శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
31 JUL 2026 12:56PM by PIB Hyderabad
వంటగది ఆటోమేషన్, స్మార్ట్ ఫుడ్ ప్రాసెసింగ్‌లో స్వదేశీ సాంకేతికతల అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రభుత్వ శాస్త్ర-సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ (టీడీబీ)... “రోటిడో – అంతర్నిర్మితంగా గల యంత్రం ద్వారా పిండిని పిసకడం, పిండి ముద్దలను చేసి రొట్టెలుగా నొక్కడం, కాల్చే సామర్థ్యంతో కూడిన కాంపాక్ట్ ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మెషిన్” ప్రాజెక్టు కోసం బెంగళూరుకు చెందిన మెస్సర్స్ ఫుడ్టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్థిక సహాయం అందించింది. స్వదేశీ తయారీ, ఆవిష్కరణల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతునిస్తూ... గృహాలు, చిరు వ్యాపారాలు, రెస్టారెంట్లు, సంస్థాగత వంటశాలల కోసం రూపొందించిన ఈ పూర్తి స్వదేశీ, కాంపాక్ట్ ఆటోమేటెడ్ రోటీ-మేకింగ్ యంత్ర వాణిజ్యీకరణే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
పిండి కలపడం, పిండిని పిసకడం, రొట్టెలుగా నొక్కడం, ఆపై కాల్చడం సహా ఆటోమేటిక్ ఎజెక్షన్నూ ఒకే ఆటోమేటెడ్ సిస్టమ్‌లో ఏకీకృతం చేసే కాంపాక్ట్, ఇంటెలిజెంట్ రోటీ-మేకింగ్ మెషిన్ అయిన రోటిడో సి-150 అభివృద్ధి, వాణిజ్యీకరణపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. గంటకు 150 వరకు రోటీలు ఉత్పత్తి చేయడానికి వీలుగా రూపొందించిన ఈ యంత్రం... స్థిరమైన నాణ్యతను అందిస్తూనే, మానవ శ్రమను గణనీయంగా తగ్గిస్తుంది. పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ సాంకేతికతను పూర్తిగా కంపెనీ అంతర్గత పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాల ద్వారానే రూపొందించారు. తమ పెద్ద పారిశ్రామిక నమూనాలైన రోటిడో ఆర్-1000, ఆర్ఎస్-1000ల విజయవంతమైన వాణిజ్యీకరణ స్ఫూర్తితో... ఫుడ్టెక్నిక్స్ సంస్థ ఇప్పుడు గృహ వినియోగదారులు, చిన్న వాణిజ్య సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక కాంపాక్ట్ పరిష్కారాన్ని పరిచయం చేస్తోంది. నమూనా అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు నిధి ప్రయాస్ పథకం కింద ఆర్థిక సహాయం పొందింది. ఇది, ప్రారంభ దశ సాంకేతిక అభివృద్ధి నుంచి వాణిజ్యీకరణ వరకు ఒక విజయవంతమైన ఆవిష్కరణ ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది.
రోటిడో సి-150 ముఖ్యమైన ఆవిష్కరణ ఏమిటంటే, ఇది 2 కేజీల పిండిని కలిపే అంతర్నిర్మిత యంత్రం (నీడర్), ఆటోమేటెడ్ పిండి ముద్దలను అందించే వ్యవస్థ, కచ్చితమైన పరిమాణం గల రోటీలుగా పిండి ముద్దలను నొక్కే యంత్రాంగం (ప్రెసిషన్ ప్రెస్సింగ్ మెకానిజం), మూడు-అంచెల నియంత్రిత రోస్టింగ్ సాంకేతికతను ఒక చిన్న పరిమాణం గల యంత్రంలో సజావుగా అనుసంధానించింది. తెలివైన ప్రక్రియ సమకాలీకరణ, ప్రోగ్రామెబుల్ నియంత్రణలు, సమీకృత పిండి తూకం వ్యవస్థ వంటివి, అతి తక్కువ మానవ ప్రమేయంతో ఏకరీతి మందం గల పిండి ముద్దలను, ఒకే విధంగా రోటీలను కాల్చడం, పునరావృతమయ్యే ఉత్పత్తి నాణ్యతనూ నిర్ధారిస్తాయి. దీని మాడ్యులర్, ఇంధన-పొదుపు డిజైన్ పరిశుభ్రమైన పనితీరును సాధ్యం చేయడంతో పాటు, ఆటోమేటెడ్ రోటీ తయారీని విస్తృత శ్రేణి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా, సరసమైనదిగా చేస్తుంది.
దిగుమతి చేసుకున్న ఆటోమేటెడ్ కిచెన్ పరిష్కారాలకు స్వదేశీ ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా, ఈ ప్రాజెక్టు ఆహార శుద్ధి పరికరాల కోసం భారత దేశీయ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. సౌకర్యం, ఉత్పాదకతను మెరుగుపరచడమే కాకుండా... ఈ సాంకేతికత కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆహార నాణ్యతను మెరుగుపరచడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు, క్యాంటీన్లు, చిన్న ఆహార సంస్థలకు మద్దతునిచ్చే సామర్థ్యాన్నీ ఇది కలిగి ఉంది.
ఈ సందర్భంగా టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ, "దేశంలో ప్రపంచంతో పోటీపడగల ఉత్పాదక సామర్థ్యాలను సృష్టించడంతో పాటు... ఉత్పాదకత, పరిశుభ్రత, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఆహార శుద్ధి పరికరాల్లో ఆవిష్కరణలు అత్యవసరం. రోటిడో వంటి స్వదేశీ సాంకేతికతలు, ఇంజనీరింగ్ ఆవిష్కరణలు సరసమైన ఆటోమేషన్ ద్వారా రోజువారీ సవాళ్లను ఎలా పరిష్కరించగలవో నిరూపిస్తున్నాయి. బలమైన వాణిజ్య సామర్థ్యం, సామాజిక ప్రభావంతో, మార్కెట్-రెడీ సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్న సంస్థలకు మద్దతునివ్వడానికి టీడీబీ కట్టుబడి ఉంది" అని పేర్కొన్నారు.
తమకు టీడీబీ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఫుడ్టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఇలా పేర్కొంది: టీడీబీ అందించే ఈ సహాయం రోటిడో సి-150 వాణిజ్యీకరణను వేగవంతం చేస్తుంది. దేశీయ తయారీ సామర్థ్యాలనూ బలోపేతం చేస్తుంది. భారతీయ గృహాలు సహా చిన్న తరహా వ్యాపారాల్లో స్వదేశీ ఆటోమేటెడ్ ఆహార శుద్ధి సాంకేతికతల విస్తృత వినియోగానికి ఇది దోహదపడుతుంది.
***