కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఏ ఒక్క కార్మికుడు వెనుకబడిపోకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నాం: హైదరాబాద్‌లో జరిగిన 12వ బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశంలో డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థ ఇప్పుడు 100 కోట్ల మందికి రక్షణ కల్పిస్తోంది: అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) డైరెక్టర్ జనరల్
కార్మిక, ఉపాధి రంగాలపై చారిత్రాత్మక ప్రకటనను ఆమోదించిన బ్రిక్స్ దేశాలు
బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతిక సహకారం, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపొందింపును బలోపేతం చేయడం కోసం 'బ్రిక్స్ కనెక్ట్'ను ఆవిష్కరించిన భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశ అధ్యక్షతన 'ప్రజా కేంద్రక' విధానం, 'మానవత్వమే ప్రథమం' అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోన్న బ్రిక్స్: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
గ్లోబల్ సౌత్ దేశాలు ఆచరణాత్మకమైన, సమగ్రమైన, ప్రజా కేంద్రకమైన పరిష్కారాలను రూపొందించుకోవడానికి బ్రిక్స్ వేదిక ఒక విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుంది: కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
प्रविष्टि तिथि:
15 JUL 2026 5:29PM by PIB Hyderabad
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోన్న భారత్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. భవిష్యత్తు కార్మిక రంగాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు, వివిధ ప్రతినిధులు, కార్మిక- యజమానుల సంఘాలు, విజ్ఞాన భాగస్వాములు ఈ సమావేశంలో ఒక చోటికి చేరారు.
భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సమావేశం ‘దృఢత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం తయారీ’ ఇతివృత్తంతో జరిగింది. సామాజిక భద్రత, కార్మిక మార్కెట్ క్రమబద్ధీకరణ, ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, సమగ్రమైన- దృఢత్వం కలిగిన కార్మిక మార్కెట్ల కోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి రంగాల్లో ఉమ్మడి చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
I. కీలకోపన్యాసం
ఏ. ప్రజా కేంద్రక అధ్యక్షత
హైదరాబాద్‌కు విచ్చేసిన వివిధ ప్రతినిధి బృందాలకు స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ కీలకోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత మార్గదర్శకత్వంలో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్.. 'ప్రజా కేంద్రక' విధానం, 'మానవత్వమే ప్రథమం' అనే స్ఫూర్తితో సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
భారత్ సాధించిన సంస్కరణల ప్రస్థానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పాతబడిపోయిన 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి 2025 నవంబర్‌లో నాలుగు ఆధునిక కార్మిక కోడ్‌లుగా రూపొందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారతదేశంలోని 140 కోట్ల ప్రజల కోసం కార్మిక కేంద్రక వ్యవస్థను సృష్టించిన ఒక మైలురాయి లాంటి చారిత్రాత్మక సంస్కరణగా దీనిని ఆయన అభివర్ణించారు.
నమోదైన 31.7 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు, డూప్లికేషన్ నివారణ, సంక్షేమ ప్రయోజనాలు సజావుగా అందేలా 'ఈ-శ్రమ్' పోర్టల్ దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. 'నేషనల్ కెరీర్ సర్వీస్' (ఎన్‌సీఎస్) పోర్టల్.. ఉద్యోగాల ఎంపిక, నైపుణ్యాల గుర్తింపు, కౌన్సెలింగ్‌లను ఏకీకృతం చేస్తుందని ఆయన చెప్పారు. భారతదేశపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సౌలభ్యవంతమైన రూపకల్పన వల్ల ప్లాట్‌ఫామ్ కార్మికులు వంటి కొత్త శ్రేణి కార్మికులకు కూడా సేవలను వేగంగా విస్తరించడానికి వీలు కలుగుతోందని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మారిషస్ వంటి భాగస్వామ్య దేశాలతో కూడా భారత్ పంచుకుందని ఆయన అన్నారు.
