సహకార మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతను సాకారం చేస్తూ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో రవాణా రంగంలో సహకార నమూనాను ఆచరణలోకి తెస్తున్న భారత్ ట్యాక్సీ
భారత్ ట్యాక్సీ ద్వారా మహారాష్ట్రలోని యువత, మహిళలు, స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాలు: కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్
సహకార సారథులుగానూ, సంపన్న మహారాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగానూ మారాలని యువతకు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ పిలుపు
భారత్ ట్యాక్సీలో కేవలం సేవలందించే వ్యక్తులుగా మాత్రమే కాకుండా సంస్థకు యజమానులు, వాటాదారులుగా కూడా ‘సారథులు’
భారత్ టాక్సీలో రద్దీని బట్టీ అదనపు ఛార్జీలు, ముందుగా చెప్పకుండా విధించే చార్జీలు లేకుండా ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సేవలు, సారథులకు కష్టానికి తగిన ఆదాయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించిన సహకార విప్లవం ఇప్పుడు మహారాష్ట్ర రవాణా రంగానికీ చేరింది: మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్
ఢిల్లీ, గుజరాత్ తర్వాత మహారాష్ట్రలో ప్రారంభంతో సహకారం ద్వారా ఉపాధి, ఉపాధి ద్వారా సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్న భారత్ ట్యాక్సీ నమూనా
प्रविष्टि तिथि:
23 JUL 2026 5:53PM by PIB Hyderabad
సహకారం, ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధి ద్వారా దేశ రవాణా రంగంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ ఈ సేవలను ప్రారంభించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతకు అనుగుణంగా, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సహకార రంగ ప్రతినిధులు, అధికారులు, భారత్ ట్యాక్సీతో పని చేసే సారథులు పాల్గొన్నారు. ట్యాక్సీ సారథులను కేవలం డ్రైవర్లుగా కాకుండా సేవకు యజమానులుగా, సహకార సంస్థ సభ్యులుగా, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించే సమానత్వ సహకార రవాణా నమూనాను భారత్ ట్యాక్సీ ముందుకు తీసుకువెళుతోంది.
కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ ప్రారంభం రాష్ట్ర సహకార రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అన్నారు. మహారాష్ట్ర సహకార ఉద్యమానికి పుణ్యభూమి అని, వందేళ్లకు పైగా సుసంపన్నమైన సహకార సంప్రదాయాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 8.60 లక్షలకు పైగా సహకార సంఘాల్లో దాదాపు 2.5 లక్షల సంఘాలు ఒక్క మహారాష్ట్రలోనే పనిచేస్తున్నాయని, ఇది భారత సహకార ఉద్యమంలో రాష్ట్రం అందిస్తున్న గణనీయమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రతి రంగానికి సహకార ప్రయోజనాలను విస్తరించడం, సహకార సంస్థల సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2021లో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని శ్రీ మురళీధర్ మోహోల్ గుర్తు చేశారు. సహకార రంగంలో విశేష అనుభవం కలిగిన శ్రీ అమిత్ షాను దేశ తొలి సహకార శాఖ మంత్రిగా నియమించిన అనంతరం, సహకార ఉద్యమానికి కొత్త దిశ, నూతన వేగం, మరింత విస్తృత ప్రాచుర్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్య సాధనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సహకార రంగం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సహకార రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు అనంతరం గత ఐదేళ్లలో దాదాపు 152 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో కొత్త జాతీయ సహకార విధానం, దేశవ్యాప్తంగా రెండు లక్షల కొత్త బహుళ ప్రయోజన సహకార సంఘాల ఏర్పాటు లక్ష్యం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చేపట్టిన చర్యలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 40 వేల కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
దాదాపు రూ. 3,000 కోట్ల వ్యయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) కంప్యూటరీకరణ చేస్తున్నామని, వాటిని 25కు పైగా ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేలా బలోపేతం చేస్తున్నామని శ్రీ మోహోల్ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 39 వేల సహకార సంఘాలు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా పనిచేస్తున్నాయని, సుమారు 54 వేల పీఏసీఎస్‌లు కామన్ సర్వీస్ సెంటర్లుగా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. సహకార సంస్థలు ప్రస్తుతం పెట్రోల్ బంకులు, జన ఔషధి కేంద్రాల నిర్వహణతో పాటు ధాన్య నిల్వలు, వివిధ గ్రామీణ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములవుతున్నాయని తెలిపారు గ్రామస్థాయి సహకార సంస్థలను బలోపేతం చేయడం ద్వారా రైతులు, గ్రామాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఆర్థికంగా సాధికారత సాధించి అభివృద్ధి, సమృద్ధి దిశగా ముందుకు సాగేలా చేయడమే ఈ ప్రయత్నాల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, సేంద్రియ ఉత్పత్తులకు హామీతో కూడిన మార్కెట్లు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా భారతీయ విత్తన