సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
‘పబ్లిక్ పరీక్షల (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026’కు లోక్‌సభ ఆమోదం
పరీక్షలలో అవకతవకల నిరోధం... సత్వర న్యాయ ప్రదానం దిశగా చట్టబద్ధ వ్యవస్థ ఈ సవరణలతో మరింత బలోపేతం: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
29 JUL 2026 6:02PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వివిధ పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రోజు లోక్‌సభకు సమర్పించిన “పబ్లిక్ పరీక్షల (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026” విస్తృత చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర, (స్వతంత్ర బాధ్యత) ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ఈ సవరణలతో పబ్లిక్ పరీక్షలలో అక్రమాల నివారణ సహా విద్యార్థులు, యువత ప్రయోజనాల పరిరక్షణ దిశగా చట్టబద్ధ వ్యవస్థ మరింత బలోపేతం కాగలదని ఆయన వ్యాఖ్యానించారు.
పబ్లిక్ పరీక్షల వ్యవస్థ సమగ్రత, పారదర్శకత, విశ్వసనీయతలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వ్యవస్థీకృత పరీక్షల సంబంధిత నేరాలను సమర్థంగా నిరోధించడంలో భాగంగా ఆచణాత్మక సూచనల స్వీకారం, అనుభవాల నుంచి గుణపాఠాలు సహా చట్టాన్ని మరింత పటిష్టం చేయడంపై ప్రభుత్వ సంసిద్ధతను ఈ సవరణలు ప్రతిబింబిస్తాయని చెప్పారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సహా ఉన్నత విద్య ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వంటి ప్రధాన నియామక సంస్థలు నిర్వహించే ప్రభుత్వ పరీక్షలలో అవకతవకల నిరోధానికి సమగ్ర చట్టబద్ధ చట్రం రూపకల్పన లక్ష్యంగానే “పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్-2024”ను రూపొందించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ చట్టం పరిధిలోని నేరాలను ఇప్పటికే కఠిన శిక్షా నిబంధనలతో విచారణార్హమైనవిగా, బెయిలుతోపాటు రాజీపడటానికి వీలులేనివిగా ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత సవరణ బిల్లులోని కీలక నిబంధనలను వివరిస్తూ- అవకతవకలకు పాల్పడేవారికి విధించే శిక్షను 3 నుంచి 5 ఏళ్లు.. 5 నుంచి పదేళ్లకు పెంచినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అలాగే, గరిష్ఠ జరిమానాను ₹10 లక్షల నుంచి ₹50 లక్షలకు పెంచామన్నారు. ఇలాంటి నేరాలలో పాలుపంచుకునే సేవా సంస్థలకు గరిష్ఠ జరిమానాను ₹1 కోటి నుంచి ₹5 కోట్లకు పెంచడంతోపాటు ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో వాటిపై నిషేధ కాలాన్ని 4 నుంచి 8 ఏళ్లకు పెంచారు. సేవా సంస్థల డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్ బాధ్యులకు విధించే శిక్షను కూడా 3 నుంచి 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాలకు జైలుశిక్షను పెంచారు. గరిష్ఠ జరిమానా ₹1 కోటి నుంచి ₹5 కోట్లకు పెంపు సహా వ్యవస్థీకృత నేరాలపై శిక్షను 5 నుంచి 10 సంవత్సరాలకు, 7 నుంచి 10 ఏళ్లకు పెంచారు. అలాగే, గరిష్ఠ జరిమానాను ₹1 కోటి నుండి ₹10 కోట్లకు పెంచారు.
ప్రభుత్వ పరీక్షల సంబంధిత నేరాలపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఈ సవరణ బిల్లు వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. అభియోగపత్రం దాఖలు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లోగా దర్యాప్తు, మూడు నెలల్లోగా విచారణ పూర్తి కావాల్సి ఉంటుందని చెప్పారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుందని, దీనికింద నేర దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. తద్వారా వ్యవస్థీకృత పరీక్షల సంబంధిత నేరాలపై దర్యాప్తు, చర్యలలో వేగం పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పరీక్షల వ్యవస్థను “లీక్-ప్రూఫ్”గా మార్చేందుకు ప్రసిద్ధ నిపుణులతో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించడాన్ని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. పరీక్షల వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా అందిన సిఫారసుల అమలులో గణనీయ ప్రగతి సాధించామని చెప్పారు.
ఇక 2024 నాటి చట్టం అమలును ప్రస్తావిస్తూ- దానికింద ఇప్పటికే 52 కేసులు నమోదైనట్లు గుర్తుచేశారు. పరీక్షల సంబంధిత నేరాలపై తక్షణ, కఠిన చర్యలకు ప్రభుత్వ కట్టుబాటుకు ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. నిజాయితీపరులు, అర్హులైన విద్యార్థుల కృషికి తగిన ప్రతిఫలం లభించేలా చూడటం ప్రధానమన్నారు. అంతేకాకుండా కఠిన, చట్టపరమైన నిబంధనలు సహా సత్వర న్యాయం ప్రదానంతో పరీక్షల సంబంధిత వ్యవస్థీకృత నేరాలను అరికట్టడమే ఈ సవరణల లక్ష్యమని ఆయన ప్రకటించారు.
చివరగా- ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించడం ద్వారా లక్షలాది విద్యార్థులు-ఉద్యోగార్థుల ఆకాంక్షల పరిరక్షణ సాధ్యమవుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రభుత్వ పరీక్షల వ్యవస్థ నిష్పాక్షికత, పారదర్శకత, విశ్వసనీయతపై ప్రజల విశ్వాసం బలోపేతం చేసే దిశగా ఇదొక కీలక మలుపని పేర్కొంటూ ప్రసంగం ముగించారు.
***
(रिलीज़ आईडी: 2291504)
आगंतुक पटल : 18