రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ప్రజాధనాన్ని పరిరక్షించేందుకు కీలక మధ్యవర్తిత్వ కేసులో విజయం సాధించిన ఎన్‌హెచ్ఏఐ


గుత్తేదారు దాదాపు రూ.3,177 కోట్లు డిమాండ్ చేయగా... కేసును పరిష్కరించేందుకు వర్తించే వడ్డీతో పాటు కేవలం రూ.46 కోట్లకు ఆమోదం తెలిపిన ట్రిబ్యునల్

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2026 4:01PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని 151 కి.మీ. పొడవైన బరేలీ-సీతాపూర్ బీఓటీ (టోల్) ప్రాజెక్టు కోసం ఎరా ఇన్ర్ఫా ఇంజనీరింగ్ లిమిటెడ్ ద్వారా ప్రచారం పొందిన బరేలీ హైవేస్ ప్రాజెక్టు లిమిటెడ్ (బీహెచ్‌పీఎల్)కి సంబంధించిన మధ్యవర్తిత్వ కేసులో ఎన్‌హెచ్ఏఐ కీలక చట్టపరమైన, ఆర్థికపరమైన విజయాన్ని సాధించింది. మే 2019లో ఈ ప్రాజెక్టు ఒప్పందాన్ని ఎన్‌హెచ్ఏఐ రద్దు చేసింది. మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఎన్‌హెచ్ఏఐ వాదనను సమర్థించింది. దీని ద్వారా ప్రజా వనరులను పరిరక్షించటంతో పాటు జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పంద విధానాలను స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రాయితీ ఒప్పందం నుంచి వచ్చిన వాదనలు, ప్రతి వాదనలను ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ పరిశీలించింది. గుత్తేదారు మొత్తం సుమారు రూ. 3,177 కోట్ల విలువైన 30 వాదనలను లేవనెత్తగా... సమగ్ర పరిశీలన అనంతరం చాలా వాదనలను ట్రిబ్యునల్ తిరస్కరించింది. రూ.46 కోట్లు, దానికి వర్తించే వడ్డీకి సంబంధించిన కేవలం మూడు వాదనలను మాత్రమే ఆమోదించింది.

మార్చి 30, 2015 నాటి అనుబంధ ఒప్పందాన్ని (ఎస్ఏ) మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ సమర్థించింది. ప్రాజెక్టు ఆలస్యాలు ఏకకాలంలో జరిగాయని, గుత్తేదారుడి చాలా వాదనలను తిరస్కరించినట్లు ట్రిబ్యునల్ వెల్లడించింది. ఆర్థిక నష్టాలు, ప్రజల అసౌకర్యానికి సంబంధించిన వాదనలతో సహా ప్రతివాదనలను ఎన్‌హెచ్ఏఐ దాఖలు చేసింది. ఈ ప్రతివాదనలను ట్రిబ్యునల్ అనుమతించనప్పటికీ, గుత్తేదారు లేవనెత్తిన భారీ ఆర్థిక వాదనల నుంచి ఎన్‌హెచ్ఏఐ విజయవంతంగా తనను రక్షించుకుంది. ఫలితంగా ప్రజాధనానికి రక్షణ లభించింది.

ఇటీవల వరుసగా సాధించిన ముఖ్యమైన న్యాయపరమైన విజయాల్లో భాగంగా వివిధ మధ్యవర్తిత్వ కేసులను ఎన్‌హెచ్ఏఐ సమర్థవంతంగా ఎదుర్కొంది. జూన్ 2026లో కర్ణాటకలోని తుమకూరు-చిత్రదుర్గ 6 లైన్ల ప్రాజెక్టుకు సంబంధించిన మధ్యవర్తిత్వ కేసులో రూ.1,202 కోట్ల లాభంతో ఎన్‌హెచ్ఏఐకి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఏప్రిల్ 2026లో పానిపట్-జలంధర్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన రెండు మధ్యవర్తిత్వ కేసుల్లో గుత్తేదారు దాదాపు రూ.8,375 కోట్లు డిమాండ్ చేయగా, రూ. 2,888.64 కోట్ల విలువైన కౌంటర్-క్లెయిమ్స్‌ను ఎన్‌హెచ్ఏఐ లేవనెత్తింది. ఎన్‌హెచ్ఏఐకి అనుకూలంగా రూ. 819.96 కోట్లకు ఆమోదం లభించింది. మే 2026లో గుజరాత్‌లోని ఎన్‌హెచ్-48లో కామ్రేజ్-చల్తాన్ విభాగం 6 లైన్లకు సంబంధించిన మధ్యవర్తిత్వ కేసులో గుత్తేదారు దాదాపు రూ.174.49 కోట్లు ఇవ్వాలని కోరగా.. కేవలం రూ.54 లక్షల వరకు మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది.

మధ్యవర్తిత్వ కేసుల్లో సాధించిన విజయాలు.. పటిష్ఠమైన ఒప్పంద నిర్వహణ, సమర్థవంతమైన న్యాయ వ్యూహంపై ఎన్‌హెచ్ఏఐ దృష్టిని స్పష్టం చేస్తున్నాయి. ఇది జాతీయ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణలో పారదర్శకత, ఒప్పంద నిబంధనలను కాపాడుతూనే, ప్రజా ధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఎన్‌హెచ్ఏఐ సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2290206) సందర్శకుల సూచీ సంఖ్య : : 39
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Malayalam