మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హింస వల్ల బాధితులైన, ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఒకే చోట అనేక విధాలైన, తక్షణ సాయాన్ని అందించే ‘వన్ స్టాప్ సెంటర్’ (ఓఎస్‌సీ)

ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా సహకారపూర్వక సేవల్ని అందించడానికి,
సమన్వయాన్ని పటిష్ఠపరచడానికి మహిళా హెల్ప్‌లైన్‌‌తో ఓఎస్‌సీల అనుసంధానం

దీర్ఘకాలిక సంస్థాగత సహాయం, పునరావాసం, సురక్షిత ఆశ్రయం అవసరమయ్యే మహిళలకు
రెఫరల్ సేవలను అందించేలా ‘శక్తి సదన్’తోనూ ఓఎస్‌సీల అనుసంధానం

प्रविष्टि तिथि: 24 JUL 2026 1:58PM by PIB Hyderabad

‘మిషన్ శక్తి’లో భాగమైన సంబల్ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్‌సీ) కూడా ఒక అంతర్భాగం. ఇది హింస వల్ల బాధితులైన మహిళలకు, ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఒకే చోట అనేక విధాల సహాయాన్ని, తక్షణ సహాయాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు, దేశవ్యాప్తంగా 1,033 వన్ స్టాప్ సెంటర్ల (ఓఎస్‌సీస్)ను ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేయగా, వీటిలో 985 వన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2015 ఏప్రిల్ 1 నుంచి 2026 జూన్ 30 మధ్య కాలంలో దేశంలో 15 లక్షల ఇరవై వేలకు పైగా మహిళలకు ఈ సెంటర్లు సాయపడ్డాయి. ప్రతి ఓఎస్‌సీలో ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్, ఇద్దరు కేస్ వర్కర్లు, ఒక సైకో-సోషల్ కౌన్సెలర్, ఒక పారా లీగల్ పర్సనెల్, లేదా న్యాయవాది, ఒక పారా మెడికల్ పర్సనెల్ సహా 13 మందిని నియమించడానికి రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేంద్ర ప్రభుత్వమే 100 శాతం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో స్థానిక అవసరాలు, నిర్వహణ సాధ్యాసాధ్యాల ఆధారంగా సిబ్బంది కూర్పును సరళతరం చేశారు కూడా. ఓఎస్‌సీ పథకం అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలకు అప్పగించారు.
సమన్వయాన్ని పటిష్ఠపరిచి, సహాయ సంబంధిత సేవలను నిరంతరాయంగా అందేటట్లు చూడడానికి ఓఎస్‌సీలను మహిళా హెల్ప్‌లైన్ (డబ్ల్యూహెచ్ఎల్)తో అనుసంధానించారు. ఇంతవరకు 657 ఓఎస్‌సీలను కలిపారు. ఈ ఏకీకరణతో, మహిళలకు సమయానికి తగ్గట్లు అవసరమైన సేవలు అందేటట్లు చూస్తారు. అంతేకాక, అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ఈఆర్ఎస్‌ఎస్-112), చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), ఇతరత్రా సేవలను అందించే వ్యవస్థలతో కూడా అనుసంధానించారు. అలాగే దీర్ఘకాలిక సంస్థాగత సహాయం, పునరావాసం, సురక్షిత ఆశ్రయం అవసరపడే మహిళలను పంపించడంలో వెసులుబాటు కోసం ఓఎస్‌సీలను ‘శక్తి సదన్’తో కూడా జతపరిచారు. ఇది మిషన్ శక్తి ఫ్రేంవర్కులో భాగంగా నిరంతర ప్రాతిపదికన సంరక్షణ అవకాశాన్ని అందిస్తోంది.
‘మిషన్ శక్తి’లో భాగంగా, ఇదివరకటి ‘స్వధార్ గ‌‌ృహం’-(కఠిన పరిస్థితులకు లోనైన మహిళలకు ఉద్దేశించిన ఇల్లు) పథకాన్నీ, ‘ఉజ్జావలా’ (చట్టం కళ్లుగప్పి మనుషులను తరలిస్తుండగా ఆ దుష్టకృత్యం నుంచి రక్షించిన మహిళలకు ఉద్దేశించిన ఇల్లు) పథకాన్ని విలీనం చేశారు. ఇవి ప్రస్తుతం ‘శక్తి సదన్ పథకం’ పేరుతో చెలామణీ అవుతున్నాయి. ఆపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు (వీరిలో మనుషుల దొంగచాటు తరలింపు ఘటనలలో బాధితులైన మహిళలు కూడా ఉన్నారు) ఉద్దేశించిన ఏకీకృత సహాయ, పునరావాస కేంద్రమే ‘శక్తి సదన్’. కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలకు వారు ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కేటట్లు సురక్షిత, సహాయపూర్వక వాతావరణాన్ని వారికి కల్పించడం శక్తి సదన్ లక్ష్యం.
‘శక్తి సదన్‌’లో నివాసం ఉండే వారికి ఆశ్రయం, భోజనం, వస్త్రాలు, సంప్రదింపు సేవలు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలతో పాటు ఇతరత్రా వెసులుబాటులను కల్పిస్తారు. నివాసులకు సంబంధిత విభాగాల సమన్వయంతో వృత్తిపరమైన శిక్షణ, బ్యాంకు ఖాతాలను తెరవడం, సామాజిక భద్రత ప్రయోజనాల వంటి ప్రయోజనాలను అందిస్తారు. దీనికి తోడు కార్యాచరణ సంస్థ ద్వారా కార్మిక, ఉపాధి శాఖ అధీనంలోని ఉపాధి, శిక్షణ డైరెక్టరేట్ గుర్తింపు పొందిన వృత్తి సంబంధిత శిక్షణ సంస్థలు, జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి (ఎన్ఎస్‌డీసీ) కి చెందిన శిక్షణ భాగస్వాములతో మహిళలకు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి తరగతుల నిర్వహణకు ఏర్పాట్లను చేస్తారు. శిక్షణను, పరీక్ష రుసుమును కేంద్ర ప్రభుత్వం, లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మరే పథకం గాని, లేదా కార్యక్రమంలో భాగంగా గాని అందించని పక్షంలో, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత వృత్తి సంబంధ శిక్షణ సంస్థ ఇచ్చే ధ్రువపత్రాన్ని దాఖలు చేస్తే, రుసుమును తిరిగి ఇస్తారు. ఒకవేళ నివాసులు చిన్న తరహా పరిశ్రమను మొదలుపెట్టాలని కోరుకుంటే,  ఎస్ఐడీబీఐ, ముద్రా, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర సంబంధిత పథకాల ద్వారా సూక్ష్మ రుణ సదుపాయాన్ని అందిస్తారు.
దీనికి తోడు, మిషన్ శక్తిలో భాగంగా ‘సఖి నివాస్ పథకం’ (పనిచేస్తున్న మహిళల వసతిగృహం) కూడా ఉంది. పట్టణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న మహిళలకు సురక్షిత,  సౌకర్యవంత నివాసాలు అందుబాటులో ఉండేటట్లు ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం.
ఈ సమాచారాన్ని మహిళలు, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకుర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2288895) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil