బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 జూలై 22న ‘ఆరోహ్’ను విడుదల చేయనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ... భారత్ - జర్మనీ అమలు ఒప్పందంపైనా సంతకాలు


కోల్ నీర్ ప్లాంట్ల ప్రారంభం, సవరించిన ఝరియా బృహత్ప్రణాళిక కింద నైపుణ్యాభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం

प्रविष्टि तिथि: 21 JUL 2026 1:00PM by PIB Hyderabad

బాధ్యతాయుతమైన గనుల మూసివేత విధానాలను ప్రోత్సహించే దిశగా నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తున్న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ.. ‘ఆరోహ్ - గనుల మూసివేతపై వార్షిక నివేదిక’ను 2026 జూలై 22న న్యూఢిల్లీలో విడుదల చేయనుంది. ఆమోదిత గనుల మూసివేత ప్రణాళికలకు అనుగుణంగా 42 బొగ్గు గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసివేయడం స్వాతంత్ర్యానంతరం ఇదే మొదటిసారి. శాస్త్రీయ పునరుద్ధరణ, పర్యావరణ పునరుద్ధరణ, మైనింగ్ అనంతరం భూమి సుస్థిర వినియోగం, ప్రజా సంక్షేమ చర్యల ద్వారా గతంలో మైనింగ్ జరిగిన ప్రాంతాలను ఏ విధంగా ఉత్పాదకమైన రీతిలో పునర్వినియోగంలోకి తీసుకువచ్చారో ఈ నివేదిక వివరిస్తుంది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో – సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ, - అణు ఇంధన విభాగం - అంతరిక్ష విభాగం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు. అలాగే కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, కంట్రోలర్ శ్రీ సజీశ్ కుమార్. ఎన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

గనికి సంబంధించిన దశలన్నింటిలో దాని మూసివేత అత్యంత కీలకమైనది. పర్యావరణ పునరుద్ధరణ, భూమి పునరుద్ధరణ, సామాజిక - ఆర్థిక ప్రయోజనాల కోసం మైనింగ్ అనంతరం ఆ ప్రాంతాలను ప్రయోజనకరంగా పునర్వినియోగంలోకి తీసుకురావడం వంటి అంశాలు ఇందులో అంతర్భాగం. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన బొగ్గు మంత్రిత్వ శాఖ - బొగ్గు క్షేత్రాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో మూసివేత, సంబంధిత పక్షాల భాగస్వామ్యం, సుస్థిర భూ వినియోగ ప్రణాళికకు మార్గనిర్దేశం చేసేలా.. పలు విధానాలను ఇటీవల అభివృద్ధి చేసింది. వీటిలో సామాజిక భాగస్వామ్యం కోసం ‘రీక్లెయిమ్’, సుస్థిర గనుల మూసివేత, పునర్వినియోగం కోసం ‘లైవ్స్’, అలాగే గనుల పునర్వినియోగ ప్రత్యామ్నాయాల అంచనా కోసం మౌఖిక నిర్ణయ సహాయక సాధనమైన ‘సువికల్ప్’ వంటివి ముఖ్యమైనవి.

ఈ దృక్పథాన్ని ప్రతిబింబించేలా.. గనుల పునరుద్ధరణ, పర్యావరణ పునరుద్ధరణ, సామాజిక పునరావాస రంగాల్లో క్షేత్రస్థాయిలో చేపట్టిన నూతన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రదర్శించనుంది. దీనికి అనుబంధంగా ఏర్పాటు చేయనున్న ప్రదర్శనలో కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), ఎన్‌టీపీసీ, ప్రైవేటు మైనింగ్ సంస్థలు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అలాగే బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కోల్ ఇండియా లిమిటెడ్ తన అనుబంధ సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన కోల్ నీర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం.. సామాజిక సంక్షేమం కేంద్రంగా అభివృద్ధి పట్ల సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

శాస్త్రీయ పద్ధతుల్లో గనుల మూసివేత, మైనింగ్ అనంతరం సుస్థిర పద్ధతుల్లో భూమి వినియోగ పద్ధతులను ముందుకు తీసుకెళ్లడంలో.. సంస్థాగత భాగస్వామ్యాల బలోపేతం, అంతర్జాతీయ సహకారం దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగుగా నిలవనుంది.

‘మూసివేయబోయే బొగ్గు గనుల’పై సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి డ్యూయిష్ గెసెల్స్‌చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్‌బీట్ (జీఐజెడ్)తో ఒక అమలు ఒప్పందంపై బొగ్గు మంత్రిత్వ శాఖ సంతకం చేస్తుంది. సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, వైజ్ఞానిక వినిమయాన్ని సులభతరం చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో గనుల మూసివేత - మైనింగ్ అనంతర పరిణామాలపై అంతర్జాతీయంగా అత్యుత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

సవరించిన ఝరియా బృహత్ప్రణాళిక కింద వృత్తి నైపుణ్య శిక్షణ సదుపాయాల ఏర్పాటుకు గాను.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), ఝరియా పునరావాస - అభివృద్ధి ప్రాధికార సంస్థ (జేఆర్డీఏ), హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ - రాజధాని యూనివర్సల్ ఫ్యాబ్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కూడా ఈ కార్యక్రమంలో కుదుర్చుకోనున్నారు.

సుస్థిరత, ఆవిష్కరణ, సమాజ సంక్షేమ కేంద్రీకృత అభివృద్ధిని గనుల మూసివేత ప్రణాళికలో ఏకీకృతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యలన్నింటి ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తోంది. వ్యవస్థీకృత విధానాలు, డిజిటల్ సాధనాలు, భాగస్వామ్య సహకార వేదికల ద్వారా.. గనుల మూసివేతను పర్యావరణ పునరుద్ధరణ, ఆర్థిక వైవిధ్యీకరణ, దీర్ఘకాలిక ప్రాంతీయ అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా మలచడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గం సుగమం చేస్తోంది.  

 

***


(रिलीज़ आईडी: 2287148) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil