రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఒడిశా కొత్త తీరప్రాంత రహదారి... ఆధ్యాత్మిక, తీరప్రాంత పర్యాటకానికి ముఖద్వారం
प्रविष्टि तिथि:
19 JUL 2026 2:51PM by PIB Hyderabad
ఒడిశా తీరప్రాంతంలో రవాణా అనుసంధానాన్ని సమూలంగా మార్చనున్న 160.18 కిలోమీటర్ల పొడవైన 'రామేశ్వర్-పారాదీప్ తీరప్రాంత రహదారి' నిర్మాణంతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశం కలిగింది. రూ. 8,300.79 కోట్ల వ్యయంతో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఖుర్దా, పూరీ, కేంద్రపడ, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగే ఈ రహదారి... రాష్ట్రంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య సజావైన రవాణా అనుసంధానాన్ని కల్పిస్తుంది.
వేగవంతమైన, సురక్షితమైన, సజావైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్టులో భాగంగా రామేశ్వర్ నుంచి కోణార్క్ వరకు 4-వరుసల యాక్సెస్-నియంత్రిత జాతీయ రహదారి, కోణార్క్ నుంచి పారాదీప్ వరకు 2-వరుసల జాతీయ రహదారిని నిర్మిస్తారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుండే ఈ మార్గం అందుబాటులోకి వస్తే... రామేశ్వర్-పారాదీప్ మధ్య ప్రయాణ సమయాన్ని ఈ కారిడార్ దాదాపు 2 గంటల 30 నిమిషాలు తగ్గిస్తుంది. ప్రయాణికుల రవాణాతో పాటు ఇది సరుకు రవాణా కనెక్టివిటీనీ మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
ఒడిశా ఆధ్యాత్మిక వారసత్వ అనుసంధానం
ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వేగంగా చేరుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక రంగానికి ఈ కొత్త తీరప్రాంత రహదారి ఒక ప్రధాన చోదక శక్తిగా మారుతుంది.
ఈ కారిడార్ పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయం, చారిత్రక కోణార్క్ సూర్య దేవాలయం, పవిత్రమైన రామచండీ ఆలయం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతియేటా ఒడిశాకు వచ్చే లక్షలాది మంది భక్తుల తీర్థయాత్ర అనుభవాన్ని ఇది మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.
మెరుగైన రహదారి మౌలిక సదుపాయాలు ప్రయాణ సమయాన్ని తగ్గించడం సహా... పర్యాటకులు, భక్తుల కోసం సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ వారి మొత్తం యాత్ర అనుభవాన్నీ మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతంలో రాబోయే విమానాశ్రయ మౌలిక సదుపాయాలతో దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులు సులభంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుంటుంది. ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా ఒడిశా స్థానం మరింత మెరుగవుతుంది.
రవాణాకు అతీతంగా... చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో ప్రజలను అనుసంధానించడం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు, ప్రోత్సాహానికి ఆధునిక మౌలిక సదుపాయాలు ఎలా తోడ్పడగలవో ఈ రహదారి సూచిస్తుంది.
పూరీ నుంచి పారాదీప్ వరకు: ఒడిశా కొత్త పర్యాటక రహదారి
ఒడిశా తూర్పు తీరప్రాంతంలోని బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలు, జీవవైవిధ్య కేంద్రాలు, స్థానిక కమ్యూనిటీలను అనుసంధానిస్తూ... రామేశ్వర్–పారాదీప్ కారిడార్ కొత్త తీరప్రాంత పర్యాటకానికి ముఖద్వారంగా మారనుంది.
పూరీ, కోణార్క్, పారాదీప్ మధ్య అనుసంధానం మెరుగుపడటంతో, ఈ గమ్యస్థానాలు ఒక ఏకీకృత పర్యాటక సర్క్యూట్‌లో భాగంగా ఆవిర్భవిస్తాయి. ఇది ప్రయాణికులకు ఆధ్యాత్మిక వారసత్వం, ప్రాచీన వాస్తుశిల్పం, బీచ్‌లు, ప్రకృతి సంబంధ ప్రదేశాల వరకు సంపూర్ణ తీరప్రాంత సందర్శన అనుభవాన్ని అందిస్తుంది.
ఈ రహదారి సముద్ర తీర పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, ప్రకృతి ఆధారిత ప్రయాణాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలు, ప్రసిద్ధ గహిర్మాతా తాబేళ్ల గూళ్ల ప్రదేశాలు సహా ముఖ్యమైన పర్యావరణ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
మెరుగైన అనుసంధానం, ఒడిశాలోని విశిష్టమైన తీరప్రాంత జీవనవైవిధ్యం, పరిరక్షణ ప్రయత్నాలపై అవగాహనను పెంచడం ద్వారా సుస్థిర పర్యాటక పద్ధతులనూ ఇది ప్రోత్సహిస్తుంది. సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించే బాధ్యతాయుత పర్యాటక నమూనాలకు మద్దతునిస్తూనే, ఇక్కడి సహజ ప్రకృతి దృశ్యాలనూ సందర్శకులు వీక్షించవచ్చు.
స్థానిక ఆర్థిక వ్యవస్థ, తీరప్రాంత అభివృద్ధికి ఊతం
ఈ కొత్త రహదారి... ఈ మార్గంలోని హోటళ్లు, హోమ్‌స్టేలు, రెస్టారెంట్లు, హస్తకళల విపణులు, పర్యాటక ఆధారిత వ్యాపారాల వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తుంది.
పీఎం గతిశక్తి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా... ఈ ప్రాజెక్టు 9 ఆర్థిక కేంద్రాలను, 5 సరుకు రవాణా కేంద్రాలను అనుసంధానించడం ద్వారా ఒడిశా ఆర్థిక నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని కీలకమైన పారాదీప్ పోర్ట్, పూరీ రైల్వే స్టేషన్, పూరీ విమానాశ్రయం, ఇతర ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలు మరింత మెరుగ్గా అందుబాటులోకి ఉండేలా చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2286424)
आगंतुक पटल : 13