ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం ఆధ్వర్యంలో గోవాలో ‘భాషిణి రాజ్యం’ కార్యక్రమం


కొంకణి, ఇతర భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత పరిపాలనను ప్రోత్సహించాలని స్పష్టీకరణ

బహుభాషా ఏఐపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, ఐటీ మంత్రి శ్రీ రోహన్ ఎ. ఖుంటే, ఇతర సీనియర్ నేతలు

प्रविष्टि तिथि: 21 JUL 2026 11:28AM by PIB Hyderabad

‘‘భాషిణి రాజ్యం:  రాష్ట్ర స్థాయి భాగస్వామ్య వర్క్‌షాప్’’ను ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై)లో భాగంగా ఉన్న డిజిటల్ ఇండియా కార్పొరేషనుకు (డీఐసీ) చెందిన డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐడీబీ) పణజిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి  గోవా ప్రభుత్వ సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల విభాగం సహకారాన్ని అందించింది. వివిధ భాషల్లో కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రోత్సహించడం, భాషా కేంద్రిత దృష్టికోణంతో ప్రజలకు డిజిటల్ సేవల వ్యవస్థను (డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. డీపీఐ) మరింత బలపరచడం ఈ వర్క్‌షాపు ముఖ్యోద్దేశం. ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, పరిశ్రమ రంగ ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, అంకుర సంస్థల ప్రతినిధులు, భాషా నిపుణులు పాలుపంచుకున్నారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో పాటు సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు, పర్యటన, ముద్రణ, స్టేషనరీ శాఖ మంత్రి శ్రీ రోహన్ ఎ. ఖౌంటే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ పరిపాలనను మరింత సమ్మిళితమైందిగా, సులభతరంగా, బహుభాషలతో కూడుకొని ఉండేదిగా తీర్చిదిద్దాలన్న ఉమ్మడి నిబద్ధతకు ఈ కార్యక్రమం అద్దం పట్టింది.


వర్క్‌షాపులో కొంకణి భాషపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, కృత్రిమ మేధ ఆధారిత భాషా సాంకేతికతలతో డిజిటల్ పాలనను మరింత సమ్మిళితంగా ఎలా తీర్చిదిద్దవచ్చో వివరించారు.  ఫలితంగా పౌరులు తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకొని ప్రభుత్వ సేవలను, సమాచారాన్ని, డిజిటల్ వేదికలను ఇట్టే ఉపయోగించుకొనేందుకు వీలు కలుగుతుంది. చర్చలో పాల్గొన్న వక్తలు బహుభాషా ఏఐ ప్రాధాన్యాన్ని గురించి తెలిపారు. అది స్వర-ఆధారిత డిజిటల్ విస్తారిత అనుబంధ వ్యవస్థను (వాయిస్-ఫస్ట్ ఇకోసిస్టమ్) రూపొందించడంలో సాయపడుతుందనీ, ఫలితంగా భాష ప్రజలకు సేవలను అందించడంలో భాష అడ్డు పడటానికి బదులుగా సౌలభ్యాన్ని ఇవ్వగల మాధ్యమంగా మారగలదనీ వారు స్పష్టం చేశారు.
ప్రాథమిక కార్యక్రమంలో ప్రసంగించిన వారిలో గోవా ప్రభుత్వ సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల విభాగం కార్యదర్శి శ్రీ సంతోష్ సుఖ్‌దేవ్, ఐఏఎస్, గోవా ప్రభుత్వ ఉన్నత విద్య కార్యదర్శి శ్రీ ప్రసాద్ లోలేకర్, ఐఏఎస్, బిచోలిమ్ శాసనసభ్యుడు, గోవా ఇన్ఫోటెక్ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రకాంత్ శెట్టి, గోవా సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు, పర్యటన, ముద్రణ, స్టేషనరీ శాఖ మంత్రి శ్రీ రోహన్ ఎ. ఖౌంటేలతో పాటు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు.
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ అమితాబ్ నాగ్ కీలకోపన్యాసాన్ని ఇస్తూ, బహుళ భాషల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నిర్వహిస్తున్న భాషా- కేంద్రిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భాషిణి  (BHASHINI) అనుసరిస్తున్న దృష్టికోణాన్ని సమగ్రంగా వివరించారు. పాలన, పర్యటన, ఆరోగ్యసంరక్షణ సేవలు, విద్య, బ్యాంకింగ్, పౌర సేవల వంటి రంగాలలో భాషిణి ప్రభావం అంతకంతకు పెరుగుతోందని ఆయన తెలిపారు. కొంకణి సహా ప్రాంతీయ భాషల డిజిటల్ వికాసాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ సేవలను మరింత మంది వినియోగించుకొనేలా చూడడానికి ప్రభుత్వాలు, విద్యారంగ ప్రముఖులు, అంకుర సంస్థలు, భాషా నిపుణుల మధ్య ఇప్పటి కన్నా ఎక్కువ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు.


