శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్ విభజన చరిత్రలోనే ఘోర తప్పిదం... పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ను (పీఓజేకే) తిరిగి స్వాధీనం చేసుకోవడమే భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న ఏకైక వివాదాస్పద అంశం: డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ రక్షణ వ్యూహం బాహ్య దురాక్రమణ పట్ల కేవలం స్పందించే స్థాయి నుంచి నిర్ణయాత్మకమైన ముందుచూపుతో తిప్పికొట్టే స్థాయికి మారింది: 27వ కార్గిల్ విజయోత్సవ దినం సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో దేశానికి ఉన్న నిశ్చలమైన నిబద్ధతకు కార్గిల్ విజయ్ దివాస్ ఒక ప్రతీక: డాక్టర్ జితేంద్ర సింగ్
శాంతి, అభివృద్ధి, బలమైన జాతీయ భద్రత జమ్మూ కాశ్మీర్ దిశను మార్చేశాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
26 JUL 2026 5:27PM by PIB Hyderabad
చరిత్రలోనే దేశ విభజన అతి పెద్ద పొరపాటు అని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత).. ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారత్- పాకిస్థాన్ మధ్య పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న ఏకైక అంశం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ను (పీఓజేకే) తిరిగి స్వాధీనం చేసుకోవటమేనని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ భద్రతా వ్యవస్థలో నిర్ణయాత్మక మార్పు వచ్చిందని.. బాహ్య దురాక్రమణలపై భారత వ్యవహార శైలి కేవలం ప్రతిస్పందించే ధోరణి నుంచి సంకల్పం, సన్నద్ధత, నిర్ణయాత్మక చర్యలతో కూడిన వైఖరికి మారిందని ఆయన అన్నారు.
ఢిల్లీలోని కాశ్మీరీ కల్చరల్ సెంటర్‌లో మీర్పూర్ బలిదాన్ భవన్ సమితికి చెందిన పీఓజేకే యూత్ ఫోరం భాగస్వామ్యంతో 'జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరం' నిర్వహించిన 27వ కార్గిల్ విజయ్ దివాస్ స్మారక కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బన్సురి స్వరాజ్ గౌరవ అతిథిగా విచ్చేశారు. కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ కే.కే. శర్మ (ఎస్సీ, ఎస్ఎం- బార్) అధ్యక్షత వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్లకు నివాళులర్పించేందుకు పీఓజేకే యూత్ ఫోరంతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరం కన్వీనర్ శ్రీ మహీందర్ మెహతా నాయకత్వం వహించారు.
స్మరించుకోవడమే కాకుండా జాతీయ సంకల్పాన్ని పునరుద్ధరించుకునే రోజుగా కార్గిల్ విజయ్ దివాస్‌ను డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ఈ విజయం భారత సాయుధ దళాల అజేయమైన ధైర్యసాహసాలకు.. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరిరక్షించడంలో భారత్‌కు ఉన్న నిశ్చలమైన నిబద్ధతకు ప్రతీక అని ఆయన అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు నిరంతర అప్రమత్తత, జాతీయ ఐక్యత ఎంతో అవసరమన్న ఆయన.. అందుకే కార్గిల్ నేర్పిన పాఠాలు నేటికీ అత్యంత ప్రాధాన్యమైనవని పేర్కొన్నారు.
కార్గిల్ ఘర్షణకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసిన కేంద్ర మంత్రి.. 1999 ఘటనలను విడిగా చూడలేమని దేశ విభజనతో ప్రారంభమైన వరుస పరిణామాల కొనసాగింపుగానే దీనిని భావించాలని అన్నారు. దేశ విభజనను చరిత్రలోనే అతిపెద్ద పొరపాటని ఆయన పేర్కొన్నారు. ఇది తీవ్ర మానవ వేదనకు కారణమైందని, మిలియన్ల మందిని నిర్వాసితులను చేసిందని.. 1947, 1965, 1971, కార్గిల్ యుద్ధాలతో పాటు సరిహద్దు దాటి జరిగే నిరంతర తీవ్రవాదం, పరోక్ష యుద్ధం వంటి దశాబ్దాల శత్రుత్వానికి పునాది వేసిందని చెప్పారు. స్వతంత్ర భారతంలో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన మానవతా విషాదాల్లో కాశ్మీరీ పండిట్ల నిర్వాసం ఒకటని ఆయన గుర్తు చేశారు.
గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం జాతీయ భద్రతా విధానాన్ని ప్రాథమికంగా మార్చుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబించటంతో పాటు సరిహద్దు నిర్వహణను బలోపేతం చేసిందని చెప్పారు. ప్రతిస్పందించే భద్రతా విధానం స్థానంలో బాహ్య దురాక్రమణలకు నిర్ణయాత్మకంగా సమాధానమిచ్చే ముందస్తు వ్యూహాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ మార్పు వల్ల జాతీయ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగిందని, దేశ భౌగోళిక సమగ్రతను పరిరక్షించే భారత్ సామర్థ్యం మరింత బలోపేతమైందని ఆయన పేర్కొన్నారు.
శాంతి, అభివృద్ధి ఒకదానికొకటి పరస్పరం దోహదపడతాయని తెలిపిన కేంద్ర మంత్రి.. ఇటీవలి సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకున్న అపూర్వమైన మార్పులను ప్రస్తావించారు. కాశ్మీర్ లోయకు రైల్వే అనుసంధానం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి, నూతన ఎయిమ్స్ సంస్థల ఏర్పాటు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కూడా పెరిగిందని చెప్పారు. నిరంతర శాంతి వేగవంతమైన అభివృద్ధికి దారితీసిందని.. అదే సమయంలో నిలకడైన స్థిరత్వానికి అభివృద్ధి ఒక శక్తిమంతమైన సాధనంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
రక్షణ ఉత్పత్తుల తయారీలో దేశం స్వయంసమృద్ధి సాధించడం జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని భారత్ భారీగా విస్తరించిందని, అధునాతన వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించుకుందన్న ఆయన.. రక్షణ పరికరాల ఎగుమతిలో దేశం కీలకంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన ఈ ప్రగతి భారత సాంకేతిక పురోగతికి, వ్యూహాత్మక ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) అవతలి పరిణామాలను ప్రస్తావిస్తూ జమ్మూ కాశ్మీర్‌లో కనిపిస్తోన్న అభివృద్ధి వేగం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓజేకే) ప్రజలకు ప్రేరణగా నిలుస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 1994లో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని గుర్తుచేసిన ఆయన.. భారత్- పాకిస్థాన్ మధ్య పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్ప వేరే ఏ వివాదమూ లేదని పేర్కొన్నారు. పీఓజేకే భారత్‌లో విడదీయరాని భాగమని ఆయన పునరుద్ఘాటించారు.
కార్గిల్ యుద్ధ అమరవీరులకు ఘనమైన నివాళులర్పిస్తున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి.. వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, నిస్వార్థ త్యాగాల నుంచి యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. కార్గిల్ సమరయోధుల స్ఫూర్తి ప్రతీ భారతీయుడిని మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మనిర్భరత కలిగిన, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం వైపు నడిపిస్తుందని.. అదే సమయంలో దేశ ఐక్యత, సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో మన సమష్టి నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 2289754)
आगंतुक पटल : 13