ఆయుష్
ఆయుష్ ఆధారిత వైద్య పర్యాటకానికి ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
21 JUL 2026 3:58PM by PIB Hyderabad
దేశంలో ఆయుష్ ఆధారిత పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని ఆమోదించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖతో సహా ఇతర శాఖల భాగస్వామ్యంతో వైద్య, వెల్‌నెస్ టూరిజం జాతీయ వ్యూహాన్ని, కార్యాచరణ ప్రణాళికను పర్యాటక మంత్రిత్వ శాఖ రూపొందించింది. సాంప్రదాయ వైద్యం, వెల్‌నెస్ పర్యాటకానికి దేశాన్ని ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్ ఆధారిత వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంది.
1. దేశంలో ఆయుష్ ఆధారిత చికిత్సలను కోరుకునే అంతర్జాతీయ సందర్శకులకు ప్రయాణ ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 27న ప్రత్యేకంగా ఆయుష్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మెడికల్ వీసా కింద ఆయుష్ వీసా (ఎం3), ఆయుష్ అటెండెంట్ వీసా (ఎం4) అనే ప్రత్యేక ఉప విభాగాలను కేటాయించారు. ఇవి విదేశీ పౌరులు, వారితో వచ్చే సహాయకులు భారత్‌లో ఆయుష్ వైద్య సేవలను పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
2. ప్రపంచ మార్కెట్ల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆయుష్ ఉత్పత్తులు, సేవలను తీర్చిదిద్దేందుకు 2025 డిసెంబర్‌లో జరిగిన రెండో ప్రపంచ సాంప్రదాయ వైద్య సదస్సులో ఆయుష్ క్వాలిటీ మార్కును ఆవిష్కరించారు. నిర్దిష్ట వర్గాలకు చెందిన ఆయుష్ ఉత్పత్తులు, సేవలలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన నాణ్యత, భద్రత, సమర్థతను నిర్ధారించడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
3. శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలకు మద్దతుగా, చికిత్స విధానాల్లో ఏకరూపతను పెంచడానికి ఆయుష్ విభాగాల కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను (ఎస్‌టీజీలు) ప్రచురించి అమలులోకి తెచ్చింది.
4. ఇంటర్నేషనల్ ఆయుష్ ఫెలోషిప్, స్కాలర్షిప్ కార్యక్రమం కింద భారత్‌లోని గుర్తింపు పొందిన ఆయుష్ సంస్థల్లో ఆయుష్ కోర్సులను అభ్యసించడానికి విదేశీ విద్యార్థులకు ఆయుష్ మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్‌లను కూడా అందజేస్తోంది.
5. డిసెంబర్ 2019లో జారీ చేసిన ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధమైన సంస్థల పరిధిలోకి రాని ఆయుర్వేద శిక్షణా కోర్సులకు గుర్తింపునిచ్చేందుకు రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ (ఆర్ఏవీ) పరిపాలనా నిబంధనల కింద ఆయుర్వేద శిక్షణ అక్రిడిటేషన్ (గుర్తింపు) బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుత చట్టబద్ధమైన సంస్థల పరిధిలోకి రాని దేశ, విదేశీ ఆయుర్వేద శిక్షణ కోర్సులకు గుర్తింపు ఇచ్చేందుకు ఏటీఏబీని ఏర్పాటు చేశారు.
6. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో మెడికల్ వ్యాల్యూ ట్రావెల్ (వైద్య పర్యాటకం-ఎంవీటీ)ను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పర్యాటక అభివృద్ధి సంస్థ (ఐటీడీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది.
7. మెడికల్ వ్యాల్యూ ట్రావెల్ (ఎంవీటీ) విస్తృత ప్రచారం, అభివృద్ధి కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు ఆయుష్ ఆధారిత వైద్య విలువ పర్యాటక సదస్సులను విజయవంతంగా నిర్వహించింది. వీటిలో మొదటిది 2024 సెప్టెంబర్ 30న ముంబైలో పశ్చిమ జోన్ కోసం, రెండోది 2025 మే 26న చెన్నైలో దక్షిణ జోన్ కోసం సమావేశాలను ఏర్పాటు చేసింది.
8. ఆయుష్ కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే కేంద్ర రంగ పథకాన్ని మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఆయుష్ ఉత్పత్తులు, సేవలను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రోత్సహించడానికి భారతీయ ఆయుష్ ఔషధ తయారీదారులు, సేవా సంస్థలకు మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతు అందిస్తోంది. ఆయుష్ వైద్య విధానాలకు ప్రపంచ స్థాయిలో ప్రచారం, గుర్తింపు, అభివృద్ధి కల్పించడంతో పాటు వాటాదారుల భాగస్వామ్యాన్ని పెంచి అంతర్జాతీయంగా మార్కెట్ విస్తరణకు కృషి చేస్తోంది. విదేశాలలో ఆయుష్ అకడమిక్ ఛైర్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా, పరిశోధన రంగాలను ఈ పథకం ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ వైద్య విధానాలపై అవగాహన, ఆసక్తిని పెంచేందుకు శిక్షణా వర్క్‌షాప్‌లు, సదస్సులను నిర్వహిస్తోంది. ఐసీ పథకం కింద 27 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, 16 ఆయుష్ ఛైర్ ఒప్పందాలు, 57 సంస్థాగత స్థాయి ఒప్పందాలు కుదిరాయి.
9. భారత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంయుక్తంగా 2025 డిసెంబర్ 17 నుండి 19 వరకు న్యూఢిల్లీలో నిర్వహించిన రెండో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సాంప్రదాయ వైద్య సదస్సులో ఆయుష్ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరించింది. సాంప్రదాయ వైద్యం, మెడికల్ వ్యాల్యూ ట్రావెల్ విభాగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంచడానికి వివిధ భాగస్వామ్య దేశాలతో 16 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించింది.
***
(रिलीज़ आईडी: 2287177)
आगंतुक पटल : 10