భారత్‌కు చెందిన నైపుణ్యం గల, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని ప్రపంచ అవకాశాలతో అనుసంధానించడం ద్వారా అంతర్జాతీయ కార్మిక రాకపోకల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి దేశం నిరంతరం చేపడుతున్న చర్యలను డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రధానంగా చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం 2,100 కంటే ఎక్కువ జీసీసీలు (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు) ఉన్నాయని.. ఇవి 23.5 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తూ ఏటా దాదాపు 98 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
ఉత్పాదకత, సమానత్వంతో కూడిన భవిష్యత్తు కార్మిక రంగాన్ని తీర్చిదిద్దే బాధ్యతను బ్రిక్స్ దేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. "గ్లోబల్ సౌత్ దేశాలు ఆచరణాత్మకమైన, సమగ్రమైన, ప్రజా కేంద్రకమైన పరిష్కారాలను రూపొందించుకోవడానికి ఈ బ్రిక్స్ వేదిక ఒక విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
II. సమావేశ విశేషాలు
ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ సందేశం
ఈ సదస్సుకు పంపించిన వీడియో సందేశంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) డైరెక్టర్ జనరల్... బ్రిక్స్ ఎజెండాలో కార్మిక, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినందుకు భారత నాయకత్వాన్ని అభినందించారు. గత దశాబ్ద కాలంలో అత్యంత వేగవంతమైన విస్తరణను సాధించిన భారతదేశపు బలమైన సామాజిక భద్రతా వ్యవస్థను ఆయన కొనియాడారు. "ఐఎల్ఓ తాజా అంచనాల ప్రకారం భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల మంది ప్రజలకు రక్షణ కల్పిస్తోంది. ఈ ఘనత 'సౌత్-సౌత్ సహకారం' ద్వారా ఇతర దేశాలు కూడా నేర్చుకోదగ్గ ఎన్నో పాఠాలను అందిస్తోంది" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడం, సామాజిక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, సమగ్ర వృద్ధికి మద్దతు ఇవ్వడం, కార్మిక- ఉపాధి రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించడంపై బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఈ సమావేశంలో 'బ్రిక్స్ కార్మిక- ఉపాధి మంత్రుల ప్రకటన'ను ఆమోదించడం ఒక ప్రధాన నిర్ణయంగా నిలిచింది. ఉమ్మడి కార్మిక మార్కెట్ సవాళ్లను పరిష్కరించడంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య 'సౌత్-సౌత్ సహకారం', పరస్పర అభ్యసనం, ఆచరణాత్మక భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఈ ప్రకటన పునరుద్ఘాటించింది.
సామాజిక భద్రతను పెంపొందించడం, కార్మిక మార్కెట్ల క్రమబద్ధీకరణ అనే ప్రాధాన్యత 1 కింద సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఉమ్మడి ప్రయత్నాలను అభినందించడానికి సభ్య దేశాలు అంగీకరించాయి. తమ దేశీయ పరిస్థితులు, ప్రాధాన్యతలు, సామర్థ్యాల ఆధారంగా జాతీయంగా నిర్దేశించుకున్న స్థాయిల ప్రకారం ప్రస్తుత స్థాయిల నుంచి సామాజిక భద్రతా పరిధిని క్రమంగా విస్తరించడానికి సభ్య దేశాలు కృషి చేస్తాయి.
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం, సమగ్రతను పెంపొందించడం అనే ప్రాధాన్యత 2 కింద నైపుణ్యాభివృద్ధికి విస్తృత కవరేజీ కల్పించడం, తల్లిదండ్రుల సెలవు విధానాలు, పని ప్రదేశాలలో వేధింపులు, వివక్షల నుంచి రక్షణ కల్పించడం ద్వారా మహిళలకు సాధికారత చేకూర్చే విధానపరమైన వ్యవస్థను బలోపేతం చేయడానికి సభ్య దేశాలు కట్టుబడి ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నాయకత్వ పాత్రలో మహిళల ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కూడా కృషి చేస్తాయి.
