వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఏపీఈడీఏ ఆధ్వర్యంలో జార్ఖండ్ నుంచి దుబాయ్‌కి అమ్రపాలి మామిడి పండ్ల వాణిజ్య ఎగుమతి
జార్ఖండ్‌లోని మహిళా రైతు ఉత్సాదక సంస్థలకు 180 శాతం అధిక లాభాలను అందిస్తోన్న ఈ ఎగుమతి కార్యక్రమం
प्रविष्टि तिथि:
07 JUL 2026 2:12PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) పర్యవేక్షణలో జార్ఖండ్ నుంచి దుబాయ్‌కి ఆమ్రపాలి మామిడి పండ్ల వాణిజ్య ఎగుమతి విజయవంతంగా ప్రారంభమైంది. జార్ఖండ్‌లోని ఆకాంక్షిత జిల్లా గుమ్లా, దియోఘర్ ఆకాంక్షిత బ్లాక్ దేవ్‌ఘర్ నుంచి సేకరించిన 2 మెట్రిక్ టన్నుల అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆమ్రపాలి మామిడి పండ్లను జూలై 3, 2026న దుబాయ్‌కి ఎగుమతి చేశారు. మెసర్స్ ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా దుబాయ్‌లోని ప్రసిద్ధ లూలూ విక్రయ కేంద్రాల్లో రిటైల్ అమ్మకాల కోసం ఈ సరుకును పంపించారు. గిరిజన, మహిళా రైతు సంఘాల నుంచి ఎగుమతులను ప్రోత్సహించడంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం వల్ల జార్ఖండ్‌లోని మహిళా రైతు ఉత్పాదక సంస్థలకు మార్కెట్ ధర కంటే 180 శాతం అధిక రాబడి లభించింది.
ఈ ఎగుమతి సరుకు కోసం పలాష్ - జార్ఖండ్ రాష్ట్ర జీవనోపాధి ప్రోత్సాహక సంస్థ (జేఎస్‌ఎల్‌పీఎస్) ద్వారా ప్రోత్సహించిన మూడు మహిళా రైతు ఉత్పాదక సంస్థల నుంచి అత్యుత్తమ నాణ్యమైన ఆమ్రపాలి మామిడి పండ్లను సేకరించారు. ఇందులో ఒక మెట్రిక్ టన్నును గుమ్లా జిల్లాలోని ఏపీఈడీఏ -నమోదిత ఎంవీఎం బాఘిమా పాల్‌కోట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, రైదిహ్ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ల నుంచి సేకరించగా... మిగిలిన ఒక మెట్రిక్ టన్నును దియోఘర్ జిల్లాలోని మోహన్‌పూర్ అజీవిక మహిళా కిసాన్ ప్రొడ్యూసర్ సొసైటీ నుంచి సేకరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జార్ఖండ్ ప్రభుత్వం మద్దతుతో అమలు చేస్తున్న ‘బిర్సా హరిత్ గ్రామ్ యోజన’ కింద గిరిజన మహిళా రైతులు ఈ మామిడి తోటలను అభివృద్ధి చేశారు.
ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్‌లతో పాటు ఏపీఈడీఏ, జెఎస్ఎల్‌పీఎస్ ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధుల సమక్షంలో ఈ ఎగుమతి వాహనాన్ని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ఉత్పాదకులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడంలో ఏపీఈడీఏ, జార్ఖండ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాలు, మహిళా ఎఫ్‌పీసీలు, ఎగుమతిదారులు, అభివృద్ధి భాగస్వాముల మధ్య ఉన్న విజయవంతమైన సమన్వయానికి ఈ కార్యక్రమం ఒక ప్రతీకగా నిలిచింది.
ఈ మామిడి పండ్ల ఎగుమతి వల్ల స్థానిక రైతులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి. మహిళల నేతృత్వంలోని ఈ ఎఫ్‌పీసీ సభ్యులు స్థానిక మార్కెట్లో లభించే ధరల కంటే దాదాపు 180 శాతం అధిక రాబడిని పొందారు. ఎగుమతి మార్కెట్లకు అందుబాటును కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచవచ్చో, అలాగే ఎగుమతి ఆధారిత వ్యవసాయంలో మహిళా ఉత్పాదకుల భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందించవచ్చో ఈ కార్యక్రమం నిరూపించింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఎఫ్‌పీసీలో 1,500 మందికి పైగా వాటాదారులు ఉండగా, ఇవన్నీ కలిపి మొత్తం 50,000 మందికి పైగా సభ్యులైన రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దీనివల్ల ఈ ఎగుమతి ప్రయోజనాలు ఒక పెద్ద రైతు సమాజానికి విస్తరించాయి.
రైతు సంఘాలను ఎగుమతులకు సన్నద్ధం చేసేందుకు సామర్థ్య పెంపుదల, నాణ్యతా ప్రమాణాల పెంపు, మార్కెట్ సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఏపీఈడీఏ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మే 2026లో గుమ్లా జిల్లాలోని పాల్‌కోట్ ప్రాంతంలో ఏపీఈడీఏ ఒక ప్రత్యేక సామర్థ్య పెంపుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, కోత అనంతర నిర్వహణ పద్ధతులు, ఎగుమతి విధానాలపై ఎనిమిది రైతు ఉత్పాదక సంస్థల సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఇందులో అవగాహన కల్పించారు. తద్వారా వారు అంతర్జాతీయ ప్రీమియం మార్కెట్ల అవసరాలను తీర్చేలా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన విభాగాలు, జెఎస్ఎల్‌పీఎస్, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తల్లో అవగాహన పెంచేందుకు ఏపీఈడీఏ కోల్‌కతా ప్రాంతీయ కార్యాలయం సెప్టెంబర్ 19, 2025న దేవ్‌ఘర్ జిల్లా దేవీపూర్ బ్లాకులోని బస్వరియా గ్రామంలో మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల కోసం ‘ఎగుమతి ఆధారిత సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాన్ని’ నిర్వహించింది. ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులతో పాటు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, నాబార్డ్, ఏపీఈడీఏ అధికారులు సహా సుమారు 105 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఈడీఏ విధివిధానాలు, ఆర్థిక సహాయ పథకాలు, ఎగుమతి అవకాశాలు, కీలకమైన ఎగుమతి ప్రక్రియలు, ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనడానికి అందుబాటులో ఉన్న సంస్థాగత మద్దతుపై సమగ్ర అవగాహన కల్పించారు.
జార్ఖండ్ ఉద్యానవన రంగానికి ఉన్న పెరుగుతున్న ఎగుమతి సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. సామర్థ్య పెంపుదల, మార్కెట్ అనుసంధానం, ఎగుమతి సదుపాయాల ద్వారా మహిళా రైతు సంఘాలను బలోపేతం చేయడానికి ఏపీఈడీఏ చేస్తున్న నిరంతర కృషికి ఇది అద్దం పడుతోంది.
***
(रिलीज़ आईडी: 2282217)
आगंतुक पटल : 25