సహకార సమితి (బీబీఎస్ఎస్ఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్)లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. దేశవ్యావ్యాప్తంగా దాదాపు 70 వేల సహకార సంస్థలు ఈ మూడు జాతీయ సహకార సంస్థల్లో సభ్యులుగా చేరాయని తెలిపారు. సహకార రంగానికి అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా దేశంలో తొలి సహకార విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ద్వారా రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలకు దాదాపు రూ.10,000 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు శ్రీ మోహోల్ తెలిపారు. రాష్ట్రంలో ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్‌కు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. సహకార గృహ నిర్మాణ రంగానికి స్వతంత్ర న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం, స్వీయ పునరాభివృద్ధిని ప్రోత్సహించడం దిశగా కూడా కీలక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సహకార సంస్థల ద్వారా టిష్యూ కల్చర్‌ను ప్రోత్సహించే కార్యక్రమానికి భూమిని అందించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఉన్న సహకార సంస్థలు, వ్యవస్థల ద్వారా రాబోయే రోజుల్లో భారత్ ట్యాక్సీ సేవలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని యువత, మహిళలు పెద్ద సంఖ్యలో భారత్ ట్యాక్సీలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ ట్యాక్సీ నూతన ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు సారథులను సహకార సంస్థ అభివృద్ధి, లాభాల్లో భాగస్వాములుగా నిలుపుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా సహకార సారథులుగా, సంపన్న మహారాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగా మారాలని ఆయన కోరారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, దేశ తొలి సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో సహకార రంగంలో వచ్చిన నూతన విప్లవ ప్రభావం ఇప్పుడు మహారాష్ట్ర రవాణా రంగంలోనూ కనిపిస్తోందని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్ల తర్వాత మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ ప్రారంభంతో, సహకారం ద్వారా ఉపాధి, ఉపాధి ద్వారా సమృద్ధి సాధించే నూతన నమూనా మరింత ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయి ప్రాథమిక సహకార సంఘాల నుంచి వివిధ సహకార సంస్థల వరకు వాటిని బలోపేతం చేయడం, ఆధునికీకరించడం, మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు, వాటి కోసం కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మార్పు దిశలో భారత్ ట్యాక్సీ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.
యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు ప్రయాణికులకు రవాణాను మరింత సౌకర్యవంతం చేశాయని, అయితే డిమాండ్ పెరిగినప్పుడు అదనపు ఛార్జీలు, చెప్పకుండా వసూలు చేసే రుసుములు, అధిక కమిషన్లు వంటి సమస్యలు ప్రయాణికులు, డ్రైవర్లు ఇద్దరికీ తరచూ ఇబ్బందులు కలిగించాయని తెలిపారు. ఈ సమస్యలకు భారత్ ట్యాక్సీ సహకార విధానంలో పరిష్కారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నమూనాలో ట్యాక్సీ సారథులు కేవలం డ్రైవర్లుగా కాకుండా, సహకార సంస్థకు యజమానులు, వాటాదారులుగా కూడా ఉంటారని, సంస్థ ఆర్జించే లాభాల్లో వారికి వాటా లభిస్తుందని తెలిపారు. ఈ సేవలో రద్దీ చార్జీలు, చెప్పకుండా వసూలు చేసే ఛార్జీలు ఉండవని, నిర్ణీత సేవా రుసుము ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. భారత్ ట్యాక్సీ ద్వారా ప్రజలకు సురక్షితమైన, విశ్వసనీయమైన, నాణ్యమైన రవాణా సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, పారదర్శకమైన ఛార్జీలు, జవాబుదారీతనంతో కూడిన సేవల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. దివంగత డి.బి. పాటిల్ కోఆపరేటివ్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో కీలకమైనదని పేర్కొంటూ, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నివసించే దాదాపు 3,000 నుంచి 4,000 మంది స్థానికులకు రుణ సౌకర్యం ద్వారా ట్యాక్సీలు అందించి, వారిని భారత్ ట్యాక్సీ వేదికతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇందువల్ల స్థానిక యువతకు కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత్ ట్యాక్సీతో అనుబంధం ఉన్న సారథులకు షేర్ సర్టిఫికెట్లు, సేవా కిట్లను పంపిణీ చేశారు. దళారుల ఆధారిత వ్యవస్థ స్థానంలో సారథి కేంద్రిత రవాణా వ్యవస్థను తీసుకురావడమే భారత్ ట్యాక్సీ ఉద్దేశం. సారథులకు స్థిరమైన ఆదాయం కల్పించడం, ప్రయాణికులకు పారదర్శక ఛార్జీలతో సురక్షిత సేవలు అందించడం, సంస్థ ఆర్జించే లాభాలను సారథులతో పంచుకోవడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. రానున్న కాలంలో రాష్ట్రంలోని సహకార సంస్థలు, రవాణా సంస్థలు, స్థానిక సంస్థల సహకారంతో మరింత మంది ట్యాక్సీ డ్రైవర్లు, యువత, మహిళలు, స్థానిక సమాజాలను ఈ వేదికతో అనుసంధానం చేస్తూ దశలవారీగా భారత్ ట్యాక్సీ సేవలను మహారాష్ట్ర అంతటా విస్తరించనున్నారు.
***
(रिलीज़ आईडी: 2288648)
आगंतुक पटल : 6