ఉపాధి సామర్థ్యం, నైపుణ్యాల గుర్తింపు- అభివృద్ధిపై సహకారం అనే ప్రాధాన్యత 3 కింద బ్రెజిల్ మద్దతుతో భారతదేశ భాగస్వామ్యంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నిర్వహిస్తున్న ‘వృత్తుల అంతర్జాతీయ సూచన వర్గీకరణ’పై కొనసాగుతున్న సాధ్యసాధ్యాల అధ్యయనాన్ని సభ్య దేశాలు గుర్తించాయి. డిజిటల్, సంరక్షణ రంగం, పర్యావరణ అనుకూల వంటి కీలక రంగాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుల్లో పాల్గొనడాన్ని పరిశీలించాల్సిందిగా సభ్య దేశాలను ప్రోత్సహించాయి.
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సహా శ్రామికులందరి కోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనే ప్రాధాన్యత 4 కింద విస్తృతమైన సంప్రదింపులు, ఉమ్మడి సహకారం, భాగస్వామ్య ప్రయోజనాలతో కూడిన సహచరుల నుంచి నేర్చుకోవడం (పీర్ లెర్నింగ్).. 'సౌత్-సౌత్, త్రైపాక్షిక సహకారం' ద్వారా విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడానికి మన డిజిటల్ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, మార్పు ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను తగ్గించడానికి సభ్య దేశాలు కలిసి పనిచేస్తాయి.
ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతిక సహకారం, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపొందింపును బలోపేతం చేసే లక్ష్యంతో భారత్ ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన వ్యవస్థాగత కార్యక్రమం అయిన 'బ్రిక్స్ కనెక్ట్'ను కూడా ప్రారంభించారు. ఇది కార్మిక మార్కెట్ సమాచారాన్ని మెరుగుపరచడం, నైపుణ్యాల అంచనాకు మద్దతు ఇవ్వడం, భవిష్యత్ నైపుణ్యాలు, డిజిటల్ ఉపాధి సేవలు, సామాజిక భద్రత, కార్మిక మార్కెట్ సంస్కరణల రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలలో అత్యుత్తమ విధానాలను పంచుకోవడానికి, విజ్ఞాన మార్పిడికి ఒక ఉమ్మడి వేదికగా పనిచేస్తుందని భావిస్తున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని కేవలం విధానపరమైన చర్చలకే పరిమితం చేయకుండా కార్యాచరణ ఆధారిత, దేశాల అవసరాలకు అనుగుణమైన ఉమ్మడి భాగస్వామ్యంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఇదొక కీలక అడుగు అని పేర్కొంటూ సభ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాయి.
ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల ప్రతినిధి బృందాలు తమ జాతీయ ప్రకటనలను సమర్పించాయి. ఈ సందర్భంగా ఆయా దేశాలు తమ ప్రాధాన్యతలను, సాధించిన విజయాలను, విధానపరమైన కోణాలను ప్రముఖంగా ప్రస్తావించాయి. నైపుణ్యాభివృద్ధి, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగాన్ని కోల్పోయే విషయంలో రక్షణ.. మహిళలు, దివ్యాంగులు, మారుమూల ప్రాంతాల ప్రజల కోసం సమగ్ర ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల ప్రాధాన్యతను ఇండోనేషియా ప్రధానంగా చెప్పింది. బ్రిక్స్ పరిధిలో పరస్పర చర్చలు, సహకారం ప్రాముఖ్యతను ఇరాన్ స్పష్టం చేసింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, సరళమైన చట్టపరమైన నియంత్రణలు, అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడం, కార్మిక పరిపాలన కోసం డిజిటల్ సాంకేతికతలతో పాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ప్రతిపాదికన చేపట్టిన కార్మిక మార్కెట్ సంస్కరణలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రముఖంగా వివరించింది. 'బ్రిక్స్ కనెక్ట్'ను ఒక విశిష్ట వ్యవస్థాగత ఆవిష్కరణగా దక్షిణాఫ్రికా కొనియాడింది. ఇది కేవలం విధానపరమైన చర్చలకే పరిమితం కాకుండా మరింత ఉత్పాదకత, సమగ్రత, సమానత్వంతో కూడిన ఉమ్మడి కార్మిక మార్కెట్ దిశగా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణమైన వృత్తి విద్యా విధానాన్ని, 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇథియోపియా తెలిపింది. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నుంచి నేర్చుకుంటూ 'సౌత్-సౌత్ సహకారం' స్ఫూర్తితో ఉమ్మడి లక్ష్యాల సాధనకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ దేశంలో తగ్గుతున్న నిరుద్యోగిత రేటు, ఈ రంగం డిజిటలైజేషన్, చెల్లింపుల కోసం ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ప్రవేశపెట్టడం వంటి పురోగతిని రష్యా పంచుకుంది. లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చే తమ 'మైక్రో-ఇంటర్న్‌షిప్' కార్యక్రమాన్ని బ్రెజిల్ ప్రముఖంగా ప్రస్తావించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో సహకారాన్ని మరింత విస్తరించాలని ఆ దేశం కోరింది. ప్లాట్‌ఫామ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, నూతన పని విధానాలను చైనా వివరించింది. ఏకాభిప్రాయంతో ఈ సంయుక్త ప్రకటనను ఆమోదించడాన్ని ఆ దేశం స్వాగతించింది.
