ఆర్థిక మంత్రిత్వ శాఖ
పుణేలో హైటెక్ ఎండీ తయారీ ప్రయోగశాలను ధ్వంసం చేసిన సీబీఎన్ మధ్యప్రదేశ్ విభాగం
వివిధ నగరాల్లో చేపట్టిన ‘ఆపరేషన్ వజ్ర’లో భాగంగా ఉజ్జయిన్, జోధ్‌పూర్‌లో ఇద్దరు సూత్రధారుల అరెస్టు
प्रविष्टि तिथि:
13 JUL 2026 8:21PM by PIB Hyderabad
సింథటిక్ మాదక ద్రవ్యాల అంతరాష్ట్ర అక్రమ రవాణా ముఠాకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆపరేషన్లో భాగంగా నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (సీబీఎన్) మధ్యప్రదేశ్ విభాగం కీలక విజయం సాధించింది. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న మెఫెడ్రోన్ (ఎండీ) తయారీ ప్రయోగశాలని ధ్వంసం చేసింది. అలాగే ఆపరేషన్ వజ్ర చేపట్టి ఈ ముఠాకు చెందిన ఇద్దరు ప్రధాన సూత్రధారులను ఉజ్జయిని (మధ్యప్రదేశ్), జోధ్‌పూర్ (రాజస్థాన్)లో అరెస్టు చేసింది.
నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా.. నీమచ్‌లోని సీబీఎన్, డిప్యూటీ నార్కోటిక్స్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని నిరోధక విభాగం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. 2026 జులై 1 నుంచి 10 తేదీల మధ్య దర్యాప్తు, సమన్వయ కార్యకలాపాలను చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా ఎండీ తయారు చేస్తున్న అత్యాధునిక ప్రయోగశాలను సీబీఎన్ స్వాధీనం చేసుకుంది. దీనిలో సింథటిక్ డ్రగ్స్ తయారీలో ఉపయోగించే అత్యాధునిక యంత్రాలు, ప్రయోగశాల పరికరాలు, ముడి రసాయనాలు, భద్రతా పరికరాలను సీజ్ చేసింది. ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ప్రధాన కుట్రదారులతో సహా ఇద్దరిని అరెస్టు చేశారు.

2026 ఫిబ్రవరిలో మందసౌర్ వద్ద ఒక బస్సులో 8.17 కిలోల మెఫెడ్రోన్‌ను సీబీఎన్, నీముచ్ స్వాధీనం చేసుకోవడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. దీనికి కొనసాగింపుగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. తదనంతర సోదాల ఫలితంగా మవూలోని థావ్లేలో అక్రమంగా నిర్వహిస్తున్న లెబొరేటరీని గుర్తించారు. ఇక్కడ 43.82 కిలోల మెఫెడ్రోన్, 261.32 కిలోల ముడి రసాయనాలు, అధునాతన తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

నిరంతర నిఘా, విస్తృతమైన అంతర్రాష్ట్ర దర్యాప్తు ఆధారంగా, నకిలీ గుర్తింపు పత్రాలను వాడుతూ తరచూ వివిధ రాష్ట్రాలకు మకాం మారుస్తూ పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారిని నిరోధక విభాగానికి చెందిన బృందం అదుపులోకి తీసుకుంది. ఉజ్జయిని పోలీసులు అందించిన సహకారంతో రహస్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 2026 జూలై 3వ తేదీ అర్ధరాత్రి ఉజ్జయినిలో నిందితుడిని అరెస్టు చేశారు.
పుణేలోని భోస్రీ వద్ద డిగ్గీలో మరో అత్యాధునికమైన ఎండీ తయారీ యూనిట్లను ఈ సిండికేట్ ఏర్పాటు చేసినట్లు విస్తృత దర్యాప్తులో తేలింది. జోధ్‌పూర్‌కి చెందిన సహనిందితుడి ఆర్థిక సాయం, సమన్వయంతో దీనిని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. తక్షణమే స్పందించిన సీబీఎన్ బృందాలు 2026 జులై 9న పుణే, జోధ్‌పూర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి రెండో నిందితుడిని అరెస్టు చేశాయి. రహస్యంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలను ధ్వంసం చేశాయి. అత్యాధునిక డిజిటల్ యంత్రాలు, లెబొరేటరీ పరికరాలు, భారీ గాజు సామగ్రి, ముడి రసాయనాలు, భద్రతా పరికరాలను ఈ ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్నారు. యంత్రాలు, పరికరాలు, రసాయనాలను ఎన్డీపీఎస్ చట్టం-1985 లోని నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నియంత్రణ, లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్). ఇది చట్టబద్ధమైన గసగసాల సాగును పర్యవేక్షిస్తుంది. అలాగే లైసెన్సు ఉన్న రైతుల నుంచి ఈ పంట దిగుబడిని సేకరిస్తుంది. అలాగే సైకోట్రాపిక్ పదార్థాలు, ముడి రసాయనాల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. సీబీఎన్ ప్రధాన కార్యాలయం గ్వాలియర్‌లో ఉంది. ఇక్కడి నుంచే కఠినమైన నియంత్రణ పర్యవేక్షణతో పాటు మాదకద్రవ్యాల నిరోధక చర్యలను కూడా చురుగ్గా నిర్వహిస్తుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని నివారించేందుకు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలను దర్యాప్తు చేస్తుంది. అక్రమ మాదక ద్రవ్యాలను, ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది.
ప్రస్తుత సంవత్సరంలో.. 142 కేసులను సీబీఎన్ రిజిస్టర్ చేసింది. అలాగే నాలుగు రహస్య తయారీ కేంద్రాలను ఛేదించడంతో సహా 193 మందిని అరెస్టు చేసింది. చట్టపరమైన చర్యలను కొనసాగించడం వ్యవస్థీకృత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలను, వ్యవస్థలను నిర్మూలించడంలోనూ, దేశ లక్ష్యమైన నషా ముక్త్ భారత్ అభియాన్‌ను సాధించడంలోనూ తన అంకితభావాన్ని సీబీఎన్ ప్రదర్శిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2284422)
आगंतुक पटल : 7