రక్షణ మంత్రిత్వ శాఖ
భవిష్యత్తులో జరిగే సాంకేతిక యుద్దాల్లో సరిహద్దు మౌలిక సదుపాయాలే అత్యంత కీలకం: బీఆర్‌ఓ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల సదస్సులో రక్షణ మంత్రి
“ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణానికి, జాతీయ భద్రత బలోపేతానికి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్న బీఆర్‌ఓ
‘‘నాగరికత అభివృద్ధికి అనుసంధానమే కీలక అంశం, మారుమూల ప్రాంతాల ప్రజలెవరూ ప్రధాన స్రవంతికి దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు’’
‘‘భవిష్యత్తు అవసరాలకు తగ్గ వ్యూహాత్మక మౌలిక వసతుల నిర్మాణానికి ఆవిష్కరణలు, పరిశోధనలు, అద్భుతమైన పనితీరే అత్యంత కీలకం’’
प्रविष्टि तिथि:
16 JUL 2026 1:26PM by PIB Hyderabad
‘‘యుద్ధ స్వభావంలో వస్తున్న మార్పుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ దళాల్లోకి అత్యాధునిక ఆయుధాలు, అధునాతన వేదికలను ప్రవేశపెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, టన్నెల్స్ అత్యంత కీలక పాత్రను పోషిస్తూనే ఉంటాయి’’ అని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2026 జూలై 16న న్యూఢిల్లీలో జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (సరిహద్దు రహదారుల సంస్థ-బీఆర్ఓ) వ్యూహాత్మక మౌలిక వసతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ ఫలితాన్ని సైనిక పరాక్రమం, ఖచ్చితత్వ సామర్థ్యాలు, ఆధునిక సాంకేతికతలు నిర్ణయించినప్పటికీ, సైనిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలే కీలకమని పేర్కొన్నారు.
‘‘కొన్నిసార్లు యుద్ధం సరిహద్దు వద్దనే నేరుగా జరగకపోవచ్చు. సైనికులను తీసుకెళ్లే రహదారిపై కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఆ రహదారిని నిర్మించే వ్యక్తి కూడా సరిహద్దులో నిలిచే సైనికుడితో సమానంగా జాతీయ భద్రతను కాపాడే అత్యంత కీలకమైన సంరక్షకుడు’’ అని రక్షణశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. పటిష్టమైన మౌలిక సదుపాయాల స్థాపనకు బీఆర్ఓ అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడాన్ని ఆయన అభినందించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల నిర్మాణం, జాతీయ భద్రత నిరంతర బలోపేతం, 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సంకల్పాన్ని బీఆర్ఓ ముందుకు తీసుకెళ్తోందని ప్రశంసించారు.
గడిచిన ఆరున్నర దశాబ్దాలుగా బీఆర్ఓ కేవలం రహదారుల నిర్మాణ సంస్థ స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన వ్యూహాత్మక మౌలిక వసతుల సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని రక్షణశాఖ మంత్రి కొనియాడారు. అటల్ టన్నెల్, ఉమ్లింగ్ లా పాస్, సెలా టన్నెల్ వంటి అద్భుత విజయాలు బీఆర్ఓ సామర్థ్యానికి, కఠోర శ్రమకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. దేశ సేవ పట్ల అంకితభావం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఏ సవాలునైనా అధిగమించవచ్చని ఈ సంస్థ సిబ్బంది పదేపదే నిరూపించారని తెలిపారు.
ఆధునిక సాంకేతికతలను అవలంబించడంలో బీఆర్ఓ అగ్రగామి సంస్థగా నిలిచిందని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నగరాల్లో మెట్రో నిర్మాణం నుంచి పర్వత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి వరకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ‘సొరంగాల సాంకేతికత’ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన భూభాగాల్లో బీఆర్ఓ రోడ్లు, రహదారులను నిర్మిస్తున్న వేగం అసాధారణమైనదని తెలిపారు. ఇది మానవ సంకల్పం, ఆధునిక సాంకేతికతల సమష్టి బలానికి నిదర్శనమని అన్నారు.