వర్క్‌షాపులో భాగంగా జాతీయ భాషా సాంకేతికత కేంద్రం (నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ..ఎన్‌హెచ్ఎల్‌టీ)కి సంబంధించిన సాంకేతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అలాగే భాషిణికి చెందిన వివిధ భాషా ఏఐ సేవలు వేగంగా విస్తరిస్తున్న తీరును వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ‘భాషిణి యాప్ మిత్ర’ (BHASHINI App Mitra), ‘భాషిణి మిత్ర’ (BHASHINI Mitra), ‘భాషిణి ప్రవర్తక’ (BHASHINI Pravakta)లను పరిచయం చేశారు. ఏఐ ఆధారిత అనువాదం, స్వరం గుర్తింపు, టెక్స్‌ట్-టు-స్పీచ్, లిప్యంతరణ (ట్రాన్స్‌లిటరేషన్), బహు భాషా ఏపీఐల వంటి సాంకేతికతలను ప్రభుత్వ సేవలు, పౌరులను దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన డిజిటల్ సేవలతో  ఇబ్బందులూ ఎదురుకాని రీతిలో ఎలా అనుసంధానించడానికి వీలవుతుందో తెలియజేశారు.
భాషిణి టీము తన ఏఐ ఆధారిత భాషా సేవలను ఆహ్వానితుల ఎదుట ప్రదర్శించింది. దీంతో కార్యక్రమానికి హాజరైన వారికి బహుళభాషలలో స్వర మెలకువలు, అనువాదం, లిప్యంతరణంతో పాటు దస్తావేజు ఆధారిత సేవలపై అవగాహన ఏర్పడింది. ఈ ప్రదర్శనలతో పౌరుల ప్రయోజనాలే పరమార్థంగా ఉండేలా పాలనను ఏ రకంగా భాషిణి బలోపేతం చేయగలుగుతుందో కూడా సందర్శకులకు తెలిసివచ్చింది. దీంతో పాటు, పర్యటన సంబంధిత సేవలను, సార్వజనిక సమాచారాన్నీ అందుకోవడాన్ని, డిజిటల్ వేదికలకు చేరుకోవడాన్ని భాషిణి వివిధ భాషల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా, సులభతరం చేస్తూ పౌరులకు, సందర్శకులకు మెరుగైన డిజిటల్ అనుభవాలను అందించగలదని కూడా ఈ ప్రదర్శనలు (డెమాన్‌స్ట్రేషన్స్) చాటాయి.
ప్రభుత్వం, విద్యారంగ ప్రముఖులు, భాషా నిపుణులు, సాంకేతిక భాగస్వాముల మధ్య సహకారంతో కొంకణి భాష డిజిటల్ ఇకోసిస్టమును ఎలా పటిష్ఠపరచవచ్చో మరొక ప్రత్యేక కార్యక్రమంలో తెలియజెప్పారు. చర్చలలో భాషా డేటాసెట్లను విస్తరించడం, ఏఐ నమూనాకు మెరుగులు దిద్దడం, గోవా అంతటా బహుభాషా ఏఐని త్వరిత గతిన అనుసరించేటట్లు చూడడం కోసం రాష్ట్రంవారీ వినియోగం సందర్భాల్ని (స్టేట్ స్పెసిఫిక్ యూజ్ కేసెస్) కూడా గుర్తించారు.
యూజ్ కేసులపై ఆధారంగా రూపొందించిన ‘ఓపెన్ మైక్’ కార్యక్రమం పాలన, పర్యటన, విద్య, ఆరోగ్యసంరక్షణ సేవలు, పౌర సేవలు సహా వివిధ రంగాల్లో బహుభాషా ఏఐ తాలూకు రాష్ట్రంవారీ వినియోగం తీరుపై చర్చలకు వీలును కల్పించింది. దీంతో పాటు మరింత సమ్మిళితంగా ఉంటూ, భాషకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రజలకు సేవలను అందించడానికి గోవా డిజిటల్ వేదికలతో ‘భాషిణి’ని అనుసంధానించేందుకు గల అవకాశాలను కూడా గుర్తించింది.
భాషా ప్రధాన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసికట్టుగా పనిచేయాలన్న భాషిణి నిబద్ధతను ఈ వర్క్‌షాపు పునరుద్ఘాటించింది. ఇది గోవా ప్రభుత్వంతో పాటు కొంకణి భాషా విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ప్రాధాన్య ప్రాతిపదికన ఉపయోగించే కేసులను గుర్తించేందుకు, ప్రభుత్వ సేవల్లో బహుభాషా ఏఐ వినియోగాన్ని విస్తృతం చేసేందుకు తోడ్పాటును అందించే దిశగా ఒక కీలక ప్రారంభాన్ని అందించింది. దీంతో మరింత సులువైన, సమ్మిళితమైన, పౌర ప్రధాన పాలన వ్యవస్థకు ప్రోత్సాహం లభించనుంది.
