కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ మంత్రులతో కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ద్వైపాక్షిక సమావేశాలు
కార్మిక రంగం, నైపుణ్య రంగం, డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు సేవలు.. ఈరంగాల్లో
సహకారాన్ని పెంచుకోవాలంటూ మంత్రి పిలుపు
प्रविष्टि तिथि:
15 JUL 2026 8:57PM by PIB Hyderabad
బ్రిక్స్ కార్మిక, ఉపాధికల్పన మంత్రుల 12వ సమావేశాన్ని హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించారు. బ్రిక్స్‌కు ఈ సంవత్సరం భారత్ అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రులు, బ్రిక్స్ దేశాల ప్రతినిధివర్గాల సారథులు, యాజమాన్య సంస్థలు, కార్మిక సంస్థల ప్రతినిధులతో పాటు జ్ఞాన మార్పిడి ప్రక్రియలో పాలుపంచుకుంటున్న భాగస్వామ్య వర్గాలు కూడా పాల్గొన్నాయి. కార్మిక రంగ భవిష్యత్తు రూపురేఖలను నిర్దేశించే కీలక కార్మిక, ఉపాధికల్పన, సామాజిక భద్రత సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశం ముగిసిన తరువాత ఇండొనేషియా, ఇరాన్, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రులతోనూ, అంతర్జాతీయ సామాజిక భద్రత సంఘం (ఐఎస్ఎస్ఏ) ప్రతినిధులతోనూ కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు.
కార్మిక మార్కెట్లను మరింత సమ్మిళితంగా, సమర్థంగా తీర్చిదిద్దడానికి డిజిటల్ వనరులను సద్వినియోగపరుచుకోవడం అనే అంశంపై నేతలు చర్చించారు. భారత్ ఈ-శ్రమ్, నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) వంటి వెబ్‌సైట్లతో డిజిటల్ రంగంలో ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రధానంగా ప్రస్తావించింది. ఇవి ప్రజల ప్రయోజనాలను సంరక్షించడం, ఉద్యోగకల్పనకు సంబంధించిన సేవలను అందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల రాకపోకలను ప్రోత్సహిస్తున్నాయని వివరించింది. చర్చలలో ప్రధానంగా నైపుణ్య సాధననూ, కార్మికులకు సంబంధించిన వివిధ పథకాలనూ, డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలనూ విస్తరించడానికి ‘బ్రిక్స్ కనెక్ట్’ కార్యక్రమంతో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పటిష్టపరుచుకోవాలనే అంశాలను ప్రస్తావించారు.
యూఏఈ మానవ వనరులు, ఎమిరేటీకరణ శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ మాట్లాడుతూ, ‘‘కార్మికుల రాకపోకలను బలోపేతం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో భారత్ సాధించిన ప్రగతి, ఈ రంగంలో భవిష్యత్తులో సహకరించుకోవడానికి ఉన్న అవకాశాలపై ముఖ్యంగా చర్చించాం’’ అన్నారు. ‘‘వృత్తులకు సంబంధించిన అంతర్జాతీయ సూచనల వర్గీకరణను రూపొందించేందుకు భారత్, ఐఎల్ఓలు ప్రస్తుతం నిర్వహిస్తున్న సాధ్యాసాధ్యాల అధ్యయనంలో పాలుపంచుకోవాల్సిందిగా యూఏఈని కూడా ఆహ్వానించారు’’ అని ఆయన అన్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో సందర్భశుద్ధి కలిగిన వృత్తుల వర్గీకరణ ప్రాథమిక ప్రణాళికను రూపొందించడానికి కలిసికట్టుగా పనిచేయడం ఎంతైనా ముఖ్యం’’ అని కూడా ఆయన అన్నారు.