నాగరికత అభివృద్ధికి ‘అనుసంధానం’ అత్యంత ముఖ్యమైన అంశమని రక్షణ మంత్రి అభివర్ణించారు. రహదారులు, రైలు, వైమానిక, డిజిటల్ మౌలిక వసతుల ద్వారా అన్ని రకాల అనుసంధానాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మౌలిక వసతులపై పెట్టిన శ్రద్ధ దేశ సామర్థ్యాలకు, అవసరాలకు తగినట్లుగా లేదు.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఏ పౌరుడూ తాము అభివృద్ధికి దూరమయ్యామనే భావనకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒకప్పుడు చివరి గ్రామాలుగా పిలిచే సరిహద్దు గ్రామాలను ‘వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్’ కింద దేశంలోనే మొదటి గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నాం. బలమైన మౌలిక వసతులు ఉన్న దేశానికే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నేడు మనం నిర్మిస్తున్న మౌలిక వసతులే రాబోయే ఒకటి, రెండు శతాబ్దాల పాటు మన నాగరికతను నిర్వచిస్తాయి’’ అని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అదొక సమష్టి కృషి అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి పరిశ్రమలు, పరిశోధనల్లో ముందుకు సాగడానికి విద్యాసంస్థలు, నూతన పరిష్కారాలను కనుగొనడానికి ఇంజనీర్లు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పరిపాలనాధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రతీ భాగస్వామి అత్యంత అంకితభావంతో తమ పాత్రను పోషిస్తూ, అత్యుత్తమ పనితీరును ప్రోత్సహించే ఒక అద్భుతమైన వ్యవస్థను మనమందరం కలిసి నిర్మించాల్సి ఉంది’’ ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సరిహద్దు రహదారుల సంస్థ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ మాట్లాడుతూ... వ్యూహాత్మక సామర్థ్యానికి కొలమానం ఇకపై మనం దేన్ని నిర్మిస్తున్నామనే దానిపైనే కాకుండా ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాం, ఎంత వేగంగా అమలు చేస్తున్నాం, ఎంత సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నాం, ఎంత సుస్థిరంగా మౌలిక వసతులను నిర్వహిస్తున్నామనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్థాగత సంస్కరణల ఆధారంగా బీఆర్ఓ ఒక సరికొత్త పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపారు. స్థితిస్థాపకత కలిగిన, భవిష్యత్తు అవసరాలకు తగిన వ్యూహాత్మక మౌలిక వసతులను నిర్మించడానికి డిజిటల్ ప్రణాళిక, కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు, ఆధునిక నిర్మాణ పద్ధతులు, యాంత్రీకరణ, పరిశ్రమలు, విద్యాసంస్థలతో బలమైన భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధిలో అద్భుతమైన పనితీరు, ప్రతిభ కనబరిచిన వివిధ బీఆర్ఓ ప్రాజెక్టులకు రక్షణశాఖ మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. బీఆర్ఓ డిజిటల్ పరివర్తన, సంస్థాగత ఆధునికీకరణలోమరో కీలక అడుగు వేస్తూ ప్రాజెక్టు నిర్వహణ, నియామకాల కోసం రూపొందించిన రెండు సరికొత్త డిజిటల్ వేదికలను ఆయన ప్రారంభించారు.
సంస్థ సాధించిన విజయాలు, ఇంజనీరింగ్ ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు, భవిష్యత్తు దార్శనికతను పొందుపరిచిన ‘పథ్ ప్రదర్శక్’, ‘ఊంచీ సద్కెన్’, ‘పథ్ వికాస్’ అనే మూడు ప్రతిష్ఠాత్మక బీఆర్ఓ ప్రచురణలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. బీఆర్ఓ కర్మయోగుల అచంచలమైన స్ఫూర్తికి, నిరంతర అంకితభావానికి, నిస్వార్థ సేవకు నివాళిగా ఈ కార్యక్రమంలో బీఆర్ఓ అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరించారు.
జూలై 15, 2026న ప్రారంభమైన ఈ రెండు రోజుల సదస్సు.. దేశ సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి అద్భుతమైన వేదికగా నిలిచింది. ఉత్పాదకతను పెంచేందుకు వీలుగా సరికొత్త సాంకేతికతలు, వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలు, ప్రణాళికా రచనలో డిజిటల్ పరివర్తన, ప్రాజెక్టుల పర్యవేక్షణ, అమలు, సుస్థిర నిర్మాణ పద్ధతులు, ఉత్తమ పద్ధతులపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ సైనిక నాయకత్వం, విధాన రూపకర్తలు, మౌలిక వసతుల నిపుణులు, బీఆర్ఓ అధికారులు, పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక భాగస్వాములు ఈ వేదికపైకి చేరి, వ్యూహాత్మక మౌలిక వసతుల అభివృద్ధి భవిష్యత్తుపై సమష్టిగా చర్చించారు.
వ్యూహాత్మక మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళిక, రూపకల్పన నుంచి అమలు, పర్యవేక్షణ, భవిష్యత్తు సాంకేతికతలను అవలంబించడం వరకు ప్రతీ దశను చేరుస్తూ విభిన్న నేపథ్య ఆధారిత సమావేశాలుగా ఈ సదస్సును నిర్వహించారు. భవిష్యత్తు వ్యూహాత్మక మౌలిక వసతుల అభివృద్ధికి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో.. ‘‘సాంకేతికత, ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరు ద్వారా సామర్ధ్యం పెంపు’ ఇతివృత్తంతో ప్రతి సమావేశంలోనూ విస్తృత చర్చలు జరిగాయి. భవిష్యత్తు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను కేవలం కఠోర శ్రమతోనే కాకుండా, సాంకేతికత, ఆవిష్కరణలు, అత్యుత్తమ అమలు ద్వారా మరింత తెలివిగా పని చేయడం వల్లే సాధ్యమవుతాయని ఈ చర్చలు నిరూపించాయి.
ఈ సదస్సులో భాగంగా ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థలు, పరికరాల తయారీదారులు, విద్యాసంస్థలు, సాంకేతిక భాగస్వాములతో కూడిన ప్రత్యేక పరిశ్రమల ముఖాముఖి సమావేశాన్ని కూడా నిర్వహించారు. వ్యూహాత్మక మౌలిక వసతుల నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలను, అధునాతన పరికరాలను, సరికొత్త సాంకేతికతలను ప్రతినిధులు ప్రదర్శించారు. ముఖ్యంగా బీఆర్ఓ పని చేసే ప్రత్యేకమైన కార్యాచరణ వాతావరణానికి సరిపోయే సరికొత్త పరిష్కారాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
***
(रिलीज़ आईडी: 2285411)
आगंतुक पटल : 7