రైల్వే మంత్రిత్వ శాఖ
ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి రానున్న కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ బీటా వెర్షన్
प्रविष्टि तिथि:
15 JUL 2026 7:34PM by PIB Hyderabad
వినియోగదారుల అభిప్రాయాలను సేకరించేందుకు సరికొత్త అవతారంలో ఉన్న కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ బీటా వెర్షన్ ఈ రోజు రాత్రి 21:00 గంటలకు అందుబాటులోకి రానుంది. దీనిని https://www.irctc.co.in/eticket/ అనే లింక్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఈ బీటా వెర్షన్‌కు సంబంధించిన లింక్ ప్రస్తుత వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కూడా అందుబాటులో ఉంది.
గౌరవ రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌తో జరిపిన సంభాషణలో భాగంగా మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ) విద్యార్థులు ఈ మెరుగుదలలను, మార్పులను సూచించారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మొదటిసారిగా 2002లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది రోజుకు సగటున దాదాపు 14.5 లక్షల టిక్కెట్లను నిర్వహిస్తోంది. కొత్త వెబ్‌సైట్ స్పష్టమైన యూజర్ ఇంటర్‌ఫేస్, సరళీకృత వినియోగదారు అనుభవాన్ని కలిగి ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ ఈ బీటా వెర్షన్‌లో నాలుగు ప్రధాన మెరుగైన మార్పులు చేసింది:
-
క్యాప్చా: అనవసరమైన క్యాప్చాలు, పాప్ అప్‌లు.. ఫ్లాషింగ్ గ్రాఫిక్స్, దృష్టిని మరల్చే అంశాలు ఏవీ ఉండవు.
-
సీట్ల లభ్యత: అన్ని తరగతుల సీట్ల లభ్యత స్పష్టంగా కనిపిస్తుంది.
-
వేగవంతమైన చెకౌట్: టికెట్ బుకింగ్ కోసం అవసరమయ్యే దశల సంఖ్య తగ్గింది.
-
సులభమైన రిపీట్ బుకింగ్: ప్రయాణికుల వివరాలు ముందే సేవ్ అయి ఉంటాయి.
వెబ్‌సైట్‌కు సరికొత్త రూపురేఖలు ఇచ్చారు. మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన డిజైన్ ప్రక్రియలో సూచనలు ఇచ్చేందుకు విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. వారి నుంచి అందిన అభిప్రాయాల ఆధారంగా కొత్త వెబ్‌సైట్ ఇప్పుడు పరిశీలనకు సిద్ధంగా ఉంది.
ఈ బీటా వెర్షన్ తదుపరి మెరుగుదలలపై వినియోగదారుల అభిప్రాయాలను సేకరించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వినియోగదారు సంతృప్తిని పెంపొందించడానికి భవిష్యత్ వెర్షన్లలో వాటిని చేర్చనున్నారు. అతి త్వరలోనే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ రాబోయే కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో కూడా అనుసంధానమవుతుంది. దీనికి సమాంతరంగా ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌ను కూడా ఆధునికీకరిస్తున్నందున పూర్తి స్థాయిలో పనిచేసే కొత్త ఐఆర్‌సీటీసీ పోర్టల్ మరికొద్ది వారాల్లో అందుబాటులోకి రానుంది.
వివిధ రైలు బుకింగ్ యాప్‌లు ఉపయోగించే దశాబ్దాల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌ను కూడా ఐఆర్‌సీటీసీ ఆధునికీకరిస్తోంది. ఈ ఆధునికీకరణ ప్రక్రియ జరుగుతున్నంత కాలం వ్యవస్థ నిరంతరాయంగా పనిచేయాల్సి ఉన్నందున దీని కోసం విస్తృతంగా పనిచేయాల్సి వచ్చింది. ఈ కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్ అతి త్వరలోనే ప్రారంభంకానుంది.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరచడంలో సహాయపడేలా ఈ కొత్త డిజైన్‌పై తమ విలువైన సూచనలు, అభిప్రాయాలను అందించాల్సిందిగా వినియోగదారులను కోరుతున్నాం.
***
(रिलीज़ आईडी: 2285246)
आगंतुक पटल : 34