ఈ సమావేశంలో భాగంగా 'అత్యుత్తమ విధానాలపై' ఒక ప్రత్యేక సాంకేతిక సెషన్‌ను కూడా నిర్వహించారు. ఇందులో సభ్య దేశాలు తమ ఆచరణాత్మక అనుభవాలు, జాతీయ ఆవిష్కరణలను పరస్పరం పంచుకున్నాయి. కార్మిక- యజమానుల ప్రతినిధులు సైతం ఈ చర్చలలో చురుగ్గా పాల్గొని సామాజిక న్యాయం, గౌరవప్రదమైన పని, మానవ గౌరవం, మానవ కేంద్రక సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ).. అందరికీ సామాజిక భద్రత- సంక్షేమ ప్రయోజనాల బదిలీ సౌలభ్యం.. నిరంతర నైపుణ్యాభివృద్ధి, పూర్వ అభ్యసన గుర్తింపు, భవిష్యత్ కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు.
III. ముగింపు వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ తన ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. ఈ సమావేశంలో ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను సామూహిక ప్రయత్నాల విజయంగా, చర్చలను నడిపించిన ఏకాభిప్రాయ స్ఫూర్తికి ప్రతీకగా అభివర్ణించారు. "ఏ ఒక్క కార్మికుడు వెనుకబడిపోకుండా చూస్తూ క్రమబద్ధమైన, సమగ్రమైన, లింగ సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చే, డిజిటల్ పరంగా సాధికారత సాధించిన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా దృఢత్వం కలిగిన కార్మిక మార్కెట్లను నిర్మించడానికి మేం పూర్తి విశ్వాసంతో, నిబద్ధతతో ఉన్నాం" అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
సాంకేతిక చర్చలకు మద్దతు ఇవ్వడంలో, చర్చలను మరింత సుసంపన్నం చేయడంలో అంతర్జాతీయ విజ్ఞాన భాగస్వాములైన ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ (ఐఎస్ఎస్ఏ), ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ కార్యాలయం (యూఎన్ఆర్‌సీఓ) అందించిన విలువైన సహకారాన్ని కూడా ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన భారతదేశం అభినందించింది.
ఈ సంయుక్త ప్రకటనను విజయవంతంగా ఆమోదించటం, 'బ్రిక్స్ కనెక్ట్' ఆవిష్కరణ.. కార్మిక- ఉపాధి రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఒక గణనీయమైన ముందడుగుగా నిలిచాయి. సామాజిక న్యాయం, గౌరవప్రదమైన ఉపాధి, ఆవిష్కరణ, దృఢత్వం, అందరికీ సమగ్ర అభివృద్ధిని పెంపొందించే దిశగా. శ్రామిక ప్రపంచం కోసం ఉమ్మడిగా కలిసి పనిచేయాలనే దృఢ సంకల్పంతో ఈ సమావేశం ముగిసింది.
***
(रिलीज़ आईडी: 2285207)
आगंतुक पटल : 9