‘‘మరిన్ని విధాన ప్రధాన చర్చలు, నైపుణ్యాభివృద్ధిలో సహకారం, కార్మిక రంగ పరిపాలన కోసం డిజిటల్ సేవల వినియోగం వంటి పద్ధతుల్లో ఉద్యోగకల్పన, సామాజిక పరిరక్షణ రంగాల్లో భారత్, రష్యా భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై సమావేశంలో మాట్లాడుకున్నాం’’ అని రష్యా కార్మిక, సామాజిక పరిరక్షణ శాఖ మంత్రి శ్రీ ఎంటోన్ కొత్యకొవ్ అన్నారు. ‘‘వృత్తులకు సంబంధించిన అంతర్జాతీయ సూచనల వర్గీకరణను రూపొందించేందుకు భారత్, ఐఎల్ఓలు ప్రస్తుతం నిర్వహిస్తున్న సాధ్యాసాధ్యాల అధ్యయనంలో భాగం పంచుకోవాల్సిందిగా రష్యాను ఆహ్వానించారు’’ అని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య సామాజిక భద్రత ఒప్పందం (ఎస్ఎస్ఏ)ను కుదుర్చుకొనేందుకు అవకాశం ఉందేమో పరిశీలించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది’’ అని శ్రీ కొత్యకొవ్ అన్నారు.

ఇండొనేషియా సిబ్బంది శాఖ మంత్రి శ్రీ యాస్సియరలీ మాట్లాడుతూ, ‘‘సమావేశం ఉద్యోగకల్పన, సిబ్బందికి శిక్షణనివ్వడం, డీపీఐ రంగాల్లో భారత్, ఇండొనేషియయా సహకారాన్ని విస్తరించుకొనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించాం’’ అని పేర్కొన్నారు. ‘‘డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించి ప్రజలకు అందించే సేవల పరిధిని పెంచుకోవడంలో సంపాదించిన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధమంటూ భారత్ ముందుకు వచ్చింది. మా కార్మిక సంబంధిత, ఉద్యోగకల్పన సంబంధిత సేవలను బలోపేతం చేయడానికి డిజిటల్ సాంకేతికతలను ఇండొనేషియా ఉపయోగించుకొనేలా సహకరిస్తామంటూ కూడా భారత్ సుముఖతను వ్యక్తం చేసింది’’ అని ఆయన అన్నారు.

ఇరాన్ సహకార సంఘాలు, కార్మిక, సమాజ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ మేదారీ మాట్లాడుతూ, ‘‘ఈ సమావేశంలో ఉద్యోగకల్పన, కార్మిక పరిపాలన, డిజిటల్ పరివర్తన రంగాల్లో భారత్, ఇరాన్ సహకారాన్ని విస్తరించుకోవడానికి ఉన్న అవకాశాలను సమీక్షించారు. డీపీఐని తీర్చిదిద్దడంలో తనకున్న అనుభవాన్ని భారత్ పంచుకుంది. కార్మిక, ఉద్యోగకల్పన సంబంధిత సేవలను పటిష్ఠపరచడానికి సాంకేతికత ఆధారిత సేవలను ప్రవేశపెట్టుకోవడంలో ఇరాన్‌కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా భారత్ తెలిపింది’’ అని పేర్కొన్నారు.

ఐఎస్ఎస్ఏకు చెందిన డాక్టర్ మొహమ్మద్ అజ్మాన్ మాట్లాడుతూ, ‘‘చర్చల్లో సామాజిక భద్రత వ్యవస్థలను ముందుకు తీసుకు పోవడానికీ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ పద్ధతులను మార్పిడి చేసుకోవడాన్ని ప్రోత్సహించడానికీ భారత్, ఐఎస్ఎఏ మధ్య సహకారాన్ని పటిష్ఠపరిచే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. 2025లో సామాజిక భద్రత పరిధిని విస్తరించడంలో భారత్ ఘన విజయాలకు గుర్తింపుగా ఐఎస్ఎస్ఏ పురస్కారాన్ని అందించిన విషయాన్ని గౌరవ మంత్రి ప్రస్తావించారు. భారత్ అందిస్తున్న సామాజిక భద్రత ప్రయోజనాల పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య 2026లో 100 కోట్లను మించింది. అందరికీ సామాజిక భద్రతను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది’’ అన్నారు.

