అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

విక్రమ్-1 విజయంతో ప్రపంచ స్థాయిలో బలమైన అంతరిక్ష శక్తిగా భారత్


ప్రధానమంత్రి శ్రీ మోదీ అంతరిక్ష రంగంలో చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలితమే ఈ మిషన్ విజయం

భారత్ కోసం ఇకమీదట ఆకాశం హద్దు కాదు

శ్రీహరికోట నుంచి విజయవంతంగా కక్ష్యలోకి... ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన భారత తొలి ఆర్బిటాల్ లాంచ్ వెహికల్

స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్‌లను అభినందించిన కేంద్ర మంత్రి

విక్రమ్-1 మిషన్ ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో భారత్ స్థానాన్ని బలపరుస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 18 JUL 2026 5:15PM by PIB Hyderabad

‘‘ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన భారత తొలి ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ అయిన విక్రమ్-1 ప్రయోగ విజయం... వేగంగా విస్తరిస్తున్న ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయిలో కీలకమైన శక్తిగా భారత్ ఆవిర్భవాన్ని సూచిస్తుంది. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చరిత్రాత్మక నిర్ణయం ద్వారా లభించిన గొప్ప ఫలితంగా ఇది నిలుస్తుంది’’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వేదికగా నిర్వహించిన 'మిషన్ ఆగమన్' ప్రయోగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వీక్షించారు. ఈ ప్రయోగంలో స్కైరూట్ ఏరోస్పేస్... విక్రమ్-1ను దాని నిర్దేశిత భూ సమీప కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తద్వారా భారత గడ్డపై నుంచి కక్ష్య ప్రయోగాన్ని సాధించిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. అంతరిక్ష శాఖ, ఇస్రో, ఇన్-స్పేస్ సహా దేశంలోని చురుకైన అంకుర సంస్థల వ్యవస్థల సమష్టి కృషితో సాధ్యమైన ఈ విజయం... దేశం అనుసరిస్తున్న ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా బలాన్ని ప్రదర్శిస్తుంది.

ఈ చరిత్రాత్మక విజయం సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. విస్తరిస్తున్న భారత అంతరిక్ష వ్యవస్థకు ఇది గర్వించదగిన విజయమని... మెరుగవుతున్న దేశ శాస్త్రీయ సామర్థ్యం, వ్యవస్థాపన స్ఫూర్తి, ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధికి ఇది నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులైన పవన్ కుమార్ చందన, భరత్ డాకాలను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకోకపోయి ఉంటే, దేశం ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించి ఉండేది కాదన్నారు. ఈ సంస్కరణలు భారతీయ ఆవిష్కర్తల అపార సామర్థ్యాన్ని వెలికితీశాయని, వారికి జాతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతికతలను ఇప్పుడు పూర్తిగా భారత్‌లోనే రూపొందించి, అభివృద్ధి చేసి, ప్రయోగించగల వ్యవస్థను సృష్టించాయని ఆయన అన్నారు.

భారత అంతరిక్ష వ్యవస్థను మార్చివేసే సజావైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని సృష్టించినందుకు ఐఎన్-స్పేస్, ఇస్రో, అంతరిక్ష విభాగాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. దూరదృష్టితో కూడిన విధాన రూపకల్పన, శాస్త్రీయ నైపుణ్యం, వ్యవస్థాపక ప్రతిభ కలిసి ప్రపంచంతో పోటీపడగల సాంకేతిక విజయాలను సాధించగల తీరును విక్రమ్-1 విజయం ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు.

స్కైరూట్ బృందంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ... తాను ఆ కంపెనీ వ్యవస్థాపకుల ప్రయాణాన్ని మొదటి నుంచీ నిశితంగా గమనించానని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వారి సాంకేతిక విశ్వాసం, సృజనాత్మకత, వినూత్న విధానాన్ని తాను ఎల్లప్పుడూ ప్రశంసించానని ఆయన అన్నారు. ప్రపంచంతో పోటీపడగల అంతరిక్ష సాంకేతికతలను నిర్మించాలనే భారత యువ పారిశ్రామికవేత్తల సంవత్సరాల తరబడి పట్టుదల, శాస్త్రీయ నైపుణ్యం, సంకల్పాల ఫలితమే నేటి విజయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

