జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 కామన్వెల్త్ క్రీడల్లో పర్యావరణ హిత జనపనార దుస్తుల్లో మెరవనున్న భారత బృందం

నాడు పోస్టు చేయడమైనది: 07 JUL 2026 5:06PM by PIB Hyderabad

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జూలై 23 నుంచి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారతీయ క్రీడాకారులు, బృంద సభ్యులు జనపనారతో రూపొందించిన దుస్తుల్ని ధరించనున్నారు. పర్యావరణ హిత వస్త్రాలను ప్రోత్సహించడంతోపాటు, దేశీయ ఆవిష్కరణలను ప్రపంచం ముందు ఉంచాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ జనపనార సంస్థ (ఎన్‌జేబీ) జనపనార-విస్కోస్ మిశ్రమ దుస్తులను రూపొందించింది.

మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ నాయకత్వంలో జాతీయ జనపనార సంస్థ ద్వారా జనపనారతో రకరకాల వినూత్న ఉత్పత్తుల తయారీని మంత్రిత్వ శాఖ చురుగ్గా ముందుకు తీసుకెళుతున్నది. వంద శాతం పర్యావరణ హితమైన ఈ జనపనార-విస్కోస్ మిశ్రమ వస్త్రం.. రాబోయే రోజుల్లో పర్యావరణ హిత జౌళి రంగంలో ఒక వినూత్న పరిష్కారంగా మారే అపారమైన అవకాశం కలిగి ఉందని ఈ నిర్ణయం నిరూపిస్తోంది.

కామన్వెల్త్ క్రీడలు 2026కు సంబంధించి భారత జట్టు అధికారిక కిట్ ఆవిష్కరణ, వీడ్కోలు వేడుక ఈరోజు (జూలై 7, 2026) న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే పాల్గొన్నారు. వీరితో పాటు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు శ్రీమతి పీటీ ఉష, అసోసియేషన్ కార్యనిర్వాహక మండలి సభ్యులు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఒక అంతర్జాతీయ బహుళ క్రీడా కార్యక్రమంలో జనపనార ఆధారిత దుస్తులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ చర్య భారతీయ జనపనార పరిశ్రమకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకురావడంతోపాటు, దేశీయ తయారీదారుల నైపుణ్యాన్ని, జనపనార రైతుల శ్రమను అంతర్జాతీయ వేదికపై చాటిచెబుతుందని భావిస్తున్నారు.

 

కోల్‌కతాలోని గ్లోస్టర్ జూట్ మిల్స్ సహకారంతో జాతీయ జనపనార బోర్డు జనపనార-విస్కోస్ మిశ్రమ వస్త్రాన్ని అభివృద్ధి చేసింది. ఈ వినూత్న వస్త్ర ఉత్పత్తులను ఏప్రిల్ 1, 2026న పాట్నాలో జరిగిన జాతీయ జనపనార బోర్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ప్రదర్శించారు. అక్కడ భారత ఒలింపిక్ సంఘం ప్రతినిధులు ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రశంసించారు.

పట్నా ప్రదర్శన విజయవంతం కావడంతో భారత జట్టు కోసం ఈ దుస్తులను వినియోగించేలా జాతీయ జనపనార బోర్డు, భారత ఒలింపిక్ సంఘంతో కలిసి పనిచేసింది. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన జనపనార-విస్కోస్ మిశ్రమ వస్త్రాన్ని ఉపయోగించి న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ) ఈ దుస్తులను అద్భుతంగా రూపొందించింది.

ఈ కామన్వెల్త్ క్రీడలు 2026 పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నారు. భారత్‌ తరఫున మొత్తం 124 మంది సభ్యులతో కూడిన బృందం బరిలోకి దిగుతోంది. ఇందులో 78 మంది పురుషులు, 46 మంది మహిళా క్రీడాకారులు దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భారత క్రీడా బృందం ఈ మేక్ ఇన్ ఇండియా జనపనార దుస్తులను ధరించేందుకు అనుమతించినందుకు భారత ఒలింపిక్ సంఘానికి (ఏఓఏ) జాతీయ జనపనార బోర్డు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సరికొత్త నిర్ణయం వల్ల దేశ విదేశాల్లో పర్యావరణ హిత జనపనార ఉత్పత్తులకు సరికొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. తద్వారా జాతీయ జనపనార బోర్డు చేపట్టిన జనపనార వైవిధ్యీకరణ కార్యక్రమం మరింత బలోపేతం కానుంది. అంతర్జాతీయ జౌళి రంగంలో పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయ వనరుగా సహజ నారలను వినియోగంలోకి తెచ్చేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇది గొప్ప ఊతాన్ని ఇస్తుంది. దేశంలోని జనపనార రైతులకు ఈ పరిణామం ఎంతో గర్వకారణంగా నిలవడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2282244) సందర్శకుల సూచీ సంఖ్య : : 75
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil