ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి నిడార్ 2.0 పోటీని సంయుక్తంగా ప్రారంభించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఇండియా
భారతదేశంలోనే తయారైన చిప్‌తో అత్యంత స్మార్ట్ డ్రోన్‌ల అభివృద్ధిపై విద్యార్థులకు పోటీ
విజేతలైన విద్యార్థి బృందాల కోసం రూ. 65 లక్షలకు పైగా బహుమతి నిధితో పాటు స్టార్టప్ ఇంక్యుబేషన్, క్లౌడ్ క్రెడిట్స్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు
प्रविष्टि तिथि:
13 JUL 2026 6:31PM by PIB Hyderabad
స్వయాన్ కార్యక్రమం కింద జాతీయ డ్రోన్ అప్లికేషన్, రీసెర్చ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ రెండవ ఎడిషన్ (నిడార్ 2.0), 2026-27 ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), డ్రోన్ ఫెడరేషన్ ఇండియా (డీఎఫ్ఐ) ఈరోజు సంయుక్తంగా ప్రారంభించాయి. న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ నికేతన్ లో హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగానూ, ఆన్‌లైన్ ద్వారానూ పాల్గొన్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ నిడార్ 2.0 కు సంబంధించిన సమస్య ప్రకటనలు, పోస్టర్, నియమావళి పుస్తకాలను ప్రారంభించారు. అనంతరం, ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి, ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈఓ శ్రీ అమితేష్ కుమార్ సిన్హా ప్రత్యేక ప్రసంగం చేశారు. ఎంఈఐటీవై సైంటిస్ట్ జి, గ్రూప్ కోఆర్డినేటర్ శ్రీమతి తూలిక పాండే, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ స్మిత్ షా కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వయాన్ సామర్థ్య పెంపు కార్యక్రమం గురించి, నిడార్ 2.0 పోటీ గురించి ముఖ్య అంశాలను వారు వివరించారు. ఎంఈఐటీవై, పౌర విమానయాన, రక్షణ, హోం మంత్రిత్వ శాఖల ఇతర ఉన్నతాధికారులు, డీజీసీఏ, సాయుధ దళాల ప్రతినిధులు, ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమల రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ, “నిడార్ 2.0 మన విద్యార్థులను డ్రోన్‌లను ఎగరేసే స్థాయి నుంచి డ్రోన్ మెదడును సొంతంగా తయారుచేసే స్థాయికి తీసుకువెళుతుంది. డ్రోన్ మెదడు భారత స్వదేశీ వేగా ప్రాసెసర్‌పై పనిచేసినప్పుడు, మనం కేవలం ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వడం కాదు - స్వావలంబనతో కూడిన డ్రోన్ పరిశ్రమకు పునాది వేయడం. విదేశీ చిప్ డిజైన్‌లపై, వాటి లైసెన్సింగ్ ఖర్చులపై మన దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చేపట్టిన డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ - వీ‘ (డీఐఆర్-వీ) కార్యక్రమంలో భాగంగానే ఈ 'వేగా' ప్రాసెసర్‌ను అభివృద్ధి చేశాం” అని అన్నారు.
నిడార్ (2025-26) మొదటి ఎడిషన్ 2025 మార్చిలో ప్రారంభమైంది. విపత్తు నిర్వహణ, కచ్చితత్వ వ్యవసాయం రంగాల కోసం స్వయంప్రతిపత్తి డ్రోన్ పరిష్కారాలను రూపొందించే ఈ పోటీలో 22 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 109 నగరాల నుంచి మొత్తం 3,448 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో తొంభై మూడు (93) బృందాలు గ్రాండ్ ఫినాలేకు చేరుకోగా వాటిలో ఇరవై నాలుగు బృందాలు మొత్తం రూ. 40 లక్షల విలువైన బహుమతులను గెలుచుకున్నాయి.
నిడార్ 2.0 ఈ పోటీ ప్రమాణాలను మరింత పైస్థాయికి తీసుకువెళుతోంది. ఇది సాంప్రదాయ ఎయిర్‌ఫ్రేమ్‌ల తయారీ నుంచి స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు, స్వదేశీ ఏవియానిక్స్, డ్రోన్ ప్రధాన భాగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ పోటీ రెండు విభాగాలుగా సాగనుంది.
ట్రాక్ 1 (డ్రోన్ ఇన్నోవేషన్): ఈ విభాగం కింద విపత్తు సంభవించిన ప్రాంతాలలో, ఎలాంటి బాహ్య కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లేనప్పటికీ, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి వారికి వైద్య సహాయ సామగ్రిని అందించగల పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన 'స్వామ్ డ్రోన్‌లను' రూపొందించాల్సి ఉంటుంది. పారిశ్రామిక తనిఖీల కోసం జీపీఎస్ సిగ్నల్స్ అస్సలు అందని ఇరుకైన ఇండోర్ ప్రదేశాలలో కూడా సులువుగా ప్రయాణించగల డ్రోన్‌ను తయారు చేయాలనే పోటీ కూడా ఈ విభాగం లో ఉంది.
ట్రాక్ 2 విడిభాగాల (కాంపోనెంట్) ఆవిష్కరణ: స్వదేశీ ఎలక్ట్రానిక్ భాగాలను ఉపయోగిస్తూ, వేగా ప్రాసెసర్ ఆధారంగా రూపొందించిన ఒక స్వదేశీ ఫ్లైట్ కంట్రోలర్, ఆటోపైలట్‌ను డిజైన్ చేయాలి. సాంకేతిక మూల్యాంకనం తర్వాత, మొదటి 100 బృందాలకు అభివృద్ధి, పరీక్ష, అనుసంధానం ఒక్కొక్కరికీ రెండు వేగా ప్రాసెసర్ కిట్‌లు అందిస్తారు.
వేగా ప్రాసెసర్ ఓపెన్ స్టాండర్డ్ ఆర్ఐఎస్సీ-వీ ఆర్కిటెక్చర్ ఆధారంగా, ఎంఈఐటీవై మైక్రోప్రాసెసర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ - డాక్) ద్వారా డిజైన్ చేసిన స్వదేశీ మైక్రోప్రాసెసర్‌ల శ్రేణి. ఈ ప్రాసెసర్‌ను కాంపోనెంట్ ఇన్నోవేషన్ ట్రాక్ కేంద్ర బిందువుగా ఉంచడం ద్వారా, భారతీయ డ్రోన్‌ల నియంత్రణ వ్యవస్థలను భారతదేశంలోనే తయారైన చిప్‌లపై రూపొందించేలా నిడార్ 2.0 విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.
విస్తృత పరిధికి అనుగుణంగా, నిడార్ 2.0 బహుమతి నిధి రూ. 65 లక్షలకు పైగా పెరిగింది. విజేతలుగా నిలిచిన బృందాలు తమ ప్రోటోటైప్‌లను వాణిజ్య ఉత్పత్తులుగా మార్చుకోవడానికి వీలుగా కార్పొరేట్ ఇంటర్న్‌షిప్‌లు, ఇంక్యుబేషన్ సపోర్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ క్రెడిట్‌లను కూడా పొందుతాయి. పౌర, రక్షణ డ్రోన్‌లు రెండూ చాలా వరకు ఒకే విధమైన కోర్ టెక్నాలజీని పంచుకుంటాయి. అందువల్ల, నిడార్ నుంచి వచ్చే ఆలోచనలు ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ @2047 లక్ష్యాలకు అనుగుణంగా పౌర, రక్షణ రంగాల అనువర్తనాలు రెండింటినీ బలోపేతం చేయగలవు.
స్వయాన్ గురించి
(మానవరహిత విమాన వ్యవస్థలలో [డ్రోన్, అనుబంధ సాంకేతికతలు] మానవ వనరుల అభివృద్ధి కోసం సామర్థ్య పెంపు)
జూలై 2022లో దాదాపు రూ. 89.87 కోట్ల వ్యయంతో ఐదేళ్ల కాలానికి ఎంఈఐటీవై ఆమోదించిన స్వయాన్ చొరవ, భారత డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఏరోమెకానిక్స్, డ్రోన్ ఎలక్ట్రానిక్స్, జీయన్సీ అల్గారిథమ్స్, సిమ్యులేషన్, డ్రోన్ అప్లికేషన్స్, అనుబంధ యూఏఎస్ సాంకేతికతలు అనే ఐదు కార్యాచరణ అంశాలతో ఐఐఎస్సీ, ఐఐటీలు, ఎన్ఐటీలు, సీ- డాక్, ఎన్ఐఈఎల్ఐటీలతో సహా 30 ప్రముఖ సంస్థల హబ్-అండ్-స్పోక్ మోడల్ ద్వారా నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు 51,000మందికి పైగా శిక్షణ ఇచ్చింది. ఇది డ్రోన్ టెక్నాలజీలో ఎం.టెక్, మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, రెట్రోఫిట్టింగ్ ఎలెక్టివ్‌లు, ఆన్‌లైన్ కోర్సులు, పరిశోధనా పత్రాలు, పేటెంట్‌లకు కూడా మద్దతు ఇచ్చింది. నిడార్ దీని ప్రధాన ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్. మరిన్ని వివరాల కోసం, https://swayaan.meity.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
***
(रिलीज़ आईडी: 2284416)
आगंतुक पटल : 22