రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అరటి తోటల నుంచి మఖానా మార్కెట్ల దాకా.. బీహార్ వ్యవసాయ రంగానికి జాతీయ రహదారుల ఊతం

प्रविष्टि तिथि: 19 JUL 2026 2:50PM by PIB Hyderabad

   బీహార్‌ రాష్ట్రంలోని సారవంతమైన మైదానాల మీదుగా నిత్యం సూర్యోదయానికి ముందే ఖగారియాలోని పొలాల నుంచి అరటి గెలలు నింపిన లారీలు బయల్దేరుతుంటాయి. మరోవైపు దేశంలోనే అతిపెద్ద మఖానా సాగు కూడళ్లలో ఒకటైన పూర్ణియాలోని చెరువులు, ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి మఖానా బస్తాలతో ట్రక్కులు ప్రయాణం ప్రారంభిస్తాయి. అయితే, వాహన రాకపోకల రద్దీ, సీజన్ల వారీ అంతరాయాలతో అత్యంత విలువైన ఈ పంటల రవాణా వేగం తరచూ మందిస్తూంటుంది. అరటి వంటి నశ్వర పంటకు  ప్రతి నిమిషం విలువైనదే గనుక వేగంగా, విశ్వసనీయంగా గమ్యం చేర్చగల రవాణా సౌకర్యం అవశ్యం. తద్వారా అరటి నాణ్యత పరిరక్షణతోపాటు పంట పాడవకముందే మార్కెట్లకు చేరడం ద్వారా రైతుకు లాభదాయక ధర లభించే వీలుంటుంది. ఈ నేపథ్యంలో రైతు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర పరిధిలోని రెండు జాతీయ రహదారుల ఉన్నతీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఖగారియా-పూర్నియా విభాగంలోని ఎన్‌హెచ్‌-31, ఎన్‌హెచ్‌-231 విభాగం రహదారిని 4 వరుసలకు ఉన్నతీకరించాలని రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా, మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయానికి అనుగుణంగా రూ.3,936.05 కోట్లతో చేపట్టే రహదారి విస్తరణ పనులు ప్రమాణాలకు తగినట్లు పూర్తయితే బీహార్ అరటి, మఖానా పంటలను సకాలంలో మార్కెట్లకు చేరవేయడం సులువవుతుంది. అలాగే, ఈ పంటల సాగుపై ఆధారపడిన రైతులు, కార్మికులు, వ్యాపారులకు సౌలభ్యం కలుగుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు  వెన్నెముక వంటి వ్యవసాయ కూడలి కూడా బలోపేతం అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, విలువ కొన్ని గంటల ఆలస్యంతో క్షీణిస్తుంది కాబట్టి, ఈ ప్రాంతంలో రహదారుల ఉన్నతీకరణ ప్రాజెక్టుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది.

బీహార్‌లో వరద నిరోధక మౌలిక సదుపాయాల కల్పన

తూర్పు బీహార్ రవాణా వ్యవస్థకు చారిత్రకంగా వరదల ముప్పు అధికం. ముఖ్యంగా కోసి, గంగా నదీ పరీవాహక ప్రభావంగల ప్రదేశాలన్నిటా వర్షాకాలంలో వరదలతో తరచూ రహదారి సంధానం తెగిపోతూంటుంది. దీంతో ప్రయాణిక, వస్తు రవాణా మందగించి ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఈ పరిస్థితుల నడుమ ఖగారియా-పూర్ణయా విభాగంలో రహదారులను 4 వరుసలకు  విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు పదేపదే సంభవించే వరదల వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేలా పునరుత్థాన సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఇంజినీరింగ్ కార్యక్రమాలను కూడా ఈ ప్రాజెక్టుకు జోడించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రహదారి రూపురేఖల మెరుగుదల, పాదచార అంచుల బలోపేతం, ఆధునిక వ్యర్థజల పారుదల వ్యవస్థల సంధానం అవసరమని నిర్ణయించారు. తద్వారా ఏడాది పొడవునా మరింత విశ్వసనీయ రవాణా సదుపాయానికి భరోసా ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

