మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
తీర ప్రాంత మత్స్య పరిశ్రమలో మహిళల కోసం సముద్ర ఆర్థిక వ్యూహం
प्रविष्टि तिथि:
30 JUL 2026 3:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పరిధిలో ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతాల్లోని మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. వారి ఉద్యోగ, జీవనోపాధి అవసరాలు సముద్ర ఆర్థిక వ్యవస్థ విధాన నియమావళిలో ఏకీకృతమయ్యాయి. ఈ పథకం మహిళలను ప్రధాన లబ్ధిదారు బృందంగా గుర్తించి, మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో వారి భాగస్వామ్యానికి, సాధికారతకు మద్దతు అందించేలా అధిక ఆర్థిక సాయాన్నీ, లక్షిత కార్యక్రమాలనూ అందిస్తుంది. ప్రభుత్వం నుంచి 60 శాతం వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి మహిళా లబ్ధిదారులు అర్హులు. సాధారణ కేటగిరీకి చెందిన వారికి 40 శాతం మాత్రమే ఆర్థిక సాయం లభిస్తుంది. ఇది వ్యక్తిగత, సామూహిక కార్యకలాపాలు రెండింటికీ వర్తిస్తుంది. తద్వారా మత్స్య సంబంధిత వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవడం మహిళలకు సులభతరమవుతుంది.
అ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిన వివరాల ప్రకారం, సహకార సంస్థలను బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంస్థ (ఏఎఫ్సీవోఎఫ్) చేపట్టింది. దీనిలో భాగంగా నెల్లూరుతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మత్స్య రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ఎఫ్‌పీవోలు) ఏర్పాటు చేయడం సులభతరమవుతుంది. అలాగే మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. సమష్టి ప్రయత్నం, సంస్థాగత మద్దతు ద్వారా మత్స్య రైతులకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. అంతేకాకుండా.. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎం-ఎంకేఎస్ఎస్వై) పథకాల ద్వారా అందుబాటులో ఉన్న ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాలు, సామర్థ్యం పెంపు, ఇతర ప్రయోజనాలను పొందేలా ఎఫ్‌ఎఫ్‌పీవోలకు వీలు కల్పిస్తుంది.
ఆ. చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడం, విలువైన వ్యాపార వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా సముద్రం లోతుల్లో చేపల వేటను, వేట యాంత్రీకరణను ప్రోత్సహించడానికి పీఎంఎంఎస్‌వైతో సహా మత్స్య శాఖ అమలు చేస్తున్న విధానాలు, పథకాలు అధిక ప్రాధాన్యమిస్తాయి. మత్స్యకార మహిళల సంప్రదాయ జీవనోపాధిని కాపాడటానికీ, బలోపేతం చేయడానికీ పీఎంఎంఎస్‌వై పరిధిలో ప్రత్యేక సాయం అందుతుంది. సాధారణ కేటగిరీకి చెందిన వారికి లభించే 40 శాతం ఆర్థిక సాయంతో పోలిస్తే... సముద్ర లోతుల్లో చేపల వేటకు ఉపయోగించే పడవలను కొనుగోలు చేయడంతో సహా మత్స్య రంగంలో వివిధ కార్యకలాపాల నిర్వహణకు 60 శాతం ఆర్థిక సాయాన్ని పొందేందుకు మహిళా లబ్ధిదారులు అర్హులు. అదేవిధంగా, సముద్ర నాచు సాగు, ఆర్నమెంటల్ ఫిషరీస్, వరి-చేపల సమగ్ర సాగు, కేజ్ కల్చర్, చేపల శుద్ధి, విలువ జోడింపు, మార్కెటింగ్ లాంటి విభిన్న ఆదాయ మార్గాలకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది. తద్వారా జీవనోపాధిలో వైవిధ్యానికీ, స్థిరత్వానికీ ప్రోత్సాహం లభిస్తోంది.
ఇ. ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి, వాటిని బలోపేతం చేయడానికి పీఎంఎంఎస్‌వై ద్వారా మత్స్య విభాగం తోడ్పాటును అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 66 మహిళా మత్స్యకార సహకార సంఘాలు.. మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్‌పీవోలు)గా నమోదయ్యాయని/రూపాంతరం చెందాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. 10 ఎఫ్ఎఫ్‌పీవోలకు నిర్వహణ వ్యయం, ఈక్విటీ గ్రాంట్ కింద మొత్తం రూ. 69,11,452 విడుదలయ్యాయి. ఈ మొత్తం ఆయా సహకార సంఘాల్లో కార్యాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, వ్యాపారాభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడానికి, వాటి ఆర్థిక మూలాలను బలోపేతం చేసేందుకు వీలు కల్పిస్తోంది. నెల్లూరు జిల్లాలో 6 మహిళా మత్స్యకార సహకార సంఘాలు... ఎఫ్ఎఫ్‌పీవోలుగా రూపాంతరం చెందాయి. ఇప్పటి వరకు ఒక ఎఫ్ఎఫ్‌పీవోకు రూ.90,000ను వన్ టైమ్ గ్రాంటుగా మంజూరు చేశారు.
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ అందించారు.
***
(रिलीज़ आईडी: 2291906)
आगंतुक पटल : 8