ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.
కివీ ఇండియన్ సమాజ సంక్షేమం సహా ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మద్దతునిచ్చినందుకు, తమ ఆదరణను తెలిపినందుకు ప్రధానమంత్రి లక్సన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రవాస భారతీయుల అపూర్వ స్వాగతాన్ని ఆయన అభినందించారు. దృఢ సంకల్పం, కఠోర శ్రమ, పట్టుదలతోనే ప్రవాస భారతీయులు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.
కివీ ఇండియన్ సమాజం ప్రతి రంగంలోనూ గణనీయ కృషి చేస్తూ, ఒక చైతన్యవంతమైన శక్తిగా ఆవిర్భవించిందన్నారు. తమ సంస్కృతి, పండుగలు, సంప్రదాయాలను పరిరక్షిస్తూనే... న్యూజిలాండ్ బహుళ సాంస్కృతిక స్వరూపాన్ని సుసంపన్నం చేస్తున్న ప్రవాస భారతీయులను ప్రధానమంత్రి ప్రశంసించారు. స్వచ్ఛంద సేవ, దాతృత్వ కార్యక్రమాలు, సమాజ సంక్షేమంలో వారి ఆదర్శప్రాయమైన రికార్డునూ ప్రస్తావిస్తూ, ప్రవాస భారతీయుల సేవా స్ఫూర్తిని కొనియాడారు.
ఈ సమావేశం ప్రవాస భారతీయులది కావచ్చు కానీ, వాస్తవానికి భారత్-న్యూజిలాండ్ స్నేహానికి, క్రీడా సంబంధాలకు, ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన వేడుకగా ఇది నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2026 నాటికి క్రీడా సహకారానికి 100 ఏళ్లు పూర్తవుతాయని గుర్తుచేస్తూ... ఇరు దేశాలూ తమ క్రీడా సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయని ఆయన తెలిపారు. స్థానిక మావోరీ సంస్కృతి సమ్మిళిత, సుస్థిర విధానాన్ని ప్రశంసిస్తూ... నాగరికతా వారసత్వాన్ని అభివృద్ధితో మేళవించే అభివృద్ధి మార్గాన్నే భారత్ అనుసరిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య స్నేహం, విశ్వాసం, సహకారానికి వారధిగా కొనసాగుతూనే ఇరు దేశాల ప్రయోజనం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య పూర్తి సామర్థ్యాన్ని సాకారం చేయడంలో సహకారం అందించాలని ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కోరారు.
***