పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
మహానదీ తీర ప్రాంత బేసిన్‌లో ఎంఎన్-డీడబ్ల్యూఎన్18-1-హెచ్‌డీ తొలి మదింపు బావి తవ్వకం ప్రారంభం
డ్రిల్లింగ్ చేసే ప్రతి మీటరు... దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తుంది, వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేస్తుంది: శ్రీ హర్దీప్ సింగ్ పూరీ
प्रविष्टि तिथि:
25 JUL 2026 1:26PM by PIB Hyderabad
మహానది తీరప్రాంత బేసిన్‌లో ఎంఎన్-డీడబ్ల్యూఎన్18-1-హెచ్‌డీ మొదటి మదింపు బావి తవ్వకాలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భాన్ని ‘‘భారతదేశ ఇంధన భద్రత ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం’’గా ఆయన అభివర్ణించారు. దేశంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగాల్లో గత పదేళ్లలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన పరివర్తనను ఈ తవ్వకాల ప్రారంభం ప్రతిబింబిస్తోంది.
భారతదేశంలో అత్యంత ఆశాజనకమైన బేసిన్లలో ఒకదానిని క్రమపద్ధతిలో అంచనా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన నాలుగు డీప్‌వాటర్ బావుల్లో మహానది ఆఫ్‌షోర్ బేసిన్‌లో ఈరోజు డ్రిల్లింగ్ ప్రారంభించిన ఎంఎన్-డీడబ్ల్యూఎన్18-1-హెచ్‌డీ మదింపు బావి మొదటిది. నూతన హైడ్రోకార్బన్ వనరులను వెలికితీయడానికి, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ స్థాయి డీప్ వాటర్ డ్రిల్లింగ్ సాంకేతికతను ఉపయోగిస్తారు.
గడచిన దశాబ్దంలో చేపట్టిన చరిత్రాత్మక విధానాలు, నియంత్రణల సంస్కరణల ద్వారా అన్వేషణ, ఉత్పత్తి వ్యవస్థలో మౌలికపరమైన మార్పులను ప్రభుత్వం తీసుకువచ్చిందని మంత్రి అన్నారు.
హైడ్రో కార్బన్ అన్వేషణ, లైసెన్సింగ్ విధానం (హెచ్‌ఈఎల్‌పీ)ను ప్రవేశపెట్టడం, పాత నామినేషన్ పద్ధతి స్థానంలో ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రాం (ఓఏఎల్‌పీ)ను తీసుకురావడం, పారదర్శకమైన ఆదాయ పంపిణీ విధానాన్ని అవలంబించడం, గతంలో నిషేధం ఉన్న తీర ప్రాంతాల్లో 99 శాతం భాగంలో అన్వేషణకు అనుమతివ్వడం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంలో ప్రస్తుతం అన్వేషణ జరుగుతున్న మొత్తం విస్తీర్ణంలో దాదాపు 81 శాతాన్ని 2014 తర్వాతే కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ సంస్కరణలు పెట్టుబడిదారుల్లో, అన్వేషకుల్లో నింపిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.
శాస్త్రీయమైన చమురు అన్వేషణ ప్రాదాన్యాన్ని మంత్రి వివరించారు. మిషన్ అన్వేషణ్, జాతీయ భూకంప కార్యక్రమం, విస్తరించిన ఖండాంతర షెల్ఫ్ సర్వే, జాతీయ డేటా రిపోసిటరీ, హైడ్రోకార్బన్ వనరుల మదింపు అధ్యయనం లాంటి కార్యక్రమాల ద్వారా జియోసైంటిఫిక్ డేటాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నిరంతర పెట్టుబడులను పెట్టిందని చెప్పారు. దీనివల్ల భారత దేశ సరిహద్దు బేసిన్లను అన్వేషించడానికి ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన జియోసైంటిఫిక్ డేటాబేస్‌లు సిద్ధమయ్యాయి.
ప్రభుత్వం చేపట్టిన అన్వేషణ సంస్కరణల ద్వారా సాధించిన పురోగతి గురించి కూడా శ్రీ పూరీ వివరించారు. ఓఏఎల్‌పీ పథకం ద్వారా దాదాపు 3.8 లక్షల చదరపు కి.మీ.ల మేర విస్తరించిన 172 అన్వేషణ బ్లాకులకు 4.3 బిలియన్ల అమెరికన్ డాలర్లకు పైగా పెట్టుబడులు హామీలున్నాయని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 674 బావులను తవ్వగా, మరో అయిదింటిని గుర్తించారు. ఏడు బావుల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది.
కొత్త హైడ్రోకార్బన్ వనరులను అన్వేషించడం, ఇప్పటికే ఉన్న జాతీయ ఆస్తుల నుంచి గరిష్ఠ ఉత్పత్తిని సాధించడమనే రెండు లక్ష్యాలున్న వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను, ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి క్షీణత దశలో ఉన్న క్షేత్రాలను పునుజ్జీవింపచేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
భారత దేశ ఇంధన భవిష్యత్తుకు ఒకే ఆవిష్కరణతో భద్రత చేకూర్చలేమని, నిరంతర సంస్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరమైన అన్వేషణ, వేలాది మంది జియాలజిస్టులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆఫ్‌షోర్ నిపుణుల అంకితభావం ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.
‘‘ఈ రోజు మొదటి బావి తవ్వకాలు ప్రారంభించుకున్నాం. మనం అన్వేషిస్తున్నది సముద్ర అడుగు భాగాన్ని కాదు. భారత దేశ ఇంధన భద్రత భవిష్యత్తును. తవ్వే ప్రతి మీటరు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యానికి మరింత చేరువ చేస్తుంది.’’ అని మంత్రి అన్నారు.
ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, సాంకేతిక భాగస్వాములు, మొత్తం అన్వేషణ రంగానికి చెందిన నిపుణులకు శ్రీ పూరీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు ప్రారంభమవుతున్న తవ్వకాలతో... భారతదేశ తీరప్రాంత అన్వేషణ ప్రయత్నాలు మరింత బలోపేతమవుతాయని, దీర్ఘకాలిక ఇంధన భద్రతకు, ఇంధన రంగంలో స్వావలంబన లక్ష్యానికి తోడ్పాటును అందిస్తాయని శ్రీ పూరీ విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2289449)
आगंतुक पटल : 18