మొత్తంమీద, ఈ ద్వైపాక్షిక సమావేశాలూ, చర్చలూ ఆచరణపూర్వక సహకారం, అత్యుత్తమ పద్ధతుల మార్పిడి, సమ్మిళిత, దృఢతర, భవిష్యత్ అవసరాలను తీర్చడానికి సన్నద్ధంగా ఉండేలా కార్మిక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికగా బ్రిక్స్ కనెక్ట్‌ను చూస్తూ, ‘బ్రిక్స్ కనెక్ట్’కు విస్తృత మద్దతును అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి.
కేంద్ర కార్మిక, ఉద్యోగకల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాల్లో ఈ కింది అంశాలు ప్రస్తావనకు వచ్చాయి:
బ్రెజిల్ కార్మిక, ఉద్యోగకల్పన ఉప మంత్రి శ్రీ ఫ్రాన్సిస్కో మాసెన డ సిల్వ మాట్లాడుతూ ‘‘నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఉద్యోగకల్పన సేవలు, కార్మిక మార్కెట్టుకు సంబంధించిన సమాచార వ్యవస్థలు, సామాజిక భద్రత రంగాల్లో సహకరించుకోవడం ద్వారా భారత్, బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు ప్రధానంగా దృష్టి పెట్టాయి’’ అన్నారు. ‘‘వృత్తులకు సంబంధించిన అంతర్జాతీయ సూచనల వర్గీకరణను రూపొందించేందుకు భారత్, ఐఎల్ఓలు ప్రస్తుతం నిర్వహిస్తున్న సాధ్యాసాధ్యాల అధ్యయనంలో బ్రెజిల్ భాగం పంచుకోవడాన్ని ప్రశంసించారు’’ అని ఆయన అన్నారు. ‘‘జ్ఞానాన్ని పంచుకోవడం, సామర్థ్యాలను పెంచుకోవడం.. ఈ రెండు విధాలుగానూ ‘బ్రిక్స్ కనెక్ట్’ పురోగతికి తోడ్పడాలన్న ఆసక్తిని ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి’’ అని కూడా శ్రీ సిల్వ అన్నారు.
చైనా మానవ వనరులు, సామాజిక భద్రత శాఖ ఉప మంత్రి శ్రీ యూ జియాడోంగ్ మాట్లాడుతూ, ‘‘రాబోయే కాలానికి అవసరపడే నైపుణ్యాలు, డిజిటల్ ఉపాధికల్పన సేవలు, కార్మిక రంగ పరిపాలన, సామాజిక భద్రత రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా చర్చించారు’’ అన్నారు. ‘‘మహిళా సిబ్బంది భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే, కార్మిక రంగంలో డిజిటల్ సేవలను పెంచే దిశగా భారత్ అమలుచేస్తున్న కార్యక్రమాలకు ప్రశంసలు లభించాయి. ‘బ్రిక్స్ కనెక్ట్’ పురోగతికి తోడ్పడడంతో పాటు సమ్మిళిత, భవిష్యత్ అవసరాలను తీర్చడానికి సన్నద్ధంగా ఉండేలా కార్మిక రంగాన్ని ప్రోత్సహించాలన్న ఆసక్తిని ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి.
తీర్మానాన్ని విజయవంతంగా ఆమోదించడంతో పాటు ‘బ్రిక్స్ కనెక్ట్’ను ప్రారంభించి కార్మిక రంగం, ఉద్యోగకల్పన రంగాల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగును వేశారు. సామాజిక న్యాయాన్నీ, గౌరవపూర్వక ఉపాధికల్పననీ, నూతన ఆవిష్కరణల్నీ, దృఢత్వాన్నీ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడాన్నీ ప్రోత్సహించే దిశగా కలిసికట్టుగా కృషి చేయాలన్న ఉమ్మడి సంకల్పంతో సమావేశాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2285413)
आगंतुक पटल : 9