జాతీయ మానవ హక్కుల కమిషన్
జార్ఖండ్ లోహర్‌దగా జిల్లా ఉన్నత పాఠశాల హాస్టల్‌లో నలుగురు విద్యార్థులకు పాముకాటు విద్యార్థిని మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా విచారణ
వసతి గృహంలో నిద్రిస్తున్న సమయంలో విద్యార్ధినులు పాము కాటుకు గురైనట్లు సమాచారం
రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలంటూ జార్ఖండ్ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ
ప్రభుత్వ నివేదికలో పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థుల తాజా ఆరోగ్య పరిస్థితి వివరాలు కూడా ఉండాలని కమిషన్ స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
13 JUL 2026 1:53PM by PIB Hyderabad
జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాల వసతి గృహంలో 2026 జూలై 7న నలుగురు విద్యార్థినులను పాముకాటు వేసినట్లు వచ్చిన వార్తా కథనంపై భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో బాధితుల్లో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ముగ్గురు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. వసతిగృహంలోని గ్రౌండ్ ఫ్లోర్ గదిలో విద్యార్థులు రాత్రి భోజనానంతరం నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేసినట్లు సమాచారం.
వార్తా కథనంలో పేర్కొన్న వివరాలు నిజమైతే ఇది విద్యార్థుల ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ.. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. అదే నివేదికలో పాముకాటుకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న మిగిలిన విద్యార్థుల తాజా ఆరోగ్య పరిస్థితి వివరాలను పొందుపరచాలని పేర్కొంది.
2026 జూలై 10వ తేదీన వెలువడిన మీడియా నివేదిక ప్రకారం.. ఒక విద్యార్థిని పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితురాలిని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
***
(रिलीज़ आईडी: 2284102)
आगंतुक पटल : 15