ఎరువుల విభాగం
పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎరువుల సరఫరాను పరిరక్షించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు
వైవిధ్యమైన ప్రపంచవ్యాప్త కొనుగోళ్లు, సదీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు, నిరంతర పర్యవేక్షణ ద్వారా తగినంత ఎరువుల లభ్యత నిర్ధారణ
కీలక పారిశ్రామిక రసాయనాల సరఫరాను సురక్షితం చేసేందుకు అత్యవసర కార్యాచరణ చర్యలు అమలు
प्रविष्टि तिथि:
24 JUL 2026 4:01PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో చెలరేగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన అవాంతరాలను తట్టుకుని దేశంలో ఎరువుల సరఫరా వ్యవస్థను పరిరక్షించడంతో పాటు రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. 2025-26 కాలంలో తలెత్తిన ఈ ప్రతికూల పరిస్థితులు ఎరువులు, కీలక ముడి సరుకుల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనివల్ల నౌకా రవాణా, బీమా వ్యయాలు పెరగడమే కాకుండా, రవాణాలో జాప్యం, ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భారత దిగుమతి చేసుకునే అమ్మోనియా, ఫాస్ఫారిక్ ఆమ్లం, సల్ఫర్‌ల సరఫరాపై ఈ ప్రభావం పడింది. అంతర్జాతీయ లాజిస్టిక్స్ సమస్యల కారణంగా పొటాష్ దిగుమతి వ్యయం కూడా పెరిగింది. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రభుత్వం విదేశాల నుంచి ఎరువుల కొనుగోళ్లను వేర్వేరు మార్గాలకు విస్తరించడం, ఎప్పటికప్పుడు సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా దేశంలో ఎరువుల లభ్యత తగినంతగా ఉండేలా చూసింది.
అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఉత్పన్నమయ్యే నష్టాలను తగ్గించేందుకు, దిగుమతి వనరులను విస్తరించే దిశగా ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో..
· ఎరువుల సరఫరా భద్రతను బలోపేతం చేసేందుకు భారతీయ ఎరువుల కంపెనీలు, విదేశీ సరఫరాదారుల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందాలను సులభతరం చేయడం.
· పరిమిత సంఖ్యలో ఉన్న సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించి, సరఫరా వ్యవస్థను మరింత స్థితిస్థాపకంగా మార్చేందుకు వివిధ దేశాల నుంచి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను గుర్తించి అన్వేషించేలా విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకోవడం.
· పారదర్శకమైన ధరల నిర్ణయం, ప్రపంచ సరఫరాదారులతో బేరసారాల శక్తిని మెరుగుపరచడం, ముడిసరుకులు సకాలంలో లభించేలా చూడటమే లక్ష్యంగా... పరిశ్రమల కూటమి ద్వారా ఎరువులు, అమ్మోనియా, సల్ఫర్ వంటి ముడిసరుకులను ఎరువుల పరిశ్రమ సమష్టిగా కొనుగోలు చేయడం.
ప్రతి పంట కాలంలో సరైన సమయానికి, తగినంత ప్రమాణంలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన వ్యవస్థను అమలు చేస్తూనే ఉంది. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి రాష్ట్రాల వారీగా, నెలల వారీగా ఎరువుల అవసరాలను అంచనా వేస్తుంది. ఈ అంచనాల ఆధారంగా, ఎరువుల శాఖ నెలవారీ సరఫరా ప్రణాళికలను విడుదల చేయడంతో పాటు సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థ ద్వారా ఎరువుల రవాణాను నిరంతరం పర్యవేక్షిస్తుంది. లభ్యతను సమీక్షించి, అవసరమైన చోట దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వ్యవసాయ అధికారులతో క్రమం తప్పకుండా వారానికోసారి వీడియో కాన్ఫరెన్సులను నిర్వహిస్తుంది. ఇక రాష్ట్రాల పరిధిలో ఎరువుల పంపిణీ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.
ఈ చర్యల ఫలితంగా 2025-26 ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న 2026 ఖరీఫ్ సీజన్‌లో కూడా దేశవ్యాప్తంగా యురియా, డీఏసీ, ఎంఓపీ, ఎన్‌పీకేఎస్ ఎరువుల లభ్యత తగినంతగా అందుబాటులో ఉంది. ఎరువుల అవసరం, లభ్యత, విక్రయాలు, మిగిలిన నిల్వల వివరణాత్మక సమాచారం కింది విధంగా ఉంది.
ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులకు సంబంధించి ప్రభుత్వం 01.04.2010 నుంచి పోషకాహార ఆధారిత రాయితీ (ఎన్‌బీఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులు ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఓజీఎల్) పరిధిలోకి వస్తాయి. కంపెనీలు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఈ ఎరువులను దిగుమతి చేసుకోవడానికి లేదా తయారీ చేయడానికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటాయి. ఇది తగినంత సరఫరాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా పారిశ్రామిక రసాయనాలు, ఔషధ తయారీలో ఉపయోగించే ముడిసరుకుల సరఫరా వ్యవస్థలో కొన్ని ప్రమాదాలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ), అమ్మోనియా, మిథనాల్ వంటి ముడి పదార్థాల తాత్కాలిక కొరత ఏర్పడటంతో పాటు వాటి ధరలు పెరిగాయి. ఈ ప్రమాదాలను తగ్గించి, ఔషధాల ఉత్పత్తి నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం అనేక అత్యవసర చర్యలు చేపట్టింది. వీటిలో భాగంగా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ), ప్రొపైలీన్ గ్లైకాల్ లభ్యతను పెంచేందుకు ప్రొపైలీన్ కేటాయింపులను సులభతరం చేయడం, ఔషధ పరిశ్రమలకు అదనపు అమ్మోనియా సరఫరా అయ్యేలా చూడటం, ప్రస్తుతం ఉన్న వ్యాపారుల ద్వారా మిథనాల్ సరఫరాను మెరుగుపరచడంతో పాటు, స్వదేశీ తయారీదారుల సమన్వయంతో ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను పెంచడం వంటి చర్యలు ఉన్నాయి.
ఫార్మాస్యూటికల్స్, పెట్రోకెమికల్స్, నీటి శుద్ధి, తయారీ పరిశ్రమలతో సహా కీలకమైన అనుబంధ రంగాల్లో ఉపయోగించే పారిశ్రామిక రసాయనాల లభ్యతను, సరఫరా వ్యవస్థను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తలెత్తిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, నిరంతర సరఫరాను నిర్ధారించడానికి విస్తృతమైన అనుబంధ వినియోగాలు కలిగిన 40 అత్యవసర రసాయనాలు, పెట్రోకెమికల్స్‌పై దిగుమతి సుంకాన్ని 2026 జూలై 15 వరకు సున్నాకి తగ్గించారు. కీలక రసాయనాల దిగుమతి మూలాలను విస్తరించడానికి రసాయనాలు, పెట్రోకెమికల్స్ శాఖ ద్వారా లీనియర్ ఆల్కైల్ బెన్జీన్ (ఎల్‌ఏబీ), బ్యూటైల్ ఆక్రిలేట్, మార్ఫోలిన్‌లపై నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులను (క్యూసీఎలు) నిలిపివేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2289229)
आगंतुक पटल : 15