ఉప రాష్ట్రపతి సచివాలయం
‘‘ఆర్ఎస్ఎస్ @ 100: సెంచరీ ఆఫ్ సర్వీస్, యూనిటీ అండ్ సాక్రిఫైస్’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
గత శతాబ్దంలో సేవ, ఐక్యత, జాతీయ చైతన్యం లాంటి ఆదర్శాలను ఆర్ఎస్ఎస్ బలోపేతం చేసింది: ఉపరాష్ట్రపతి
ఇతరుల సంక్షేమం కోసం ప్రవహించే పవిత్ర గంగా నది లాంటిందే సంఘ్: ఉపరాష్ట్రపతి
స్వయంసేవక్ నుంచి ప్రధాన సేవక్ వరకు… ‘సేవ’, ‘దేశమే ప్రథమం’ అనే భావాలను పరిపాలనా కేంద్రంగా మార్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ: ఉపరాష్ట్రపతి
నిస్వార్థ సేవ, దేశ నిర్మాణం ద్వారా తరతరాలకు స్ఫూర్తినిచ్చిన సంఘ్: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
17 JUL 2026 6:58PM by PIB Hyderabad
శ్రీ శ్యామ్ జాజు, శ్రీ అనుపమ్ త్రివేది రచించిన ‘‘ఆర్ఎస్ఎస్@100: సెంచరీ ఆఫ్ సర్వీస్, యూనిటీ అండ్ సాక్రిఫైస్” అనే పుస్తకాన్ని ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. తనకు సుదీర్ఘ అనుబంధం ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన పుస్తకావిష్కరణలో పాల్గొనడం వ్యక్తిగతంగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని ఉపరాష్ట్రపతి అన్నారు. సంఘ్ గురించి రాసిన ఒక తమిళ కవితను ప్రస్తావించారు. ఆ కవితలో ఇతరుల సంక్షేమం కోసం నిస్వార్థంగా ప్రవహించే పవిత్ర గంగానదితో సంఘ్‌ను పోల్చారని చెప్పారు. ఈ పోలిక శతాబ్ద కాలంగా సంఘ్‌ను నడిపించిన సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన అన్నారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అద్భుతంగా వివరించిన రచయితలను శ్రీ రాధాకృష్ణన్ అభినందించారు. భారతదేశ సంప్రదాయ మూలాలను, వారసత్వాన్ని, సంప్రదాయాలను పునరుద్ధరించడం, బలోపేతం చేయడం, పునర్నిర్మించడం సంఘ్ ప్రస్థానంలో భాగమని ఆయన అన్నారు. పుస్తకం శీర్షిక ‘‘సర్వీస్, యూనిటీ అండ్ సాక్రిఫైస్’’ గురించి ప్రస్తావిస్తూ… అనేక తరాలకు చెందిన కార్యకర్తలకు ఈ ఆదర్శాలు స్ఫూర్తినిచ్చాయని తెలియజేశారు. సేవ - సమాజం పట్ల నిస్వార్థమైన అంకితభావాన్ని సూచిస్తుందని తెలిపారు. ఐక్యత - భారతదేశ భాషా సాంస్కృతిక వైవిధ్యాలను దాటి బంధాలను బలోపేతం చేస్తుందన్నారు. త్యాగం - నిబద్ధత, పట్టుదల, నిస్వార్థమైన ప్రయత్నం ద్వారానే సుస్థిరమైన సంస్థలు ఆవిర్భవిస్తాయని తెలియజేస్తుందని వివరించారు.
రోజువారీ శాఖ నిర్వహణ ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం, నాయకత్వ అభివృద్ధికి ఆర్ఎస్ఎస్ ఇచ్చే ప్రాధాన్యాన్ని ఉపరాష్ట్రపతి వివరించారు. పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ… ‘‘యువతలో ఉన్న శక్తిని జాతీయ భావంగా తీర్చిదిద్దే ఆత్మ కార్యశాల’’గా శాఖను ఆయన వర్ణించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అంకితభావంతో, నైపుణ్యంతో పూర్తి చేస్తూ.. దాని విలువను పెంచడమే స్వయంసేవక్ బాధ్యత అని ఆయన చెప్పారు.
భారతదేశ నాగరిక వారసత్వం, వైవిధ్యమైన సంప్రదాయాలు, భాషలు, ఆధ్యాత్మిక భావాల పట్ల గర్వాన్ని పెంపొందించడం ద్వారా సాంస్కృతిక కొనసాగింపును, జాతీయ స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్ స్థిరంగా ప్రోత్సహిస్తోందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. లక్షలాది మంది కార్యకర్తల అంకితభావాన్ని గుర్తించే సందర్భమే ఈ శతాబ్ది ఉత్సవాలని ఆయన చెప్పారు. స్వప్రయోజనాలకు అతీతంగా గొప్ప ఆశయాల సాధనకు దృఢ విశ్వాసం, అంకితభావంతో పనిచేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడే సంస్థలు మనుగడ సాగిస్తాయన్నారు.
‘‘ఏ స్వయంసేవక్ యాజ్ పీఎం: ది మోదీ ఎరా’’ అనే అధ్యాయం గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. స్వయంసేవక్ నుంచి ప్రధాన సేవక్ వరకు సాగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్థానం గురించి ఈ పుస్తకం వివరిస్తుందని అన్నారు. ఆయన సేవ, ‘‘రాష్ట్ర ప్రథమ్’’ (దేశమే ప్రథమం) అనే సూత్రాలను పరిపాలనకు కేంద్రంగా ప్రధానమంత్రి ఉంచారని, ఇది నిస్వార్థ సేవకు, దేశ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ ఇచ్చే ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుందని వివరించారు.
కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్‌తో తన సంభాషణను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవంలో క్షేత్రస్థాయి కార్యకర్తలుగా తమ ప్రజా జీవితం ప్రారంభమైందని చెప్పారు. చిన్న ప్రవాహంగా మొదలై పెద్ద నదిగా మారే గంగ మాదిరిగానే.. ఆర్ఎస్ఎస్ కూడా సాధారణ స్థాయి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, ఢిల్లీ శాసనసభ స్పీకర్ శ్రీ విజేందర్ గుప్తా, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అధ్యక్షులు శ్రీ రామ్ బహదూర్ రాయ్, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సంఘ్‌చాలక్ పవన్ జిందాల్, పుస్తక రచయితలు శ్రీ శ్యామ్ జాజు, శ్రీ అనుపమ్ త్రివేది, ప్రభాత్ ప్రకాశ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రభాత్ కుమార్, తదితర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2286111)
आगंतुक पटल : 20