గోవా ప్రభుత్వంలో సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు, పర్యటన, ముద్రణ, స్టేషనరీ శాఖ మంత్రి శ్రీ రోహన్ ఎ. ఖౌంటే మాట్లాడుతూ, ‘సమ్మిళిత, ఏఐ ఆధారిత డిజిటల్ గోవా’ను ఆవిష్కరించే దిశగా ‘‘భాషిణి రాజ్యమ్’’ వర్క్‌షాపు ఒక ముఖ్య కార్యక్రమమన్నారు. భాషతో ఎదురయ్యే ఇబ్బందుల్ని తగ్గించడంతో పాటు గోవాలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే పౌరులు సహా ప్రజలందరికీ కొంకణి భాషలో డిజిటల్ సేవలను తేలికగా అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా భాషిణి విభాగంతో తమ సహకారానికున్న లక్ష్యం’’ అని ఆయన అన్నారు. ‘‘ఏఐ త్వరిత గతిన అందరి అందుబాటులోకి వస్తే.. అది మన భాషను సంరక్షించడం, సాధికారతను కల్పించడంతో పాటు డిజిటల్ రంగంలో గోవా భవితకు, నూతన ఆవిష్కరణల రంగంలో గోవా ప్రయాణానికి కూడా కీలకంగా మారుతుంది’’ అని శ్రీ ఖుంటే అన్నారు.  
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం సీఈఓ శ్రీ అమితాబ్ నాగ్ మాట్లాడుతూ, ‘‘గోవాలో ఓ యువకుని స్వర ఆధారిత డిజిటల్ ప్రయాణాన్ని ఈ విస్తృత ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్) తెలిపింది’’ అన్నారు. దీనిలో స్వర మాధ్యమం ద్వారా పాలనతో పాటు సార్వజనిక సేవల సహజ సిద్ధ సంభాషణలను భాషిణికి సంబంధించిన బహుభాషా ఏఐ ఇకోసిస్టమ్ ఏ రకంగా సుసాధ్యం చేస్తుందో చాటాం. వ్యక్తిత్వ ఆధారితమైన ప్రజెంటేషన్లో ప్రభుత్వ పథకాలు, డిజిటల్ సేవలు మొదలు విద్య, పౌర సహాయ సేవల వరకు విభిన్న అంశాలను చేర్చాం. దీని ద్వారా ఏఐ ఆధారిత వాక్కు సాంకేతిక సేవల వ్యాప్తిని మరింత సమ్మిళితం, సరళం, భాషా కేంద్రితంగా తీర్చిదిద్దవచ్చు. కార్యక్రమంలో ఏఐ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు కొంకణి భాషలో స్వర ఆధారిత డిజిటల్ సార్వజనిక సేవల వికాసానికి వేగాన్ని జతచేయడానికి ఉన్నత నాణ్యత కలిగిన భాషా డేటాసెట్లను రూపొందించడానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని కూడా చర్చించాం’’ అని శ్రీ అమితాబ్ నాగ్ వివరించారు.
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐడీబీ)ని గురించి
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై) ఆధీనంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ)కి చెందిన డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐడీబీ).. కృత్రిమ మేధ సాయంతో అనేక భాషలను డిజిటల్ మాధ్యమంలో చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్న భారత జాతీయ వేదిక. 800 కన్నా ఎక్కువ ప్రభుత్వ వెబ్‌సైట్లకు ఏఐ సేవలను  భాషిణి అందిస్తోంది. ఇది ఇప్పటి వరకు 800 కోట్లకు పైగా ఏఐ అంచనాలను (ఇన్‌ఫరెన్సెస్) అందించింది. రోజూ 2 కోట్ల కన్నా ఎక్కువ ఏఐ అంచనాలను సమకూరుస్తోంది. ఈ వేదిక భారత్‌లో 36 లిపి గల భాషలు, 23 మాట్లాడే భాషలు సహా 35 అంతర్జాతీయ భాషలలోనూ సేవలను అందిస్తోంది. దీంతో భాష ఆధారిత ఏఐ మెలకువలను ఉపయోగించి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరును మరింత సులభతరంగా, భిన్న వర్గాలకు చేరుకొనే విధంగా, అంతిమంగా ప్రజలకు మేలు చేసేదిగా రూపొందించడం సాధ్యపడుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2287155) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil