అణుశక్తి విభాగం
కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్-2026లో భారత్ అద్భుత విజయం
56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్-2026 (ఐపీహెచ్ఓ)లో పాల్గొన్న అయిదుగురు భారతీయ విద్యార్థులూ బంగారు పతక విజేతలే
ఇతర దేశాలతో పాటు ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సాధించిన భారత్..
సత్తా చాటిన 80కి పైగా దేశాలకు చెందిన 380 మంది విద్యార్థులు
ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దుతున్న హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్
ఆర్థిక సాయం అందిస్తున్న అణు ఇంధన విభాగం
प्रविष्टि तिथि:
12 JUL 2026 5:37PM by PIB Hyderabad
కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్-2026 (ఐపీహెచ్ఓ)లో పాల్గొన్న భారతీయ బృందం అసాధారణ ప్రదర్శనను కనబరిచింది. బృందంలోని అయిదుగురు సభ్యూలూ బంగారు పతకాలను గెలిచి దేశం గర్వపడేట్టు చేశారు.
87 దేశాలకు చెందిన 381 మంది విద్యార్థుల్లో- చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్‌లతో కలిసి భారత్.. ప్రపంచంలో అగ్ర స్థానాన్ని చేజిక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానశాస్త్ర విద్యలోనూ, శ్రేష్ఠత్వంలోనూ భారత్ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. భారత్ పక్షాన పతకాలను గెలిచిన వారిలో మహారాష్ట్ర.. పుణేకు చెందిన శ్రీ కనిష్క్ జైన్, మధ్యప్రదేశ్.. ఇండోర్‌కు చెందిన శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలే, న్యూఢిల్లీ.. ద్వారకకు చెందిన శ్రీ రుషిత్ గర్గ్, మహారాష్ట్ర.. ముంబయికి చెందిన శ్రేష్ఠ్ సురైయా, గుజరాత్.. అహ్మదాబాద్‌కు చెందిన స్వరిత్ జోషీ ఉన్నారు.
ఈ అసాధారణ విజయం అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్‌లో భారత్ గౌరవశాలి వారసత్వాన్ని నిలబెట్టింది. గత పది సంవత్సరాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భారతీయుడూ విజేతగా నిలిచారు.
ఈ విజయం భారత్ ఒలింపియాడ్ కార్యక్రమానికున్న శక్తిని చాటుతోంది. హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్ఈ) దీనికి సారధ్యం వహిస్తోంది. ఈ సంస్థ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ (టీఐఎఫ్ఆర్)కు సంబంధించిన జాతీయ కేంద్రంగా కూడా ఉంది. ఇది అణు ఇంధన విభాగం (డీఏఈ) నుంచి సహాయాన్ని అందుకుంటున్న సంస్థ కూడా. భారత్‌లో ఒలింపియాడ్ కార్యక్రమ నోడల్ సెంటరుగా ఉన్న హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ ఒలింపియాడ్ సమాజంతో దేశాన్ని అనుసంధానిస్తోంది. ఈ సంస్థ ప్రీ యూనివర్సిటీ విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రాలంటే ఉన్న అసాధారణ ప్రతిభను గుర్తించి, పెంచి పోషించడానికీ, వారికి మార్గదర్శకత్వాన్ని అందించడానికీ అంకితమైన సంస్థ. దీనికోసం బహుళ దశల ఎంపిక ప్రక్రియనీ, పునశ్చరణ శిబిరాలనీ, ముమ్మర శిక్షణ కార్యక్రమాల్నీ నిర్వహిస్తోంది.
పతకాల విజేతలకు డీఏఈ కార్యదర్శి, అణు ఇంధన సంఘం చైర్మన్ డాక్టర్ అజీత్ కుమార్ మొహంతి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘మన యువ భౌతికశాస్త్ర నిపుణులు సాధించిన ఈ ఘన విజయం దేశ ప్రజలకు గర్వకారణం. అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్‌లో అయిదు బంగారు పతకాలు గెలవడంతో పాటు ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సంయుక్తంగా సాధించడం మన విద్యార్థుల ప్రతిభ, అంకితభావం, విజ్ఞానశాస్త్ర దృక్పథానికే కాక హెచ్‌బీసీఎస్ఈ-టీఐఎఫ్ఆర్
ఒలింపియాడ్ కార్యక్రమం దృఢ నిబద్ధతకు కూడా ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ గొప్ప విజయాన్ని సాధించిన విద్యార్థుల్నీ, వారి తల్లితండ్రుల్నీ, గురువుల్నీ, మార్గదర్శకుల్నీ నేను అభినందిస్తున్నాను. వారి విజయం అనేక మంది యువ ప్రతిభావంతులకు విజ్ఞానశాస్త్రంలో శ్రేష్ఠత్వాన్ని సంపాదించేందుకు స్ఫూర్తిని అందించడంతో పాటు విజ్ఞానశాస్త్ర విద్య, నూతన ఆవిష్కరణ రంగాల్లో పెరుగుతున్న నాయకత్వాన్ని కూడా పటిష్ఠపరుస్తోంది’’ అన్నారు.
భారత్‌కు చెందిన మెరికల్లాంటి ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికపై రాణించేలా తీర్చిదిద్దడంలో అంకితభావాన్ని కనబరిచిన బృంద సారథులనూ అణు ఇంధన విభాగం అభినందించింది. వీరిలో.. ప్రొఫెసర్ అన్వేష్ మజుందార్ (హెచ్‌బీసీఎస్ఈ-టీఐఎఫ్ఆర్), డాక్టర్ లీనా జోషి (సెంట్ జేవియర్స్ కళాశాల, ముంబయి), సైంటిఫిక్ అబ్జర్వర్లు ప్రొఫెసర్ ఆనంద దాస్‌గుప్త (ఐఐఎస్ఈఆర్, కోల్‌కతా), నిశా కేల్‌కర్ (గొగటే-జోగ్‌లేకర్ కళాశాల, రత్నగిరి)లతో పాటు హెచ్‌బీసీఎస్ఈకి చెందిన భౌతికశాస్త్ర ఒలింపియాడ్ జట్టు, మార్గదర్శకుల జట్టు ఉన్నాయి.
విజ్ఞానశాస్త్రం తో పాటు గణితశాస్త్ర ఒలింపియాడ్‌లలో టీమ్ ఇండియాకు విజయాలు ఇక సాధారణంగా మారిపోయాయనీ, దశాబ్దాల పాటు పడిన శ్రమ, మార్గదర్శకత్వాలదే ఈ ఫలితమనీ హెచ్‌బీసీఎస్ఈ కేంద్రం డైరెక్టరు ప్రొఫెసర్ అర్ణబ్ భట్టాచార్య అన్నారు. అసాధారణ ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు మక్కువకీ ధైర్యానికీ లోటు లేని మార్గదర్శకులు ఎంతో మంది ఉన్నారని ఆయన తెలిపారు. అనేక దశాబ్దాల నుంచీ అణు ఇంధన విభాగం అందించిన సంపూర్ణ మద్దతు కారణంగానే టీమ్ ఇండియా ఇవాళ ఈ మజిలీకి చేరుకొందని ఆయన స్పష్టం చేశారు.
ఐపీహెచ్ఓ-2026లో అసాధారణ ప్రదర్శన మరోసారి పాఠశాల విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన శ్రేష్ఠత్వాన్ని పెంచి పోషించడంతో పాటు, దేశ భావి విజ్ఞానశాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సంబంధిత నాయకత్వానికి ఒక బలమైన పునాదిని వేయడంలో కూడా డీఏఈ కనబరుస్తున్న నిబద్ధతను చాటిచెబుతోంది.
కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్-2026 (ఐపీహెచ్ఓ)లో భారతీయ జట్టు .. దీనిలో అయిదుగురు స్వర్ణ పతక విజేతలు, టీమ్ లీడర్, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉన్నారు.
***
(रिलीज़ आईडी: 2284082)
आगंतुक पटल : 11