తొలి కక్ష్యా ప్రయోగంలో విక్రమ్-1 అసాధారణ స్థాయి సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం డమ్మీ ద్రవ్యరాశులను మాత్రమే మోసుకెళ్లే అనేక తొలి ప్రయోగాలకు భిన్నంగా, కక్ష్యలో అధునాతన సాంకేతికతలను ధ్రువీకరించడానికి రూపొందించిన ప్రయోగాత్మక పేలోడ్‌లను విక్రమ్-1 మోసుకెళ్లిందని తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా విక్రమ్-1 కస్టమర్ పేలోడ్‌లతో పాటు భారతీయ, అంతర్జాతీయ భాగస్వాముల సాంకేతిక నైపుణ్యాలనూ కక్ష్య వరకు తీసుకెళ్లిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది భారత వాణిజ్య ప్రయోగ సామర్థ్యాలపై ప్రపంచ అంతరిక్ష సమాజంలో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

2020లో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక సంస్కరణల తర్వాత భారత అంతరిక్ష వ్యవస్థ అద్భుతమైన పరివర్తనకు లోనైందని కేంద్ర మంత్రి అన్నారు. కొన్ని సంవత్సరాల కిందట వరకు దాదాపుగా ప్రైవేట్ ప్రయోగ వ్యవస్థే లేని దేశంలో, ప్రస్తుతం 400కు పైగా అంతరిక్ష రంగ అంకురసంస్థలు... మొదటి స్పేస్ యూనికార్న్‌... దాదాపు 9 బిలియన్ డాలర్ల అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాబోయే దశాబ్దంలో దీనిని దాదాపు 44 బిలియన్ డాలర్లకు విస్తరించాలనే దార్శనికతతో పురోగమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విధాన సంస్కరణలు ఆవిష్కరణలను ఎలా వేగవంతం చేయగలవో, ప్రపంచంతో పోటీపడగల సంస్థలను ఎలా సృష్టించగలవో, ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష దేశాల సరసన భారత్‌ను ఎలా నిలబెట్టగలవో విక్రమ్-1 విజయం నిరూపిస్తోందన్నారు.

పూర్తిగా భారత్‌లోనే నిర్మించి, అభివృద్ధి చేసిన విక్రమ్-1... 350 కిలోగ్రాముల వరకు బరువును భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన, దేశంలోనే ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన తొలి కక్ష్య ప్రయోగ వాహనం. సుమారు 22 మీటర్ల ఎత్తు ఉండే ఈ ప్రయోగ వాహనంలో అనేక స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలను పొందుపరిచారు. దేశపు తొలి పూర్తి కార్బన్ కాంపోజిట్ కక్ష్య రాకెట్, దాని ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్‌కు శక్తినిచ్చే 100 శాతం 3డీ-ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్, అధునాతన అల్ట్రా-లో-షాక్ న్యూమాటిక్ సెపరేషన్ సిస్టమ్స్, దేశంలోనే అత్యంత పొడవైన మోనోలిథిక్ కార్బన్-కాంపోజిట్ రాకెట్ దశల్లో ఒకటి వాటిలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రయోగ విజయం కీలకమైన ప్రొపల్షన్, ఏవియానిక్స్, టెలిమెట్రీ, నావిగేషన్, ఫ్లైట్-కంట్రోల్ సిస్టమ్‌లను ధ్రువీకరించింది. ఇది భారత్ నుంచి నిర్వహించే భవిష్యత్ వాణిజ్య కక్ష్య ప్రయోగ సేవలకు బలమైన పునాది వేసింది.

విక్రమ్-1 విజయం కేవలం ఒక మిషన్ విజయం కన్నా ఎంతో గొప్పదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సాహసోపేతమైన విధాన సంస్కరణలు, బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ సహకారంతో కూడిన భారతీయ ఆవిష్కరణలు... ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును మరింతగా మెరుగుపరిచే నవ శకానికి ఇది నాంది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో విశ్వసనీయమైన, నమ్మకమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భాగస్వామిగా భారత్ స్థానాన్ని ఈ మిషన్ మరింత బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు.

“భారత్ కోసం ఇకమీదట ఆకాశం హద్దు కాదు,” అని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 

 

***


(रिलीज़ आईडी: 2286142) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Tamil , Malayalam