కొత్త అవకాశాలతో సీమాంచల్‌ సంధానం

పరిమిత అనుసంధానం కారణంగా సీమాంచల్ ప్రగతి చిరకాలం నుంచీ కుంటుబడింది. రాష్ట్రంలోని అనేక ఇతర ప్రాంతాలతో పోలిస్తే- ఖగారియా, కటీహార్ సహా ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మేరకు పరిపాలన, విద్యా, ఆర్థిక కేంద్రాల్లో పనుల కోసం వెళ్లాలంటే ప్రయాణ దూరం-సమయం కూడా ఎక్కువ కావడంలో చిక్కులు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో రహదారి ఉన్నతీకరణ, నవీకరణల ద్వారా కీలక గమ్యాల మధ్య ప్రయాణ దూరం, సమయం కూడా తగ్గుతాయి. ఇప్పుడు సుమారు 3.5 నుంచి 4 గంటలుగా ఉన్న సమయం రహదారి ఉన్నతీకరణ తర్వాత 1.5 నుంచి 2 గంటలకు తగ్గి, ప్రాంతీయ రవాణా గణనీయంగా మెరుగుపడుతుంది.

తూర్పు భారత అంతర్రాష్ట్ర అనుసంధానం బలోపేతం

బీహార్‌ రాష్ట్రానికి మాత్రమే గాక తూర్పు భారత ప్రాంత అంతర్రాష్ట్ర అనుసంధానం రీత్యానూ ఖగారియా-పూర్ణియా విభాగం రహదారికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. దీని ఉన్నతీకరణ పూర్తయితే బీహారుకు పొరుగునగల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంతో రహదారి సంధానం బలోపేతం అవుతుంది. మరోవైపు విస్తృత జాతీయ రహదారి నెట్‌వర్క్ అందుబాటులోకి రావడం వల్ల జార్ఖండ్‌ రాష్ట్ర ప్రవేశ మార్గం కూడా మెరుగవుతుంది.

ట్రాఫిక్ గందరగోళం నుంచి విముక్తి

ఖగారియా-పూర్ణియా విభాగం రహదారి నవీకరణతో ఇతరత్రా ట్రాఫిక్‌ గందరగోళం నుంచి కూడా ప్రజలకు విముక్తి కల్పిస్తుంది. ఈ మేరకు ఖగారియా, భాగల్పూర్, కటీహార్, పూర్ణియా జిల్లాల్లో అధిక జనసాంద్రత గల పట్టణ-శివారు ప్రాంతాల రహదారి రూపురేఖలు మెరగవుతాయి. ప్రమాదకర మలుపులు, వాహన  రాకపోకల తీవ్ర రద్దీ వంటి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ప్రస్తుతం రెండు వరుసలకు పరిమితమైన ఈ కీలక మార్గం 4 వరుసలకు విస్తరిస్తుంది కాబట్టి, సీమాంచల్ ప్రాంత అనుసంధానం బలోపేతం కాగలదు. దీంతోపాటు ఖగారియా, భాగల్పూర్, కటీహార్, పూర్ణియా, పాట్నాలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలతో సంధానిస్తుంది.

కీలక ఆర్థిక-లాజిస్టిక్స్ కేంద్రాల అనుసంధానం

ఈ మార్గం ఉన్నతీకరణతో బీహార్‌లోని అనేక ప్రధాన ఆర్థిక-సామాజిక, లాజిస్టిక్స్ కూడళ్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. ఒక జౌళి పరిశ్రమల సముదాయం, రెండు మెగా ఫుడ్ పార్కులు, రెండు ఫిషింగ్-సీఫుడ్ పార్కులు సహా 5 పీఎం గతిశక్తి ఆర్థిక కేంద్రాలను, 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, ఒక విమానాశ్రయం, 4 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు 11 లాజిస్టిక్స్ కేంద్రాలను అనుసంధానిస్తుంది. తద్వారా ఈ ప్రాజెక్టుతో సీమాంచల్‌ ప్రాంతమంతటా బహుళ రవాణా ఏకీకరణ గణనీయంగా మెరుగవుతుంది.

 

***


(रिलीज़ आईडी: 2286425) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil