్ర శైలిని ఆధునిక ఆవిష్కరణలతో సమ్మేళనం చేస్తున్నాం. స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందిస్తున్నాం’’

 

డిజిటల్ టెక్స్‌టైల్ ప్రింటింగ్, డిజైనర్ ఫ్యాబ్రిక్

కోవల్ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' సాధించిన విజయం.. షెడ్యూల్డ్ కులాల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా లభించే లక్ష్యిత ఆర్థిక సహాయం ఏ విధంగా దోహదపడుతుందో స్పష్టంగా నిరూపిస్తోంది. ఈ పథకం ఎస్సీసి వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు పోటీతత్వం కలిగిన వ్యాపారాలను స్థాపించడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంతగానో తోడ్పడుతోంది. వ్యవస్థాపకతను పెంపొందించడం, సమ్మిళిత సంస్థల అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ  దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కర్తలను సాధికారులను చేస్తూ స్థిరమైన జీవనోపాధులను కల్పిస్తోంది.   

 

***


(రిలీజ్ ఐడి: 2292877) సందర్శకుల సూచీ సంఖ్య : : 42
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati