గనుల మంత్రిత్వ శాఖ
భారత భౌగోళిక సర్వే సంస్థకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్
భారత భౌగోళిక సర్వే సంస్థ 54వ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి వర్ష అశోక్ అగ్లావే
प्रविष्टि तिथि:
31 JUL 2026 8:09PM by PIB Hyderabad
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (భారత భౌగోళిక సర్వే సంస్థ-జీఎస్‌ఐ) 54వ డైరెక్టర్ జనరల్‌గా శ్రీమతి వర్షా అశోక్ అగ్లావే బాధ్యతలు స్వీకరించారు. 176 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశపు అగ్రగామి భూవిజ్ఞాన పరిశోధనా సంస్థకు నాయకత్వం వహిస్తున్న మొదటి మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 2024 జూలై 27 నుంచి 2026 జూలై 31 వరకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించిన శ్రీ అసిత్ సాహా స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.
మూడు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం కలిగిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అగ్లావే.. భారతీయ గనుల బ్యూరోలో పనిచేసిన అనంతరం 1992లో జీఎస్‌ఐలో చేరారు. ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో జీఎస్‌ఐ కేంద్ర ప్రధాన కార్యాలయంలో పనిచేయడంతోపాటు కేంద్ర, ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ముఖ్యమైన శాస్త్రీయ, పరిపాలనా పదవులను నిర్వహించారు. ప్రస్తుత ఉన్నత బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆమె కోల్‌కతాలోని తూర్పు ప్రాంతానికి అదనపు డైరెక్టర్ జనరల్, విభాగాధిపతిగా సేవలందించారు.
శిలాజ శాస్త్రం, పరాగరేణు రంగాల్లో నిపుణురాలైన శ్రీమతి అగ్లావే.. చివరి క్రిటేషియస్-పాలియోసీన్ అవక్షేపాలు, కె-టి బౌండరీ, సాత్పురా-గోండ్వానా బేసిన్ల అధ్యయనంలో విశేష సేవలు అందించారు. మధ్యభారతంలోని సల్బార్డి-ఘోర్‌పెండ్ ప్రాంతాన్ని కొత్త డైనోసార్ గూళ్ళ స్థావరంగా ఆమెనే వెలుగులోకి తెచ్చారు. అంతర్జాతీయ పరిశోధనలకు తోడ్పాటునందిస్తూ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ మ్యూజియం ఆఫ్ పేలియోంటాలజీతో కలిసి సంయుక్త శిలాజ అధ్యయనాల్లో పాల్గొన్నారు. కెనడాలోని టోరంటోలో జరిగిన పీడీఏసీ 2023 ప్రదర్శనకు హాజరైన భారత ప్రతినిధి బృందంలో ఆమె జీఎస్‌ఐ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
తన శాస్త్రీయ పరిశోధనలతో పాటు, జీఎస్‌ఐ సంస్థాగత సామర్థ్యాలను మెరుగుపరచడంలో శ్రీమతి అగ్లావే కీలక పాత్ర పోషించారు. లక్నోలోని ఉత్తర ప్రాంత కార్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరాగరేణు శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ భూవిజ్ఞాన పరిశోధనా కార్యక్రమాలకు నేతృత్వం వహించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన శ్రీమతి అగ్లావే.. కీలక ఖనిజాల అన్వేషణ, దేశ ఖనిజ భద్రత విషయంలో భారత ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జీఎస్‌ఐ తన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఆధునిక భూభౌతిక పరిశోధనలు, వేగవంతమైన అన్వేషణ ప్రక్రియలు, ప్రయోగశాల మౌలిక వసతుల బలోపేతం ద్వారా భూమి లోతుల్లో దాగి ఉన్న ఖనిజ నిల్వలను గుర్తించడాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. తీరప్రాంత సముద్ర ఖనిజ అన్వేషణను విస్తరించడం, నూతన భూవిజ్ఞాన పరిశోధనలను ప్రోత్సహించడం, ప్రకృతి వైపరీత్యాల అధ్యయనం, హిమనీనదాల శాస్త్రం వంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలను విస్తృతం చేయడం, శాస్త్రీయ ప్రచురణలను పెంచడంతో పాటు యువ భూవిజ్ఞాన శాస్త్రవేత్తల నైపుణ్యాలకు పదును పెట్టడం వంటి వాటి ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు.
జీఎస్‌ఐ శాస్త్రీయ నైపుణ్యం, పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలపై ఆమె పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. శాస్త్రీయ నైపుణ్యం, ఆవిష్కరణల ద్వారా పర్యావరణానికి విఘాతం కలగకుండా వనరుల అభివృద్ధికి తోడ్పడుతూ, దేశానికి అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ ఖనిజాల అవసరాలను తీర్చడానికి జీఎస్‌ఐ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2292874)
आगंतुक पटल : 13