‘బస్తర్ పండుమ్-202’6 విజేతలైన పర్గానా మాంఝీ, చాల్కీలతో కూడిన బస్తర్ మండల ప్రతినిధి బృందం ఇవాళ (జూలై 30, 2026) రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కలిసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ తదితరులు పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. బస్తర్ పండుమ్ కేవలం ఒక సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని.. బస్తర్ సంప్రదాయాలు, సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన వేడుకని రాష్ట్రపతి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బస్తర్ నిజమైన గుర్తింపును చాటటమే దీని లక్ష్యం. సంప్రదాయాలు, ఆచారాలు, సాంస్కృతిక వారసత్వంతో యువతను అనుసంధానించటంలో బస్తర్ పండుమ్ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించటంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు.
సామాజిక జీవనాన్ని, సాంస్కృతిక విలువలను పరిరక్షించటంలో మంఝీ, చాల్కీల పాత్రను రాష్ట్రపతి ప్రశంసించారు. వారు సమాజానికి, పరిపాలనకు మధ్య సమర్థవంతమైన వారధులని అన్నారు. వారి అంకితభావం, నాయకత్వ గుణాల ద్వారా సమాజంలో సంతోషం, శాంతి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కృషి, బస్తర్ ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా కొత్త బాటలో పయనిస్తుండటం పట్ల గౌరవ రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు హింసాత్మక వాతావరణం నుంచి బయటపడి, విద్య, ఉపాధి, అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని ఆమె తెలిపారు. ఈ మార్పు బస్తర్ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని అన్నారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్నాయని.. చాలా కాలంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడు మళ్లీ పిల్లల సందడితో కళకళలాడుతున్నట్లు తెలిపారు. విద్యా కాంతి ప్రతి ఇంటికీ చేరుతోంది. నేడు బస్తర్‌లో ఆశ, నమ్మకం, పురోగతితో కూడిన వాతావరణం నెలకొందని అన్నారు. ఈ పరివర్తన యావత్ దేశానికి ఆనందాన్ని, గర్వాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు.
విద్య, విజ్ఞానశాస్త్రం, కళలు, క్రీడల వంటి వివిధ రంగాల్లో గిరిజన యువత ప్రతిభను చాటుతున్నారని రాష్ట్రపతి అన్నారు. గిరిజనులకు క్రీడలు, కళల్లో సహజసిద్ధమైన ప్రతిభ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఇటీవల బస్తర్ ఒలింపిక్స్ నిర్వహించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గిరిజన ప్రజలు సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ప్రోత్సహిస్తూ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములై దేశ నిర్మాణానికి కృషి చేస్తారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సహకారం, సామరస్యంతో సంస్కృతిని బలోపేతం చేయటం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని అట్టడుగు వర్గాలు, వృద్ధుల సాధికారతకు కృషి చేయాల్సిన అవశ్యకతను వివరించారు. నీరు, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
***